ఘోర ప్రమాదంలోనూ రాజకీయ మమత

fly222
కోల్‌కతాలోని బుర్రబజార్‌లో ఫ్లైవోవర్‌ నిర్మాణ దశలోనే కూలి పాతిక మందికి పైగా మరణించడం దేశాన్ని కలచివేసింది. బాధితులకు సహాయ చర్యలు ప్రమాద కారణాల నిర్దారణ తక్షణావసరాలు. కాని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం షరా మామూలుగా ప్రమాదం జరిగిన అరగంటలోనే అక్కడ ప్రత్యక్షమై వామపక్ష ప్రభుత్వ హయాంలోనే ఈ కాంట్రాక్టు ఇచ్చారు గనక వారిదే బాధ్యత అని ఆరోపణలు గుప్పించారు. ఐవిఆర్‌సిఎల్‌ అనే ఆ నిర్మాణ సంస్థ ప్లాను అడిగినా ఇవ్వకుండా దాటేసిందని కొత్త సంగతి చెప్పారు. 2009లో ఈ ఫ్లైవోవర్‌ నిర్మాణం ఖరారైనా చాలా కాలం వరకూ ముందుకు నడిచింది లేదు. అప్పటికి ఆ కంపెనీ బ్లాక్‌లిస్టులోనూ లేదని మాజీ మంత్రి అశోక్‌ భట్టాచార్య స్పష్టంగా ప్రకటించారు. తృణమూల్‌ ఎంఎల్‌ఎ బావమరిది ఈ కంపెనీతో లావాదేవీలు నడిపారు. 2013 వరకూ నత్తనడకే నడిచింది. అయితే ఎన్నికల్లో తాము కోల్‌కతాకు కానుక ఇచ్చినట్టుగా చెప్పుకోవడం కోసం ఎలాగో పూర్తి చేయవలసిందిగా ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. అవినీతికి తోడు ఈ హడావుడి కారణంగా నాసిరకం పనులు దారితీశాయనేది అందరూ అంటున్న మాట. వాస్తవాలు విచారణలో తేలాలి. కేంద్రం కూడా సహాయచర్యల విషయంలో జోక్యం చేసుకుంది. నిజానికి మొదట ప్రభుత్వం ఆ విషయంలోనూ వెనకబడింది. ముఖ్యమంత్రి అక్కడే బైఠాయించడం సహాయ చర్యలకు ఇబ్బందిగానూ మారింది. ి ఇది దేవుని చర్య అని కంపెనీ ప్రతినిధి ఎజికె మూర్తి అనడం మరింత విమర్శకు దారితీసింది. హైదరాబాదులోని ఈ కంపెనీ అధినేత ఈసుధీర్‌రెడ్డి ప్రయాణంలో వున్నారని అంటున్నారు. దేవుని చర్య అంటే ప్రమాదం అని చెప్పడమే తమ వుద్దేశమని మరో ప్రతినిధి సీత సర్దుబాటు చేశారు. ఈ లోగా కొల్‌కతా పోలీసులు సంస్థకు చెందిన అయిదుగురిని అరెస్టు చేశారు. హైదరాబాదులోనూ గతంలో ఇలాటి ప్రమాదం చూశాం. ఇన్‌ఫ్రా కంపెనీలు ప్రమాణాలు పాటించకపోవడం చాలా దుర్ఘటనలకు దారితీస్తున్నదని వాణిజ్యవర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *