అవకాశవాద చెలగాటంలో కాశ్మీర్‌

CeeCWo_XIAAJsh7
భారత దేశం అనేక అవకాశవాద కలయికలను చూసింది. కాని భౌగోళికంగానూ భద్రతా కారణాల రీత్యానూ అత్యంత కీలకమైన జమ్మూ కాశ్మీర్‌లో బిజెపి పిడిపిల మధ్య గత ఏడాది కాలంగా నడుస్తున్న కుటిల రాజకీయ కలయికను మాత్రం చూసి వుండదు. జనవరి 7న మఫ్తీ మరణిస్తే మూడు మాసాల పాటు రాజకీయ మల్లగుల్లాలు పడి ఏప్రిల్‌ 8 లోగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు ఇరు పార్టీల నేతలు. సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలో ఇంత రాజకీయ శూన్యం ఎందుకు సృష్టించారు? జాప్యానికి కారణాలేమిటి? పరిష్కార సూత్రాలేమిటి? అంతా నిగూఢమే.
దేశ స్వాతంత్రం తర్వాత కాశ్మీర్‌ హిందూ రాజు హర్‌సింగ్‌ పాకిస్తాన్‌తో కలవాలని లేదా స్వతంత్రంగా కొనసాగాలని రకరకాల పాచికలు వేశారు. ఆనాడు అక్కడ వున్న రామరాజ్య పరిషత్‌ అందుకు వంత పాడింది. అయితే స్వాతంత్ర యోధుడైన షేక్‌ అబ్డుల్లా నాయకత్వంలో ప్రజలు రాజును, పాకిస్తాన్‌ను వ్యతిరేకించి పోరాడి ఆ రాష్ట్రం భారతదేశంలో కొనసాగేందుకు కారకులైనారు. 1948లో రాజు ఆయననే పాలకుడుగా నియమించారు. తర్వాత ఆ రాష్ట్రాన్ని విలీనం చేసుకోవడం కోసం రాజ్యాంగంలో 370 వ అధికరణం పొందపర్చారు. రక్షణ, కరెన్సీ, విదేశ వ్యవహారాలు, సమాచార సంబంధాల విషయంలో కేంద్రం అధికారం అక్కడ పూర్తిగా వుంటుంది. మిగిలిన విషయాల్లో స్వయం ప్రతిపత్తినిస్తూ పార్లమెంటు ఆమోదించిన చట్టాలను కాశ్మీర్‌ శాసనసభ ఆమోదిస్తే అమలవుతాయని పేర్కొన్నారు. శాసనసభకు ఆరేళ్ల కాలవ్యవధివుంటుంది.
నాటి ప్రధాని నెహ్రూ అమెరికా కూటమి సలహాను పాటించి కాశ్మీర్‌ సమస్యను ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించారు. అయితే కొంత భాగం పాకిస్తాన్‌ బలవంతంగా ఆక్రమించింది గనక అందరి అభిప్రాయసేకరణ సాధ్యం కాదనే వాదనతో దాన్ని జరపలేదు. ఈ లోగా కాని కేంద్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం అక్కడ షేక్‌ అబ్దుల్లా పాలన సహించలేక ఆయన పాకిస్తాన్‌తో చేతులు కలిపారని ఆరోపించి 1953లో అరెస్టుచేసి 11 ఏళ్ల పాటు నిర్బంధించింది. తనకు ప్రజాపునాది లేకపోయినా ఢిల్లీ అండతో కాంగ్రెస్‌ పెత్తనం సాగించింది. 1964లో భారత పాక్‌ల మధ్య పలు ఘర్షణల సమయంలో మధ్యవర్తిగా ఉపయోగించుకుని మళ్లీ ప్రవాసం పంపించారు. 1975లో ఇందిరాగాంధీ ి షక్‌ అబ్దుల్లాతో రాజకీయ ఒప్పందం చేసుకుని ముఖ్యమంత్రి పీఠం అప్పగించారు. 1977లో ఎన్నికల్లో ఆయన పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పర్చారు.1982లో ఆయన మరణానంతరం ఫరూక్‌ అబ్దుల్లా గద్దెక్కారు. ఈ కాలమంతటా పేదరికం, నిరుద్యోగం, ప్రత్యేక సైనిక దళాల చట్టం వున్నా మొత్తంపైన సజావుగానే నడిచింది. కాని 1984లో ఇందిరాగాంధీ ఫరూక్‌ బావ జిఎంషాతో కలసి కుట్రపన్ని ఆ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. షా హయాంలోనే కాశ్మీర్‌ పరిస్థితి దిగజారిపోయింది. పాకిస్తాన్‌ నుంచి అక్రమ చొరబాట్లు తిరుగుబాటు కార్యక్రమాలు పెరిగాయి. ఫరూక్‌ కూడా పదవి లేనప్పుడు విదేశాల్లో వుంటూ ఎన్నికలకు ముందు మాత్రమే దేశంలో కనిపిస్తూ ప్లేబాయి తరహాకు పేరొందారు. వామపక్షాలుప్రాంతీయ పార్టీలతో పాటు కలసి పనిచేసిన ఆయన తమకు కేంద్రం సాయం అవసరం అనేవాదనతో 80 ల తర్వాత కాంగ్రెస్‌ బిజెపిలకే మిత్రులై పోయారు. ఈ సమయంలో పంజాబ్‌లోనూ సిక్కు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్‌ ప్రోత్సహించింది. ఇందిరాగాంధీ హత్యకు గురై రాజీవ్‌ గాంధీ ప్రధాని అయ్యారు. 1987లో ఫరూక్‌ అబ్దుల్లా మెడలు వంచి కాంగ్రెస్‌తో కలసి మిశ్రమ ప్రభుత్వ ఏర్పాటుకు వొప్పించారు.
1987లో విపిసింగ్‌ తిరుగుబాటు చేసి జనమోర్చా స్థాపించినప్పుడు కాశ్మీర్‌లో మఫ్తీ మహ్మద్‌ సయ్యిద్‌ ఆయనతోచేరారు. 1989 చివరలో దేశానికి మొదటి ముస్లిం హౌం మంత్రి అయ్యారు. ఆ సమయంలోనే ఆయన చిన్న కుమార్తెను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేయడం వారి షరతుల మేరకు ఉగ్రవాదులు కొందరిని వదలిపెట్లారు.అక్కడి నుంచి కాశ్మీర్‌ ఉగ్రవాదం కొత్త మలుపు తిరిగిందంటారు. స్వల్పకాలిక విపిసింగ్‌ ప్రభుత్వం జగ్‌మోహన్‌ను గవర్నర్‌గా పంపించడంతో ఫరూక్‌ రాజీనామా చేశారు. ఉగ్రవాద కార్యక్రమాలు పెరిగాయి. ఉగ్రవాదంవైపు ఆకర్షితులవుతున్న యువతను ప్రజాస్వామిక విధానంతో ఆకట్టుకోవలసింది పోయి అణచివేత విధానాలకే ప్రాధాన్యత నిచ్చారు. ఎట్టకేలకు మళ్లీ 1996లో ఎన్నికలు జరగ్గా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధికారంలోకి వచ్చింది. కాని 1998లో కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పడ్డాక నాటి బిజెపి అద్యక్షుడు మురళీ మనోహర్‌ జోషి శ్రీనగర్‌ యాత్ర అంటూ ఉద్రిక్తత పెంచారు. ముస్లింలు అధికంగా వుండే శ్రీనగర్‌కు హిందువులు అధికంగా వుండే జమ్మూకు మధ్య అగాధం పెరిగిపోయింది. కాశ్మీరీ పండిట్లపై దాడుల గురించి మాట్లాడుతూ బిజెపి దాన్ని మత సమస్యగా మార్చింది. 370 అధికరణం రద్దు అన్నది బిజెపి మూడు మౌలిక విధానాల్లో ఒకటిగా చేసుకున్నారు. సిపిఎం వంటి శక్తులు మాత్రమే కాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ ప్రజల హక్కులు కాపాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియ అమలు చేయాలని పదే పదే కోరింది.ఉగ్రవాదులను ఎదిరించి పోరాడింది. యూసప్‌ తరగామి వంటి వారు ఆ పోరాటంలో ముందు నిలిచారు.
మెహబూబా మఫ్తి ఫరూక్‌ కుటుంబ సభ్యులలాగే ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఆధునిక యువతి. ఆమె ఇద్దరుపిల్లల అవివాహిత మాత. 1996లో ఆమె కాంగ్రెస్‌ తరపున ఎంఎల్‌ఎగా గెలిచి మూడేళ్ల తర్వాత రాజీనామా చేశారు. 2002లో తన తండ్రి స్థాపించిన పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీలో చేరి ఆయనకు ప్రధాన అండగా నిలిచారు. కాంగ్రెస్‌తో కలసి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మెహబూబా అధికార దూతగా వ్యవహరించేవారు. కాశ్మీర్‌లో ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణ, ప్రత్యేక సైనిక దళాల శాసనం రద్దు, ఉగ్రవాద యువతతో షరతులు లేని చర్చలు వంటివి ఆమె నినాదాలుగా వుండేవి. పిడిపి విధానపరంగానే కాశ్మీర్‌ సమస్యపై పాకిస్తాన్‌తో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని చెబుతుంది. ప్రాంతీయ పార్టీగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను మించి ముస్లింలను ఆకట్టుకోవడం, ఉగ్రవాదులపట్ల ఒకింత మెతక వైఖరి చూపడం ఈ విధానంలో సారాంశం. పెద్ద మనిషిగా ముఫ్తి వున్నా దీనంతటికీ ఒక ప్రధానమైన జనాకర్షణీయ నాయకురాలుగా మెహబూబా పేరొందారు. 2009 ఎన్నికల్లో గెలిచిన ఒమర్‌ అబ్దుల్లా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో పర్యటనలు జరిపేవారు.
మోడీ మోతలో 2015లో జరిగిన ఎన్నికల్లో బిజెపి తనే అధికారంలోకి వస్తానన్నంత హడావుడి చేసింది. అయితే మత పరమైన విభజనలా జమ్మూలో బిజెపికి 27, కాశ్మీర్‌లో పిడిపికి 28 స్థానాలు వచ్చాయి.పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందన్న ఎన్‌సి 15 స్థానాలు తెచ్చుకోగా కాంగ్రెస్‌ కూడా అయిదు తెచ్చుకున్నది. లౌకిక కూటమి ఏర్పాటుకు అవకాశమున్నా పిడిపి నేతలు బిజెపితో చేతులు కలిపారు. ఇప్పటిలాగే అప్పుడు కూడా ఎడతెగని మంతనాల తర్వాత మార్చి1న మఫ్తీ మహ్మద్‌ నాయకత్వంలో బిజెపి పిడిపి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడింది. మధ్య కుదిరిన ఒప్పందంలో చాలా అంశాలను పిడిపి బలపడ్డం ఇష్టంలేకనే కేంద్రం అమలు చేయలేదు. వరదలు వస్తే ఏదో గొప్ప సహాయం ప్రకటించినా నిజంగా చేరింది స్వల్పం. ఇంతలోనే ముఫ్తి మరణించడంతో సంక్షోభం నెలకొన్నది. నిజానికి దానివల్ల ఎలాటి సమస్య రానవసరం లేదుగాని ఇరుపార్టీల స్థార్థాలే అందుకు కారణమైనాయి. బిజెపితో కొనసాగితే తన సంప్రదాయ పునాది పోతుందని పిడిపి భయం. అందుకే విచారం పేరిట కొన్నాళ్లు వివరణ కావాలంటూ మరికొన్నాళ్లు మెహబూబా సమయం తీసుకుంటూ లోలోపల చర్చలు సాగించారు. అయితే అంగుళమైనా దిగిరావడానికి మోడీ ప్రభుత్వం బిజెపి నాయకత్వం సిద్ధం కాలేదు. తన తండ్రి అనేక ఒత్తిళ్లు అవమానాలు ఎదుర్కొన్నారని విశ్వాస లేమి సమస్యగా వుందని ఆమె పదే పదే ప్రకటించారు. మిశ్రమ ప్రభుత్వ ఏర్పాటు ప్రజల మద్దతులేని నిర్ణయమని దాన్ని పునరంచనా వేసుకోవాలని కూడా వ్యాఖ్యానించారు. ఈ మిశ్రమ కూటమి వల్ల ఆరెస్సెస్‌ కార్యకలాపాలు పెరుగుతున్నట్టు అదే సమయంలో పిడిపి పట్టుతగ్గుతున్నట్టు కూడా నివేదికలున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక ప్యాకేజీ అందించడం, ప్రత్యేక సైనికదళాలను వెనక్కు తీసుకోవడం, యువతతో చర్చలు ప్రారంభించడం వంటి అనేక షరతులు పెడుతున్నట్టు మెహబూబా మాట్లాడినా చివరకు బేషరతుగానే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించడం విచిత్రం! ఇరుపార్టీల మధ్య సాగిన ఈ రాజకీయ ప్రహసనం సమయంలో శూన్యత పెరిగి ఉగ్రవాద ఘర్షణలు సైనికుల కాల్పులు వంటి తీవ్ర ఘటనలే జరిగాయి. గొడ్డుమాంసం వివాదం, కాశ్మీర్‌ ప్రత్యేక పతాకం వంటివాటిపై బిజెపి ఆరెస్సెస్‌లు రభస చేస్తున్నాయి. జెఎన్‌యు వివాదంలో అఫ్జల్‌గురు సమస్య వచ్చాక ఆయన అవశేషాలు గౌరవంగా ఖననం చేయాలని అధికారికంగా కోరిన పిడిపితో బిజెపి ఎలా కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే విమర్శ తీవ్రంగానే వుంది. అయినా అన్నీ దిగమింగి ఇరుపక్షాలూ అధికారం పంచుకోవడం అవకాశవాదంలో మలిఘట్టం. ఇందుకు వారు మూల్యం చెల్లించడం ఎలాగూ తప్పదు గాని రాష్ట్రం దేశం మరెంత మూల్యం చెల్లించాల్సి వస్తుందనేదే ఆందోళన కలిగించే విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *