బాహుబలుని బాధ్యతలు

bahubali2222
బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రంగా వచ్చినందుకు రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభలూ ఇందుకు అభినందనలు తెలిపాయి. నిజానికి ఈ గొప్ప విజయానికి సంతోషించని తెలుగువారుండరు. అన్ని వైపుల నుంచి అభినందనలే వస్తున్నప్పుడు ఏ పాటి విమర్శనాత్మక వ్యాఖ్యనైనా స్వీకరించడం కష్టమే అవుతుంది అయినా ప్రశ్నించక తప్పదు – ఈ విజయం విజువల్స్‌కా? విషయానికా? చూపించిన తీరుకా? చూపించిన కథకా? ఈగ లో సాంకేతిక ప్రక్రియలకు కూడా గతంలో జక్కన్న జాతీయ అవార్డు సంపాదించారు.మళ్లీ అలాటి అవార్డే తెచ్చుకోవడం ఆయనకు గొప్పతనం కాదు. వాస్తవానికి ఉత్తమ దర్శకుడు అవార్డు ఇవ్వనందుకు దాసరి నారాయణరావు అసంతృప్తి వెలిబుచ్చారు కూడా. ఆ గౌరవం బాజీరావు మస్తానీ దర్శకుడు సంజరులీలా బన్సాలీకి దక్కింది. దాంతోపాటే ఆ చిత్రానికి అనేక అవార్డులు వచ్చాయి. అయితే బాహుబలి ఉత్తమ చిత్రం అన్నారు గనక మొత్తానికి కలిపి ఇచ్చారని మనం అనుకోవాలి గాని ో రాజమౌళి అనుకోకూడదు. ఎందుకంటే బాహుబలి చూసిన ప్రేక్షకులే గాక పరిశ్రమలో వారంతా అదొక సినిమా కాదు అనుభవం అన్నారు. ఇందులో అభినందన వుంది, అభిప్రాయమూ వుంది. కథ పాత్రలు వంటి వాటిని గురించి గాక ఇతర అంశాలు చెప్పుకోవడం విశేషం.
ప్రభాస్‌ ఇతర చిత్రాలు చేయకుండా దీనికోసమే శ్రమించినా- రానా దేహదారుడ్యమే గాక బాగా నటించినా ప్రేక్షకులు ప్రధానంగా కట్టప్ప పాత్ర గురించి మాట్లాడుకున్నారు. శివగామీదేవిగా రమ్యకృష్ణ శక్తివంతంగా నటించందన్నారు. ప్రచారంలోనూ ఆమెకే పెద్ద పీట. శివుడిని పెంచిన గిరిజన తల్లి పాత్రలో కాస్సేపైనా రోహిణి, అసలు తల్లిగా అనుష్క చేసింది కూడా తక్కువేమీ కాదు. మొత్తానికి ప్రధాన పాత్రల కన్నా కట్టప్ప, శివగామీ దేవి బలమైన ముద్ర వేశారంటే ఏం చెప్పాలి? రెండవ భాగంలో బహుశా అనుష్క అలాటి ముద్రే వేయొచ్చు.
కట్టప్ప ఎందుకు చంపాడన్న కృత్రిమమైన ఆసక్తి రేకెత్తించి మొదటి భాగం ముగించకపోతే ఇంకా ఏమైనా ఉత్కంఠ మిగిలివుండేదా? ఆ విధంగా చూస్తే ఇది బాహుబలి బిగినింగ్‌ను కన్‌క్లూజన్‌గా చేసి కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ చేయడంలో కుతూహలం పెరిగింది. కట్టప్ప ఎందుకు చంపాడని దేశమంతా మాట్లాడుకున్నారంటే తర్కబద్దంగా అనిపించలేదని అర్థం చేసుకోకూడదా? రెండవ భాగంలో చూపించే గతం అంత ఒప్పుదలగా వుండకపోతే దాని ప్రభావం అంత తీవ్రంగానే వుంటుంది. రాజమౌలి విజయేంద్ర ప్రసాద్‌లు అంత అజాగ్రత్తగా వుంటారనుకోలేము గాని మొదటి భాగం చూశాక అనిపించేమాట అది.

మొదటిసారి జాతీయ పురస్కారం తెచ్చిన రాజమౌళిని మనసారా అభినందిస్తూనే వచ్చిన ఆర్థిక విజయానికి తగిన భారీ స్థాయిలోనే రెండవ ముగింపు భాగంలో మానవీయ చైతన్యం అందిస్తారని ఆశిద్దాం. కేవలం రాజకుటుంబం కుట్రల కథే అయితే జనం తేలిగ్గా మర్చిపోతారు. విఠలాచార్య చిత్రాల్లో ఎన్టీఆర్‌ చేసిన మేరకైనా ప్రభాస్‌ తమన్నా అనుష్క వంటి వారు జనం తరపున పోరాడితేనే గుర్తుంచుకుంటారు. ఇప్పటి వరకూ చూస్తే రాజమౌళి చిత్రాల్లో విశ్వసపాత్రతకే పెద్దపీట వేసి ఆవేశం పుట్టిస్తుంటారు. సింహాద్రిలో జూనియర్‌ అయినా, మగధీరలో రామ్‌ చరణ్‌ అయినా.. బాహుబలిలో కనీసం మరో అడుగు ముందుకుపడుతుందని ఆశిద్దాం.
మొదటి భాగంలో రెండు పాటలు బాగున్నా వచ్చే దాంట్లో మరింత బాగుండాలి. మరింత అంటే బాహుబలి స్థాయిలో! లోక్‌సత్తా జయప్రకాశ్‌తో సంచరించి చానళ్లలో యువ కార్యక్రమాలు కూడా నడిపిన రాజమౌలి చిత్రాల్లోనూ ఆ తరహా సృహను పెంచే దశ వస్తుందని కూడా ఆశించాలి. అలా అని చేతులు కాల్చుకోకుండా ఇదే నైపుణ్యాన్ని దానికి జోడించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *