త్యాగాలు వద్దు, ప్రతిఫలమే ముద్దు!

తెలంగాణ శాసనసభ్యుల జీతాలను 400 రెట్లుపైగా పెంచడం చాలా ప్రశ్నలను ముందుకుతెస్తున్నది. ఇంత కాకున్నా ఆంధ్ర ప్రదేశ్‌లోనూ భారీగానే పెంచారు. పెంచారు అనడంకన్నా పెంచుకున్నారు అనడం సబబు.ఎందుకంటే ఆమోదం వేసుకోవలసింది వారే గనక! మారుతున్నకాలానికి పెరుగుతున్న ఖర్చులకు తగినట్టు ప్రజలప్రతినిధుల బాధ్యతల నిర్వహణకు సదుపాయాలు కల్గిస్తూ జీత భత్యాలు నిర్ణయించవచ్చు. కాని ప్రభుత్వోద్యోగులతోనో సాఫ్ట్‌వేర్ కుర్రాళ్లతోనో ో ప్రజా ప్రతినిధుల జీతాలు పోల్చుకోవడం సమజంసం కాదు. ఎందుకంటే ఇది గౌరవప్రదమైన ఐచ్చిక బాధ్యత తప్ప ఎవరూ ఇచ్చిన ఉద్యోగం కాదు. అన్నిరకాల భత్యాలు కలసి నెలకు మూడు లక్షల వరకూ ఎంఎల్‌ఎలకు ముట్టజెప్పడం కమ్యూనిస్టులు తప్ప ఇతర సభ్యులందరూ ఈ పెంపును ఆహ్వానించారు. మరింత పెంచాలని వివిధ రకాల నిధులు అందుబాటులో వుంచాలని అనేక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వాటిని కొంత వరకూ ఆమోదించి మరింత పరిశీలన చేస్తామని హామీ నిచ్చారు. అదేసమయంలో పాత్రికేయులు దీనిపై విమర్శలు చేయొద్దని సలహా కూడా ఇచ్చారు. త్యాగాల కాలం కాదు గనక ప్రతిపలంవుండాల్సిందేనని దాదాపు సూటిగానే చెప్పేశారు. ప్రజా ప్రతినిధులకు ఎన్నో ఖర్చులు వుంటాయంటూ ఇంటికి వచ్చిన వారికి టీలు ఇవ్వకపోతే సన్నాసి అంటారనీ, గుడికి బడికి విరాళాలు అడిగితే ఇవ్వాల్సి వుంటుందని ఉదాహరణలిచ్చారు. ఇందులో ఏమైనా నిజం వుండొచ్చు గాని ప్రజా ప్రతినిధులైన వారు సేవా గుణంతో పనిచేయడం ముఖ్యం కాదా? మిగిలిన ఉద్యోగులు లేదా ఏజంట్లలాగా వారి ప్రతిసేవకూ మూల్యం లెక్కగట్టడం న్యాయమేనా? ఒకప్పుడు పార్లమెంటులో మూడువేల జీతం అన్నందుకు పుచ్చలపల్లి సుందరయ్య తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆయనలా అందరూ సైకిల్ ఎక్కి రానవసరం లేదు గాని కార్ల బారు అనుచరుల సమూహాలు వుండాల్సిందేనా? నిరాడంబరంగా వుండేవారు నిబద్దంగా సేవ చేసిన చేస్తున్న అనుభవాలు ఎన్ని లేవు! ప్రజా ప్రతినిధుల దాకా ఎందుకు కొందరు సామాన్యులు కూడా శక్తికి మించి పరులకు సహాయం చేయడం లేదా? ఎంఎల్‌ఎలు నీతిగా వుండాలంటే తగినంత జీతం ఇవ్వాలని కొందరి వాదన. అంటే భారీ జీతాలు వేల కోట్ల లాభాలు వున్నవారు కుంభకోణాలకు పాల్పడ్డం లేదా? ఎంపిగా వున్న విజరు మాల్యాలు, మంత్రులైన గాలి జనార్థనరెడ్లు దేనికి సంకేతాలు? స్థానిక సంస్థలనూ కార్యకర్తలనూ పక్కనపెట్టి అన్నిటిలోనూ ఎంఎల్‌ఎలు ఎంపిలే నెత్తికెత్తుకోవడమెందుకు? ఇలాటి చాలా ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం అవుతాయి. ప్రజా సేవ కోసం వస్తు రూపేణా రీ ఇంబర్సు చేస్తే అభ్యంతరం వుండదు. అంతేగాని తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేసే ఖర్చులన్నీ ప్రజలే భరించాలనుకోవడం సరికాదు. ఇప్పుడు శతకోటీశ్వరులే అధికంగా ఎన్నికవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఒక కొండా విశ్వేశ్వరరెడ్డి లేదా ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక గల్లా జయదేవ్ ఇంటికి వచ్చిన వారికి అతిధ్యం ఇవ్వలేక ప్రభుత్వ సహాయంపై అధారపడాల్సిన పరిస్థితి ఎన్నడూ వుండదు. సంపన్నులు వారిపై ఆధారపడిన వారే చట్టసభలకు అధికంగా వస్తుంటే వారి ప్రతి ఖర్చునూ ప్రభుత్వం భరించవలసిన అగత్యమేమిటో అర్థం కాదు. ఇలా అయితే రేపు ఓట్ల కొనుగోలుకు చేసిన ఖర్చు కూడా సబ్సిడీగా ఇవ్వాలా?
నిజానికి శాసనసభ్యులను కట్టిపడేసుకోవడానికి ఆకట్టుకోవడానికి అస్త్రంగానే ఈ అసాధారణ పెంపుదల ప్రకటించారన్న అభిప్రాయం కలిగితే తప్పుపట్టడానికి లేదు. వేలాది మంది కార్మికులు ఉద్యోగులు జీతాల పెంపుకోసం పోరాడి అలసిపోతుంటే ఎంఎల్‌ఎలు తమ జీత భత్యాలు తామే భారీగా పెంచుకోవడం ఎలాటి సంకేతాలిస్తుందో అలోచించాలి. ఎపిలో. రైల్వే ప్రయాణానికి కూపన్లు ఇచ్చే బదులు లక్ష రూపాయలు నెలకు భత్యం ఇవ్వాలనే నిర్ణయం చేశాను. గతంలో మెడికల్ బిల్లులను కూడా మాయ చేసి శిక్షలు అనుభవించిన ఉదాహరణలున్నాయి. పార్లమెంటులో ప్రశ్నల కుంభకోణం, పాస్‌పోర్టుల కుంభకోణం,ఇక్కడ రాష్ట్రాల్లో రకరకాల అవినీతి వ్యవహారాలు కేవలం ఎంపిల ఎంఎల్‌ఎల పేదరికం వల్లనే జరిగానవి కావు. పోనీ ప్రస్తుత సభ్యులు విధి నిర్వహణకోసం పెంచారనుకుంటే మాజీల పెన్షన్తు ఎందుకు బారీగా పెంచారు కదా! అందువల్ల ఇది రాజకీయ నేతలు తమకు తాము ఇచ్చుకున్న బహుమానం వంటిదే. . ఈ పెంపుదల వల్ల ఎంఎల్‌ఎలు ఎంఎల్‌సిలు ఒక ప్రత్యేక వృత్తి రాజకీయ వర్గంగా స్థిరపడిపోవడం ఖాయం. కార్పోరేట్ గవర్నెన్స్ అంటే ఇదే. త్యాగాలకు కాలం కాదని ముఖ్యమంత్రే చెబుతుంటే మరో విధంగా మాట్లాడటానికి ఏముంది?
గాంధీలు సుందరయ్యలే కాదు. రెండు సార్లు త్రిపుర ముఖ్యమంత్రిగా పనిచేసిన నృపేన్ చక్రవర్తి ఓడిపోయాక సూట్‌కేసులో బట్టలు పెట్టుకుని రిక్షాలో బయిటకు వచ్చారు. ఆయన నాకు కూడా మిత్రుడైన ఒక జర్నలిస్టుతో పాటు రూములో వుండేవారు. ఇప్పుడు అక్కడ మాణిక్ సర్కారు కూడా చిన్న అపార్టుమెంటులోనే వుంటున్నారు. బెంగాల్‌ను అప్రతిహతంగా పాలించిన జ్యోతిబాసు కూడా ఎన్నడూ భారీ ఆడంబరాలకు పోయింది లేదు. కేరళ ప్రజల ఆరాధ్యనేత ఇఎంఎస్ నంబూద్రిపాద్ వృద్ధాప్యంలోనూ అహౌరాత్రులు రాత చదువు రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తూనే నిరాడంరబరమైన జీవితమే గడిపారు. కాంగ్రెస్‌లోనూ లాల్‌బహుదూర్‌శాస్త్రి, కామరాజ్ నాడార్ వంటివారు (జనసంఫ్‌ు మాజీ అద్యక్షుడైన దీన దయాల్ ఉపాధ్యాయ వంటివారి గురించి అలాగే చెబుతుంటారు గాని ఆయన ముఖ్యమంత్రి చేసిన వారు కాదు. అయినా అభినందనీయులే) పరిపాలనా బాధ్యతలు నిర్వహించలేదా? మారిన కాలంలో రాకపోకలు సంబంధాలు సులభమైనాయి గాని జటిలం కాలేదు.కనీసంగా పెంచుకోవడం వేరు, గరిష్ట పరిమితి కూడాదాటిపోవడం వేరు. అయినా మీరు మాట్లాడవద్దంటే కష్టమే!