కాశ్మీర్‌లో కూడా రాజకీయ క్రీడలేనా?
బిజెపి కార్యవర్గ సమావేశాల సందర్భంగా జాతీయత విషయంలో రాజీ ప్రసక్తిలేదని అద్యక్షుడు అమిత్‌షా బల్లగుద్ది ప్రకటించారు, జెఎన్‌యులోకి ప్రతిపక్ష నేతలు వెళ్లడం నేరమని ఆరోపించారు. ఇవన్నీ గత కొద్ది వారాలుగా సాగుతున్న ప్రహసనాలే గనక ఫర్వాలేదు. కాని జమ్మూ కాశ్మీర్‌లో ముఖ్యమంత్రి ముఫ్తి మహ్మడ్ సయ్యిద్ మరణించిన రెండు మాసాల తర్వాత కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అక్కడి ప్రధాన పక్షమైన పిడిపితో సహకరించకుండా రాజకీయ శూన్యాన్ని ఎందుకు సృష్టించినట్టు? సున్నితమైన ఆ సరిహద్దు రాష్ట్రంలో ఇలాటి పాలనా రాహిత్యం దేశానికి క్షేమమా? పిడిపితో గతంలో కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశాల అమలుకు హామీ నిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని మెహబూబా ముఫ్తి అడుగుతున్న దానికి ఎందుకని స్పందించడం లేదు? అప్జల్ గురును ఆరాధించే ఆ పార్టీతో కలసి అధికారం పంచుకుంటే దేశం ముందు తమ జాతీయ రాజకీయ ప్రచారాలు సాగవని సంకోచిస్తున్నారా? అలా అయితే గతంలో కలసి చేసిన పాలన మాటేమిటి? వాస్తవం ఏమంటే మఫ్లి మహ్మడ్ మరణంతో ఆయన కూతురును బలపర్చడానికి ురిన్ని షరతులు విధించి రాజకీయం చేయొచ్చని ఆశించారు. కాశ్మీరీ గుర్తింపును నొక్కి చెప్పడం, కొన్నిసార్లు వేర్పాటు వాద నినాదాలను కూడా బలపర్చడం చేసిన పిడిపికి బిజెపి తరహా జాతీయ వాద ప్రచారం బొత్తిగా సరిపడదు. కనుక ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని తెగతెంపులు చేసుకుంటే పోతుందనే భావన ఆ పార్టీ నాయకులు కొందరిలో వుంది. అద్యక్షుడు అమిత్‌షాను కలిసినప్పుడు అంతా బావుందని చెప్పిన మెహబూమా ప్రధాని మోడీని కలిసిన తర్వాత అసంతృప్తితో తిరిగిరావడం యాదృచ్చికం కాదు. బిజెపి తమకు ఇచ్చిన వాగ్డానాలు నిలబెట్టుకోలేదని ఆ పార్టీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఎన్నికల ముందు ప్యాకేజీలు ప్రకటించి తర్వాత చేతులు ఎత్తేయడం మోడీకి పరిపాటిగా మారింది. బీహార్ ఎన్నికల ముందు వ ఆయన మాటలు విన్నవారు మొన్నటి పర్యటనలో వాటి వూసే ఎత్తుకపోవడంతో ఆశ్చర్య పోయారు. ఇదే కాశ్మీర్ లోనూ పునరావృతమవుతున్నది. ఆంధ్ర ప్రదేశ్‌కు మట్టితీసుకొచ్చిన తీరు కూడా చూశాం. కనుకనే ఈ ప్రభుత్వానికి రాష్ట్రాల పట్ట బాధ్యతా యుత స్పందన లేదని భావించవలసి వస్తుంది. అయితే అంత కీలకమైన కాశ్మీర్ వంటి చోట్ల కూడా ఇలాటి రాజకీయ చదరంగం తగునా అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.
