రోజా సస్పెన్షన్ – రాజకీయ ఘర్షణ- రాజ్యాంగ మీమాంస
వైఎస్సార్ పార్టీ ఎంఎల్ఎ ఆర్.కె. రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయడంపై ఉమ్మడిహైకోర్టు ఏకసభ్య ధర్మాసనం న్యాయమూర్తి ఎ.రామలింగేశ్వరరావు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం సభలో ప్రవేశించేందుకు అసెంబ్లీ మార్షల్స్ అనుమతించలేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్ దీనిపై సభాపతి ఉత్తర్వులు చూపించమని అడిగినప్పుడు సరైన సమాధానం లేదు. సభలో వైసీపీ ఎంఎల్ఎలు స్పీకర్‌ను పూర్తిగా చుట్టుముట్టడం, వాయిదా, నిరసన కార్యక్రమాలు, రోజాను నిమ్స్‌లో చేర్పించడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. కోర్టు ధిక్కారానికి సంబంధించి వైసీపీ పిటిషన్‌ను, ద్విసభ్య బెంచికి కేసును అప్పగించాలంటూ అసెంబ్లీ కార్యదర్శి అభ్యర్థనను సోమవారం పరిశీలించాలని కోర్టు నిర్ణయించింది. అప్పటి వరకూ సభను బహిష్కరిస్తామని వైసీపీ ప్రకటించింది.
రోజా సస్పెన్షన్ కేసులో నాలుగు అంశాలున్నాయి. మొదటిది- ఆమె ఆ రోజున శాసనసభలో చేసిన అనుచిత వ్యాఖ్యానాలు ప్రత్యేకించి తనను అవమానించారంటూ అనిత అనే దళిత మహిళా ఎంఎల్ఎ ఫిర్యాదు రెండు- ఈ సందర్భంగా ఆమెను ఏకంగా ఏడాది పాటు సభనుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం మంచి చెడ్డలు మూడు- నిర్ణయం తీసుకోవడంలో నిబంధనల పాటింపు లేదా ఉల్లంఘన నాలుగు- ఇప్పుడు న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో తీసుకోవలసిన వైఖరీ చట్టసభల ప్రతిపత్తికి సంబంధించిన సమస్యలు.
పెద్ద తప్పయినా ..ఏడాది శిక్షా?
రోజా ఆ రోజున సభలో చేసిన వ్యాఖ్యలు వ్యవహరించిన తీరు ఖచ్చితంగా తప్పే. అధికార పక్షమే తమను రెచ్చగొట్టిందనీ, అవతలివారి ప్రవర్తన చూపించకుండా తమను దోషులుగా చూపిస్తున్నారని వైసీపీ చెప్పేది వాస్తవమే అనుకున్నా రోజా తీరు పొరబాటే అవుతుంది. దానికి ఆమెతో క్షమాపణ చెప్పిస్తే సరిపోతుంది కదా అంటే అది వరకు క్షమాపణ చెప్పి కూడా అలాగే చేస్తున్నారని అధికార పక్షం వాదన. అయినా సరే సమావేశ కాలానికి మించి సస్పెన్షన్ చేయడానికి నిబంధనలు అనుమతించడం లేదు. అది కూడా సభా హక్కుల సంఘానికి నివేదించి దాని సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకోవాలి. కాని సభ అత్యున్నతమైనదనే వాదనతో ఆ తతంగం లేకుండానే ఏకంగా ఏడాది పాటు ఆమెను సస్పెండ్ చేయడం తీవ్రమైన విషయమనడంలో సందేహం లేదు. బండి ముందు గుర్రం వెనకలాగా నిర్ణయం అమలు ప్రారంభించి తర్వాత ఈ సమస్యపై ఒక సభా సంఘాన్ని నియమించారు. ఈ విధంగా ప్రజా ప్రతినిధులను దీర్ఘ కాలం సస్సెండ్ చేసేట్టయితే వారిని ఎన్నుకున్న నియోజకవర్గాలకు ప్రాతినిద్యం వుండకుండా పోతుంది. సరిగ్గా ఈ వాదనతోనే రోజా హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆమె పిటిషన్‌ను వెంటనే విచారించడానికి నిరాకరణ ఎదురైంది. ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లాక అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలపైనే హైకోర్టు మళ్లీ విచారణకు తీసుకుని అసెంబ్లీ నిర్ణయం సరైన నిబంధనల ప్రకారం జరగలేదని అభిప్రాయపడింది. అయితే ఇరుపక్షాల వాదనలు వినడానికి మరో నెల రోజుల గడువు నిస్తూ సస్పెన్షన్ నిర్ణయం అమలు తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.ఈ క్రమంలో న్యాయమూర్తి చట్టసభ అధికారాలను, నిర్ణయాలను కూడా పూర్తిగా గౌరవిస్తూనే మాట్లాడారు. పేర్కొన్న నిబంధనల ప్రకారం ఏడాది సస్పెన్షన్ చెల్లుతుందా లేదా అన్నదే విచారిస్తానని తెలిపారు..
నిబంధనల పొరబాట్లు
రోజా విషయంలోనూ ఏకంగా ఏడాది సస్పెండ్ చేసేందుకు ఇప్పుడున్న నిబంధనలు అవకాశమివ్వడం లేదు. ఇది స్పీకర్ తీసుకున్న నిర్ణయంగా గాక సభ తీసుకున్నదిగా శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టంగా చెప్పారు. అయితే అదే సమయంలో 340(2) నిబంధన కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించడం కుదరదని హైకోర్టు ఎత్తిచూపింది. దాని ప్రకారమైతే ఒక సమావేశం కాలానికి తప్ప సస్పెండ్ చేసే అవకాశముండదని తెల్పింది. మరి సభా వ్యవహారాలలో ఆరితేరినట్టు చెప్పే వారంతా ఇంత యథాలాపంగా తప్పు చేశారంటే ఎంత ఏకపక్షంగా అనాలోచితంగా నిర్ణయం తీసుకున్నారో తెలుస్తుంది. దీనికి మంత్రి యనమలపైన అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణపైన ముఖ్యమంత్రి ఆగ్రహౌదగ్రులవుతున్నారు గాని అసలు ఇంతటి గజిబిజికి దారితీసిన వైఖరిని పునరాలోచించుకోవడానికి సిద్దంగా లేరు. మొన్న ప్రభుత్వంపై అవిశ్వాసం, తర్వాత స్పీకర్‌పై అవిశ్వాసం చర్చల సందర్భంలో కూడా ఏకపక్షంగా నిబంధనలు సస్పెండ్ చేసి మూజువాణి ఓటుతో ఒకసారి, ఆ రోజుకు ఆ రోజే చర్చ చేపట్టి మరోసారి అయిందనిపించారు. వీటిని ముందుగా పసిగట్టలేకపోయిన ప్రతిపక్షం గగ్గోలు పెట్టినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు కూడా రాజ్యాంగం 212వ అధికరణం ప్రకారం చట్టసభల కార్యకలాపాలను కోర్టులలో సమీక్షించే అవకాశం లేదని చెబుతున్నది గనక దాన్ని ఆశ్రయించి పరువు దక్కించుకోవచ్చని అధికార పక్షం ఆశిస్తున్నది. అయితే అదే సమయంలో రోజాను రానివ్వకుండా లిఖిత పూర్వక ఆదేశాలిస్తే కోర్టులను ధిక్కరించినట్టవుతుంది గనక ద్విసభ్య బెంచి విచారణ కోరుతూ పిటిషన్ వేసి వ్యవధి పొందింది. ఈ లోగా రాజకీయంగా దళిత నేతలతో మాట్లాడించడం, సాంకేతికంగా సభలో మరో తీర్మానం ఆమోదించం చేస్తే సరిపోతుందని దాని ఆలోచనగా కనిపిస్తుంది. చేసిన పొరబాటుకు ఆమెకు శిక్ష విధించడం, దానిపై అందరి అనామోదం ఆక్షేపణలు రావడం జరిగిపోయింది. ప్రస్తుత సమావేశాలు కూడా పూర్తయిపోతాయి గనక కోర్టు ఉత్తర్వులపై తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పొచ్చు.లేదా క్షమాపణలు చెప్పింది రద్దు చేయొచ్చు. అంతేగాని ఈ ఘర్షణతో సభా సమయం వృథా చేయడం ఎవరికి లాభం? సోమవారంనాడు ఈచర్చ వచ్చినప్పుడు కూడా పెద్దగా కొత్త పరిష్కారాలు పరిస్థితులు వుంటాయని ఆశించలేము. వైసీపీ కూడా రోజాకు న్యాయం జరగాలని పోరాడుతూనే సభను ప్రతిష్టంభన వల్ల కలిగే నష్టాన్ని గుర్తించాల్సి
వుంటుంది.పైగా ఉద్రిక్తత వచ్చాక తమ వారి మాటలు చేతలపై ఇరు పక్షాలకూ పెద్ద అదుపు వుండటం లేదు. అసలు ఉద్దేశపూర్వకంగానే ఇలా దారి తప్పిస్తున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏమైనా పదేపదే సభ వాయిదా పడటం స్తంభించిపోవడం ఎప్పుడూ అధికార పక్షానికే లాభం తప్ప ప్రతిపక్షానికి కాదు. దాదాపు ప్రస్తుత సభల కాలం సగం ముగిసిపోతున్నా ఇంతవరకూ అర్థవంతమైన చర్చ జరిగే పరిస్థితి రాకపోవడం ఆందోళన కరం. ఇందులో మరో తమాషా ఏమంటే శాసనసభలో ఇంతగా నల్లచొక్కాలువేసుకుని నిరసన తెల్పుతున్న వైసీపీ వారు మండలిలో మామూలుగానే వుండటం..వారిని అధికార పక్షమే అపహాస్యం చేయడం.. అంటే చాలా సందర్భాల్లో లాగే ఇప్పుడు కూడా వైసీపీ మరింత సమగ్ర వైఖరితీసుకోవలసి వుందన్నమాట. అధికార పక్షం కూడా మొండి తనం మాని పట్టువిడుపులు ప్రదర్శిస్తే సమస్య వుండదు.
ప్రజాస్వామిక పరిష్కారం
ఇక నాల్గవది ఇరు వ్యవస్థల మధ్య సంబంధాలకు సంబంధించిన మౌలిక సమస్య. గతంలో మధ్యప్రదేశ్, తమిళనాడు,మహారాష్ట్ర, హర్యానా వంటి చోట్ల సభ్యులను తొలగించినప్పుడు కోర్టులు ఇచ్చిన ఆదేశాలు తీర్పులు సమస్యలకు దారితీశాయి. 2005 డిసెంబరులో ప్రశ్నల కుంభకోణం సందర్భంలో అవినీతికి పాల్పడిన 11 మంది ఎంపిల సభ్యత్వ రద్దు సమయంలోనూ ఇలాటి వివాదమే ఏర్పడింది. వారి విషయం సభా హక్కుల సంఘానికి నివేదించకుండా నిర్ణయం తీసుకోవడం అందుకు 102వ నిబంధన వినియోగించడం చెల్లదని సుప్రీం కోర్టు భావించింది. దీనిపై కోర్టుకు హాజరై వాదన ఇవ్వాల్సిందిగా అప్పటి స్పీకర్ సోమనాథ్ చటర్జీకి నోటీసు పంపించింది. దానిపై ఆయన అఖిలపక్ష సమావేశం జరపగా ఈ నోటీసును పాటించాల్సిన పనిలేదని దాదాపు అందరూ అభిప్రాయపడ్డారు. చర్యకు గురైన వారిలో అయిదుగురు బిజెపికి చెందిన వారు గనక ఆ పార్టీ మాత్రం స్పీకర్ తను వెళ్లేబదులు తన ప్రతినిధిని పంపి వాదన వినిపించవచ్చని చెప్పింది. ఒక వేళ నేనే వెళ్లినప్పటికీ చట్టసభల స్వతంత్ర ప్రతిపత్తి మాత్రం రాజీపడకూడనిదని సోమనాథ్ వ్యాఖ్యానించారు. అంతకు ముందు పివినరసింహారావు ప్రభుత్వ హయాంలో ముడుపులుతీసుకున్న జెఎంఎం సభ్యుల విషయంలోనూ ఏ చర్య తీసుకోవాలో సభే నిర్ణయించాలని కోర్టు స్పష్టం చేసింది. చట్టసభలు న్యాయవ్యవస్థ,కార్యనిర్వాహక వ్యవస్థ వీటి మధ్య సంబంధాల విషయంలో భారత రాజ్యాంగం స్పష్టంగా వుంది. ఈ మూడూ రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. అదే పూర్తి పార్లమెంటరీ విధానం గల ే బ్రిటన్‌లో చట్టసభలే తప్ప రాజ్యాంగం చివరి మాట కాదు. అద్యక్ష పాలన గల అమెరికాలోనైతే సుప్రీం కోర్టు (ఫెడరల్ కోర్టు)ది అత్యున్నత అధికారం. భారత దేశం ఫెడరల్ యూనిటరీ లక్షణాలు రెండూ కలిగివున్నందున స్పీకర్ నిర్ణయం అంతిమమైనప్పటికీ – ఇక్కడ కోర్టులు చట్టసభలు చేసిన చట్టం లేదా చర్య రాజ్యాంగ మౌలిక సూత్రాల పరిధిలో వుందా లేదా అని సమీక్షించే అధికారం కలిగివుంటున్నాయి. రాజ్యాంగం 105 అధికరణం, 122(1)(2)అధికరణాలు పార్లమెంటు స్పీకర్‌కు సభ్యులకు విధి నిర్వహణకు సంబంధించి తిరుగులేని అధికారాలిస్తున్నాయి. 194(3) అదే విధమైన అధికారాలను శాసనసభలకు ఇస్తున్నది. స్పీకర్ పరిపాలనాధికారాలకుు సంబంధించిన ివాటిలోనైతే నేరుగా జోక్యం చేసుకోవచ్చని బొర్రబాబు కేసులో సుప్రీం ి్ట వైఖరి తీసుకుంది. ్న ఫిరాయింపుల నిరోధ చట్టం ప్రకారం అర్హత అనర్హతలు నిర్ణయించడంలోనూ స్పీకర్‌దే తుది నిర్ణయం అయినప్పటికీ దాన్ని సవ్యంగా అన్వయించారా లేదా చెప్పే అధికారం తమదేనని కోర్టులు అంటుంటాయి. ఈ వాదోపవాదాలెలా వున్నా ఆచరణలో మాత్రం ఇది ఎడతెగని వివాదంగానే నడుస్తున్నదనేది నిజం.
చట్టసభల ప్రతిపత్తి, స్పీకర్ నిర్ణయాధికారం విషయంలో కోర్టులు తలదూర్చడానికి లేదనేది ఎంత నిజమో వాటికి ఆ అవకాశం ఇవ్వకుండా ముందే సముచితంగా సమతుల్యతతో స్పీకర్లు వ్యవహరించాలన్నది అంతే నిజం. ఏదైనా సమస్య వచ్చినప్పుడైనా కోర్టులు చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకుని మళ్లీ సభ పరిధిలోనే పునరాలోచన చేసి పరిష్కరించుకోవడం ఉత్తమ మార్గం.ప్రజాస్వామిక పద్ధతి. సభ్యుల హక్కులను కాపాడ్డం ముఖ్యంగా ప్రతిపక్షానికి గల హక్కులకు అండగా నిలవడం స్పీకర్లపై గల ఒక ముఖ్య బాధ్యత. అనుభవజ్ఞుడైన కోడెల శివ ప్రసాదరావు, అంతకుముందే అనుభవం గడించిన సభా వ్యవహారాల మంత్రి యనమల ఈ సమస్యను ప్రజాస్వాకంగా రాఆ్యంగ స్పూర్తితో ఎలా పరిష్కరిస్తారు, ప్రతిపక్ష నేత వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరిస్తారు అన్నది చూడాల్సిందే.