మోడీ త్రిముఖ దాడి -సంఘీకరణ, సరళీకరణ, సామ్రాజ్యకరణ

నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ఎన్‌డిఎ ప్రభుత్వ పోకడలు విమర్శలు మూటకట్టుకోవడమే గాక గతంలో చూడని ఒక విపరీత పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఒక మితవాద మతవాద ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందని అందరూ భావించారో అంతకంటే తీవ్రంగానూ త్వరితంగానూ మోడీ ప్రభుత్వం అపకీర్తి మూటకటుకొంటున్నది. చాలా రాష్ట్రాలలో ప్రజలతిరస్కరణకూ గురవుతున్నది. . వారెంతో ఇష్టపడే అమెరికాలో ప్రముఖ పత్రికగా వున్న న్యూయార్క్ టైమ్స్, ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచి పత్రిక లేమాండే కూడా మోడీ ప్రభుత్వం ఏడాదిలోనే నిరంకుశత్వ మార్గం పట్టిందని నిశితంగా విమర్శించాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. హెచ్‌సియు ఘటనల తర్వాత లండన్ పర్యటనకు ఆయన వెళ్లినప్పుడు అక్కడ కూడా ఇలాటి విమర్శలే. ఎక్కే విమానం దిగేవిమానం అన్నట్టు ప్రపంచ భ్రమణం చేయడం ద్వారా ప్రతిష్ట మోగిపోతున్నదని మోడీ చెబుతుంటే వాస్తవాలు ఇలా వున్నాయి. దేశంలో బడా మీడియాను చాలా వరకు అదుపులో వుంచుకోవడానికి మోడీ బృందం, బిజెపి వ్యూహకర్తలు ప్రయత్నించినప్పటికీ హెచ్‌సియు, జెఎన్‌యు ఉదంతాల తర్వాత జాతీయ మీడియా కూడా ఆయనను సమర్థించలేని పరిస్థితి ఏర్పడింది.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు(ఆరెస్సెస్) ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నరేంద్ర మోడీ పాలనలో సంఘీకరణకు ప్రథమ ప్రాధాన్యత. ఆ తర్వాత సరళీకరణ విధానాలను మరింత తీవ్రం చేయడం ఆయన రెండవ పని. సామ్రాజ్యవాద కూటమితో కుమ్మక్కు కావడం ఈ ప్రభుత్వ మూడవ లక్షణం. అందుకే ఇది సరళీకరణ, సంఘీకరణ, సామ్రాజ్యీకరణలు కలగలిపిన కాషాయ కషాయం. కొంతమంది కాంగ్రెస్‌ను ఆవినీతి ఆర్థిక విధానాల కారణంగానూ బిజెపిని మతతత్వ విధానాల కారణంగానూ వ్యతిరేకిరించాలని మామూలుగా చెబుతుంటారు. వాస్తవం ఏమంటే బిజెపి మత తత్వం మార్కెట్‌తత్వం రెండింటి మిశ్రమం.
సంఘీకరణ
ఏకపక్ష అధికారం ఎప్పుడూ అప్రజాస్వామిక చర్యలకు దారి తీస్తుంటుంది. ఇందిరగాంధీ ఎమర్జన్సీ విధించే వరకూ వెళ్లారు. అయితే అప్పుడు ఆమెది ఒక పెట్టుబడిదారీ ప్రభుత్వనేతగా వ్యక్తిగత ఆధిపత్యం. కాని ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్నది అభివృద్ధి నిరోధక సైద్ధాంతిక లేదా భావజాల నియంతృత్వం కూడా. బిజెపి నేతలు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సంఘ పరివార్‌తో తమ అనుబంధాన్ని సగౌరవంగా చాటుకుంటారు. మధ్యేవాదిగా ముఖోటా(ముసుగు)గా అభివర్ణించబడే వాజ్‌పేయి సహితం అమెరికాలో తాను స్వయం సేవకుడినని ప్రకటించకున్నారు. ఇండియా తిరిగి వచ్చాక వలంటీర్ అన్న అర్థంలో మాట్లాడానని తప్పించుకున్నారు. నూరుఎలుకలను తిన్న పిల్లికాశీ యాత్రకు వెళ్లినట్టు మోడీ (ఆయన అక్కడినుంచే లోక్‌సభకు ఎన్నికైనారు) గుజరాత్ మతమారణ కాండ ముగించాక వ్యాపారానుకూల అభివృద్ధి ముఖ్యమంత్రిగా కొత్త ముసుగు ధరించారు. వాజ్‌పేయి సంఫ్‌ుకు ముసుగు అయితే సంఫ్‌ు మనిషిగా వచ్చిన మోడీకి ఆధునిక అభివృద్ది జపం ఒక ముసుగు. దాని చాటున ఆయన కేంద్రంలో గద్దెక్కిన రోజునుంచి సంఫ్‌ు భావజాలాన్ని సర్వసంపూర్ణంగా దేశంపై రుద్దే పథకం ప్రారంభించారు. తనను నేతగా ఎన్నుకున్న బిజెపి పార్లమెంటరీ సమావేశంలోనే దీనదయాళ్ శతజయంతి పిలుపునిచ్చారు. ప్రధానిగా పదవి స్వీకరించగానే ే విభూత వదనుడై గంగా తీరాన హారతి అందుకుని నమ:శ్శివాయ బదులు నమో జపానికి పచ్చజెండావూపారు! తద్వారా కేవలం వ్యక్తిగత విశ్వాసంగా గాక రాజ్యాన్ని మతాన్ని కలిపివేసే నూతన వ్యూహం ప్రారంభించారు. ఇందిరాగాంధీ నియంతృత్వం వ్యక్తిగతంగా లేక కుటుంబ పరంగా సాగితే మోడీ సంఫ్‌ు సైద్ధాంతిక నిరంకుశత్వంగా మారిందని టైమ్స్ సంపాదకురాలు సాగరిక ఘోష్ చేసిన వ్యాఖ్య అర్థవంతమైంది. బలహీనమైందిగా చెప్పే మన్మోహన్ ప్రభుత్వ హయాంలో మొదట (వామపక్షాలపై ఆధారపడినప్పుడు) ఉపాధి హామీ బిల్లు, పనిహక్కు, ఆరోగ్య మిషన్, సమాచార హక్కు వంటివి వచ్చాయి. కాని ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక రోజుకో మతతత్వ వివాదం తెరమీద ప్రత్యక్షమవుతున్నది. ఎంపిలు మంత్రులు ఇష్టానుసారం రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా చెల్లిపోతున్నది. ఆరెస్సెస్ నేరుగా ఆదేశాలు జారీ చేస్తుంది.పిలిచి సమగ్ర సమీక్షలు చేస్తుంది.ఇలాటి వాటిపై సన్నాయినొక్కులతో సరిపెడుతుంటారు. ్ల తప్పు చేసిన వారిని, మాట్లాడిన వారిని ఖండించి చర్య తీసుకోకపోగా మరింత ఎగదోస్తుంటారు. అల్పసంఖ్యాకులను అణగారిన వర్గాలనూ మహిళలను అవమానిస్తారు. దాడులకు గురిచేస్తారు. వీటిని ఎదుర్కొనేవారిపై విరుచుకుపడతారు. సంఫ్‌ు చెప్పే హిందూత్వను తీవ్రంగా వ్యతిరేకించిన అంబేద్కర్‌ను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు విఫల యత్నం చేయడం మరింత విడ్డూరం. హెచ్‌సియు నుంచి జెఎన్‌యు వరకూ చూస్తే భిన్నమైన భావాలు గలవారిపై మరీ ముఖ్యంగా అభ్యుదయం లౌకికతత్వం కోరేేవారిపై పథకం ప్రకారం దుర్మార్గమైన దుప్ప్రచార కుట్రలు సాగిపోతున్నాయి. ‘ఇంత అదరగణ్నం క్యాబినెట్ ఎప్పుడైనా వుందా? సృతి ఇరానీ మాటలు గొప్ప టీవీ షో కావచ్చుగాని మంత్రికి సరిపడతాయా? దాద్రి హత్యాకాండతో ఒక మహేష్ శర్మ వస్తారు. హెచ్‌సియు విద్యార్థులు జాతి వ్యతిరేకులని ఒక బండారు దత్తాత్రేయ చెలరేగిపోతారు. రచయితల నిరసనలు కావాలని సృష్టించినవని అరుణ్‌జైట్లీ నోరుపారేసుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్రోహుల మద్దతు వుందని రాజ్‌నాథ్ వ్యాఖ్యానిస్తారు. వీటిపై ఎంత దుమారం రేగినా మౌనరేంద్ర మోడీ నోరు మెదపరు. ఈ పరిణామాలన్నీఏకరువు పెట్టిన సాగరిక మరో ముఖ్యమైన అంశం రాశారు. అహ్మదాబాద్ సభలో అమిత్ షా మాట్లాడుతూ ఇది కేవలం రాజకీయ యాత్ర కాదు, సైద్ధాంతిక యాత్ర అని ప్రకటించడం గమనించదగ్గది. ఈ యాత్రలో వారికి మీడియాలో కూడా కొందరు వంత పాడుతుంటారని గుర్తుంచుకోవాలి. ప్రసార భారతి చైర్మన్ ఎ.సూర్య ప్రకాశ్ అయితే జెఎన్‌యులో ఏదో దేశద్రోహం జరిగిపోయిందని,2014 ఎన్నికల్లో దెబ్బతిన్న రెండు కమ్యూనిస్టుపార్టీలు మోడీకి వ్యతిరేకంగా చాలా కుట్రలు చేస్తున్నాయని తిట్టిపోశారు. ఈ నిస్ప్రహలో కమ్యూనిస్టులు విచ్చిన్న శక్తులను ప్రోత్సహించి మోడీపై ద్వేషాన్ని దేశంపై ద్వేషంగా మారుస్తున్నాయట. దేశమంటే మోడీనే అన్న నిరంకుశ భావన ఈ మాటల్లో తొంగిచూడటం లేదా? రాష్ట్రాల హక్కుల విషయంలోనూ ఇదే నిరంకుశధోరణి. ఈ భావజాలం ఆర్థిక రంగంలో కూడా అవసరమని ప్రధాని ఆర్థిక సలహాదారు అరవింద సుబ్రహ్మణ్యం ఇంటర్వ్యూలు ఇస్తారు. నిజానికి మత మార్కెట్ తత్వాలు రెండూ కవల పిల్లల వంటివని పలుసార్లు చెప్పుకున్న పరమసత్యానికి మోడీ ప్రభుత్వాన్ని మించిన ఉదాహరణ వుండదు.యమునా తీరంలో రవిశంకర్ గురూజీ ఉత్సవాలపై ఎన్ని విమర్శలు వచ్చినా మోడీ నుంచి వెంకయ్య నాయుడు వరకూ హాజరై ప్రశంసలు కురిపించి వచ్చారు. ఆసక్తికరంగా బాబా రామ్‌దేవ్‌కు రవిశంకర్‌కు మధ్య ఆయుర్వేద ప్రకృతి ఉత్పత్తుల అమ్మకంలో పోటీ నడుస్తున్నట్టు మింట్ పత్రిక కథనం ఇచ్చింది. ఈ ఇద్దరితోనూ మోడీ దోస్తానా వెనక వివిధ తరగతుల భక్తులను ఆకట్టుకోవడం తప్ప వేరే లక్ష్యం లేదని బిజెపికి దగ్గరగా వుండే సంపాదకుడు ప్రభుచావ్లాయే రాశారు! ఇలాటి ఉదాహరణలు ఉదంతాలు ఎన్నని చెప్పుకోవడం?
మతం+ మార్కెట్
యుపిఎ హయాం కుంభకోణాల మయం అయితే తమది స్వచ్చమైన ప్రభుత్వమన్నట్టు బిజెపి నేతలు రోజూ టముకు వేసుకుంటారు. వారి అవినీతి నిజమే గాని వీరి సంగతి? హవాలా నుంచి తెహల్కా, పార్లమెంటు ప్రశ్నలకోసం డబ్బులు తదితర అనేక వ్యవహారాల్లో బిజెపి నేతలు ఎలా దొరికిపోయారో దేశమంతటికీ తెలుసు. మోడీ హయాంలో ఇప్పటికీ అలాటి భారీ కుంభకోణం బయిటకు రాకున్నా కార్పొరేట్ శక్తులతో చెట్టపట్టాలు వేసుకునేతిరుగుతున్నారు. అటు అదానీ ఇటు అంబానీ మధ్యలో ప్రధాని అని నేను చాలా సార్లు తమాషాగా అంటుంటాను గాని అది నిజం. మోడీని గాంధీ మహాత్ముడితో పోల్చిన మొదటి వ్యక్తి అనిల్ అంబానీ. ఆయన ప్రధాని అయ్యాక కూడా ముంబాయిలో ముఖేష్ అంబానీ ఉత్సవంలో పాల్గొన్న దృశ్యాలు చూస్తే వ్యక్తిగతంగానూ వారి పట్టు ఎంతో తెలుస్తుంది. అదానీకి అస్ట్రేలియాలో కాంట్రాక్టులు ఇప్పించేందుకు ఈ ప్రభుత్వం పరోక్షంగా సహకరించినట్టు చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ సంస్థ కాంట్రాక్టులపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇక విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు గతంలో గాలి జనార్థనరెడ్డికి వత్తాసునివ్వడం, మొన్న లలిత్ మోడీకి మద్దతునివ్వడం చాలా వివాదానికి దారితీసింది. అరుణ్‌జైట్లీహెయాంలో డిడిసి అవకతవకలపై విచారణ జరగనేలేదు. ఇప్పుడు విజరుమాల్యా వేల కోట్ల రుణాలకు ఎగనామం పెట్టి విదేశాలకు ఎగిరిపోవడానికి ప్రభుత్వ ప్రత్యక్ష సహకారానికొ పార్లమెంటులోనే సంజాయిషీ చెప్పుకోవలసిన స్థితి. మాల్యా అరెస్టుకు ఉత్తర్వులిచ్చిన సిబిఐ తర్వాత సవరించడానికి కారకులెవరు? హౌంశాఖ ఆధ్వర్వంలో పనిచేసే సిబిఐ పనులకు బాధ్యత వహించరా? మాల్యాను పంపించి బ్యాంకులపై విరుచుకుపడటం ఏం న్యాయం? ఇదే గనక కాంగ్రెస్ హయాంలో జరిగివుంటే బిజెపి నేతలు ఏమనేవారు?
సరళీకరణలో బ్యాంకులు ద్రవ్య సంస్థలు రవాణా సౌకర్యాలు రైల్వేలు రక్షణ అన్నిటినీ ప్రైవేటు పరం చేసేందుకు పరుగులో ఈ ప్రభుత్వం యుపిఎను మించిపోయింది. దీనిపై చాలా వ్యాసాలే వచ్చాయి. పైగా ముద్ర, స్టార్టప్ వంటి పేర్లతో తమ వారికి భారీగా రుణాల సంతర్పణ జరపడానికి రంగం సిద్ధం చేసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.. సబ్సిడీలకు సత్వరం మంగళం పాడాలని రకరకాల పథకాలు రచిస్తున్నారు. చమురు తవ్వకంలో గత విధానాలు సడలించి ఇష్టారాజ్యం కల్పిస్తున్నారు.ఇసుక అక్రమాలకే తల్లడిల్లిపోతున్న మన సమాజం రేపు భూగర్భంలో చమురు నిక్షేపాలు కొల్లగొట్టడాన్ని చూడవలసి వుంటుంది.
సామ్రాజ్య కరణ
మోడీ ప్రభుత్వ మూడవ లక్షణం అమెరికా సామ్రాజ్యవాదానికి నానాట మరింతగా సాగిలపడటం. ఈ ప్రభుత్వ విదేశాంగ విధానంలో అమెరికా భారత సంబంధాలు అత్యున్నత నక్షత్రాలుగా ప్రకాశిస్తున్నాయని మాజీ విదేశాంగ కార్యదర్శి నిరపమ రావు రాశారు! పాకిస్తాన్ నుంచి అమెరికాను దూరం చేస్తామన్నవారు వారికి రక్షణ సరఫరాలు కొనసాగిస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. పాకిస్తాన్‌ను పదే పదే ప్రతికూల ప్రస్తావనలు చేసిన వారు హఠాత్తుగా అక్కడ వాలి నవాజ్ షరీఫ్‌ను ఆలింగనం చేసుకున్నారు పైగా చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలసిసాగాలనే ఆరాటం ప్రదర్శిస్తున్నారు. టెర్రరిజంపై ఉమ్మడి పోరాటం పల్లవి బాగా వినిపిస్తున్నారు. ఇంతా చేసి భద్రత విషయంలో ఎంత అధ్వాన్నంగా వున్నామో పఠాన్‌కోట దాడితో తేలిపోయింది. భారీ జనసంఖ్య ఆర్థికశక్తి గల దేశాలుగా భారత చైనాల కలయిక వర్ధమాన దేశాలకు ఒక ఆలంబన అవుతుందనుకుంటే మోడీ ప్రభుత్వం అడుగులు అందుకు భిన్నంగా అమెరికావైపు పడుతున్నాయి. ఈ వ్యతిరేకత ఎక్కడకు పోయిందంటే ప్రధాని ఆసియా వేదికపై చైనాలో ప్రజాస్వామ్యం లేదని పరోక్షంగా దెప్పిపొడిచేంతవరకు! దక్షిణ చైనా సముద్రంలోనూ వారికి వ్యతిరేకంగా జపాన్‌కు దగ్గరవడం కూడా ఇందులో భాగమే. ఒకప్పుడు తనకే వీసా నిరాకరించిన అమెరికాతో మోడీ ఇంత దగ్గరకావడం వెనక దాగిన సామ్రాజ్యతత్వం దాచేస్తే దాగేది కాదు. అక్కడ అద్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వంటివారు భారత్ నుంచి వచ్చిన వారికి వ్యతిరేకంగానే గాక జాతి ద్వేషాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటే విననట్టు నటిస్తున్నారు. టెర్రరిస్టుల వేట పేరిట మైన్మార్ సరిహద్దులో చెప్పకుండా దాడి చేసి వచ్చారు. నేపాల్ విషయంలోనూ పెద్ద అన్నయ్య వైఖరి చేపట్టి సంబంధాలకు నష్టం చేసి చివరకు కొంత సర్దుబాటు చేసుకున్నారు. ఇరుగుపొరుగు దేశాలతో ఇప్పుడు మన సంబంధాలు బాగాలేవంటే దానికి మోడీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు కూడా కారణమే. ఆసియాకు నాయకత్వం అనడంతో ఆగక అఖండ భారత్ పల్లవి కూడా అప్పుడప్పుడూ ఆలపిస్తున్నారు. మోడీ పాలనా శైలి అమెరికా అద్యక్ష తరహాను తలపిస్తున్నదనే విమర్శకులంటున్నారు. భారత దేశానికి తొలి హిందూ రాజ్యం ఇప్పుడే వచ్చిందని ఆరెస్సెస్ చేసిన ప్రచారం ఇందుకు ప్రతిబింబం. దీర్ఘకాలంలో ఇది దేశ సమగ్రతకు విదేశాలతో సత్సంబంధాలకు కూడా ఇబ్బంది కలిగించవచ్చు.
తమను విమర్శిస్తే జాతి వ్యతిరేకులనే ముద్ర వేసినా సరే దేశహితైషులు తప్పనిసరిగా ఈ నిరంకుశ ఏకపక్ష ధోరణులను నిలవరించవలసి వుంటుంది. ప్రజాస్వామ్యం దేశ సార్వభౌమత్వం రక్షించుకోవడమే నిజమైన దేశభక్తి.