అవిశ్వాసం వృథా వ్యూహరాహిత్యం

ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యూహరాహిత్యంతో ఎపి శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోఅవిశ్వాసం వృథాగా ముగిసింది. మొన్నటి సీన్ రిపీట్ అయ్యింది.అమరావతిలో భూముల కొనుగోలు వ్యవహారంపై . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ చేస్తున్నానన్నప్పుడు సాక్షిలో వచ్చిన కథనాలకు సంబంధించిన ఏవో కొన్ని కాగితాలను ఇచ్చి విచారణ ప్రారంభిస్తే మరిన్ని అందిస్తానని చెప్పొచ్చు. సిబిఐ దర్యాప్తు అన్నది రాజకీయ నిర్ణయమే తప్ప సభ నిర్ణయించదు. ప్రభుత్వం అందుకు అంగీకరించకపోతే ప్రతిపక్షం నేరుగా సిబిఐకి లేఖ రాయొచ్చు.కోర్టులో కేసు వేయొచ్చు. మీడియా ముందు వుంచొచ్చు.ఇవేవీ చేయకుండా కేవలం సిబిఐ వాదన దగ్గరే వైసీపీ ఆగిపోయింది. తన దగ్గర లోపం వున్నట్టు వ్యవహరించింది.ఈ లోగా చర్చల్లో కలిసిన వైసీపీ సభ్యులు నిజంగా తమ నాయకుడు అలా చేసి వుండకూడదని అభిప్రాయం వెలిబుచ్చారు. గవర్నర్ ప్రసంగం సమయంలో ఆ విధంగా జరిగిందే అవిశ్వాస తీర్మానం సమయంలోనూ పునరావృతమైంది. ఈ క్రమంలో చంద్రబాబు మొన్నటి వైఖరినే పునురుద్ఘాటించడం, జగన్‌పై కోర్టుల వ్యాఖ్యలను చదివి వినిపించడం చూశాం. ఇందుకు సమాధానంగా జగన్ చంద్రబాబు వ్యవస్థలను ప్రభావితం చేయడం, పలుకుబడితో దర్యాప్తులు జరక్కుండా అడ్డుకోవడం, కావలసిన జడ్జిమెంట్లు తెప్పించుకోవడం జరిగిందని ఆరోపించారు. ఇక దాంతో న్యాయవ్యవస్థను అవమానించారని సభ చర్చ మొత్తం ఆ చుట్టే తిప్పింది టిడిపి.దానిపై జగన్ యుక్తియుక్తంగా విచారం వెలిబుచ్చి వుంటే కొంత బావుండేది. దానికి నిరసనగా నోరు జారిన మంత్రి అచ్చెం నాయుడు మాట వెనక్కు తీసుకున్నారు గాని జగన్ సర్దుకోలేదు. తీర్పులను కూడా విమర్శించవచ్చని పేర్కొన్నారు.ఒకానొక నిర్దిష్ట తీర్పును విమర్శించడం న్యాయవ్యవస్థ స్వభావాన్ని విమర్శించడం వేరు. పలుకుబడి తీర్పులు తెప్పించుకోవడం వంటి పదాలు వాడటం వేరు. షరా మామూలుగా అధికార పక్షం కూడా కావలసినంత సమయం వృథా అయ్యాక దానిపై క్షమాపణలకు పట్టుపట్టకుండానే అవిశ్వాసం వీగిపోయినట్టు ప్రకటింపజేసి బడ్జెట్ చర్చకు ముందుకు కదిలింది.