సిపిఎంకే దక్కిన ప్రత్యేకత..

cpim

34 ఏళ్లు పాలించిన పశ్చిమ బెంగాల్‌లో ఓడిపోయిన సిపిఎం ఈ సారైనా విజయం సాధిస్తుందా లేదా అనేది దేశమంతటా ఆసక్తికలిగిస్తున్న అంశం. కాంగ్రెస్‌తో పొత్తు లేదా అవగాహన వుంటుందని జరిగిన ప్రచారాలు నిజం కాలేదు. పరస్పర పోటీలతో ఓట్లు చీల్చుకుని తృణమూల్‌ విజయానికి దోహదం చేయకూడదనే వరకు ఇరుపక్షాలు గుర్తించినట్టు కనిపిస్తుంది. దీనిపై విమర్శలకు సిపిఎం అధికార పత్రిక పీపుల్స్‌ డెమోక్రసీ సమాధానమిచ్చింది. తమ ప్రభుత్వ ఏర్పాటు కంటే మమత నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోయడం ముఖ్యమనే దృష్టిితోనే అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నట్టు పేర్కొంది. అయినా దీనిపై విమర్శలు రావడానికి అవకాశం వుంటుంది.వాటికి సిపిఎం సమాధానం కూడా చెప్పకతప్పదు. అయితే ఇక్కడ చర్చించే సమస్య అది కాదు. బెంగాల్‌లో ఫలితాలు చూడవలసి వున్నా కేరళలో మాత్రం తప్పక సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎప్‌ విజయం సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. అంటే త్రిపురతో పాటు మరో ప్రభుత్వం తప్పక ఏర్పడుతుందన్న మాట. ఈ దేశంలో కాంగ్రెస్‌ బిజెపిలను మినహాయిస్తే(కొద్ది కాలం జనతా,జనతాదళ్‌) ఒకటికన్నా ఎక్కువ రాష్ట్రాలలో సుదీర్ఘకాలం పాలించింది సిపిఎం ముఖ్యమంత్రులూ వామపక్షాలే కావడం ఒక చారిత్రిక వాస్తవం. నిజానికి గత సారి తప్ప పార్లమెంటులోనూ మూడవ స్థానంలో తరచూ సిపిఎం వుంటూ వచ్చేది.
జాతీయ అని పేరు పెట్టుకున్న చాలా పార్టీలు ఒక చోటపాలించేందుకే నానా తంటాలు పడుతున్న నేపథ్యంలో ఇది రాజకీయ ప్రాధాన్యత గల విషయం. ప్రాంతీయ పార్టీలను రద్దు చేస్తారన్న వార్తలతో ఎమ్జీఆర్‌ తమ పార్టీకి ఆల్‌ ఇండియా అన్నా డిఎంకె అని తగిలించారు

 ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ  విజయం సాధించిన తర్వాత కొన్నాళ్లకు ఆయన ‘భారత దేశం’ అనే పార్టీని ఏర్పాటు చేయాలనుకున్నా సలహాదారులతో చర్చించిన తర్వాత అది జరిగేపని కాదని వాయిదా వేసుకున్నారు. అయినా తర్వాత నేషనల్‌ ప్రంట్‌ అద్యక్షుడుగా పనిచేశారు.  విపిసింగ్‌ ప్రభుత్వంలో ఎన్టీఆర్‌ను ఉప ప్రధానిని చేసేందుకు చంద్రబాబు నాయుడు వంటివారు కొంత విఫల యత్నం చేశారు. అప్పట్లో దేవీలాల్‌ను ఉపప్రధానిగా చేసుకున్నందుకే నానా అవస్థలు పడుతున్న విపిసింగ్‌ ఆ ప్రతిపాదనను బొత్తిగా పట్టించుకోలేదు. ఆ రోజుల్లో ఢిల్లీలో చంద్రబాబు కన్నా ఉపేంద్ర పాత్ర ఎక్కువగా వుండేది. ఆయననే విపిసింగ్‌ కేంద్రంలోకి తీసుకుని ఎన్టీఆర్‌కు సమాచారమిచ్చారు. 1996 యునైటెడ్‌ ఫ్రంట్‌ హయాంలో చంద్రబాబు కన్వీనర్‌గా వున్నా హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ పాత్రే కీలకంగా వుండేది. అయినా ప్రధాని రాష్ట్రపతి పదవులకు పేర్లను ప్రకటించేఅవకాశం చంద్రబాబుకే ఇచ్చారు. తననే ప్రధానిగా రమ్మంటే నిరాకరించానని ఆయన చెబుతుంటారు గాని దానికి ఆ ప్రభుత్వ పరాధీనతే ముఖ్యకారణం . దేవగౌడ సాహసం చేశారు. . ఇక ప్రస్తుతానికి వస్తే రాష్ట్ర విభజన తర్వాత తమది జాతీయ పార్టీగా మారుతుందని తెలుగుదేశం నేతలు చెబుతూ వచ్చారు. ఎపిలో అధికారంలోకి రావడం, తెలంగాణలోనూ పదిహేను స్థానాలు రావడంతో ఆ వాదన బాగానే వుందనిపించింది. అంతేగాక అండమాన్‌ నికోబార్‌తో సహా ఒకటి రెండు చోట్ల స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి స్థానాలు సంపాదించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్‌ను నియమించారు కూడా. అయితే అనుకోని రీతిలో తెలంగాణలోనే ఆ పార్టీ దారుణంగా దెబ్బతినిపోయింది. 12 మంది ఎంఎల్‌ఎలు టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఖమ్మం వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం తెచ్చుకోలేకపోయింది.తెలంగాణలోనే నిలబెట్టుకోలేనప్పుడు తెలుగుదేశంను జాతీయ పార్టీగా విస్తరించుకోవడం నెరవేరని స్వప్నమే అవుతుంది. దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ రెండు చోట్ల ప్రధాన శక్తిగా వుండటం ఎక్కడా చూడం. తెలుగుదేశం ఎపికే పరిమితం కావడం అనివార్యంగా జరగొచ్చు. కమ్యూనిస్టులను ఎంతగా ఎగతాళి చేసినా రెండు మూడు రాష్ట్రాలలో అధికారం లోకి రావడంలోని ప్రత్యేకత ఇక్కడ అర్థమవుతుంది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *