విదేశాల్లో విలాస మాల్యా నీతులా? నిందితులే నిర్ణేతలా??
తాను ఇండియాకు తిరిగివచ్చేందుకు సమయం ఆసన్నం కాలేదని విలాల వాణిజ్యవేత్త విజరు మాల్యా లండన్లో వ్యాఖ్యానించడం మోడీ ప్రభుత్వ వ్యవహార శైలికి సవాలు వంటిదే. వందల వేల కోట్ల బాకీలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేయడమే గాక కోర్టుల్లో వివాదాలు నడుస్తుండగానే విదేశాలకు ఎగిరిపోవడాన్ని సాక్షాత్తూ ఆర్థిక మంత్రి(ఆయన న్యాయకోవిదుడు కూడా) ఆరుణ్జైట్లీయే సమర్థించిన తర్వాత ఆయన అలా మాట్లాడ్డంలో ఆశ్చర్యం ఏముంది? విజరు మాల్యా విదేశాలకు వెళ్లేట్టయితే అరెస్టు చేయాలంటూ ఇచ్చిన సిబిఐ నోటీసును సమాచారం చెప్పి వెళ్తే సరిపోతుందని సవరింపచేసింది ఈ ప్రభుత్వమే. రాజ్యాంగ ప్రకారం ఆయనను నిలవరించేందుకు అవకాశం లేదని జైట్లీ వాదించారు. ఇప్పుడు విజరు మరింత దూరం వెళ్లి తనను నేరస్తుడుగా చిత్రించిన వారిదే నేరం అని ఎదురు దాడి చేశారు. వ్యాపారమన్నాక ఒడుదుడుకులుంటాయని నీతులు చెప్పారు. పార్లమెంటు సభ్యుడుగా తాను రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటానని ధర్మపన్నాలు పలికిన విజరు మాల్యా ఇప్పుడు వారంట్లు జారీ అయినా సరే సమయం ఆసన్నం కాలేదని చెప్పడంలో కపటం స్పష్టం. ఆయన వెళ్తున్నాడని తెలిసినా ఇప్పుడు ఎక్కడ వున్నారో తెలిసినా మన సర్కారు ఆయనను అంటుకోదు. ఎందుకంటే తనను రాజ్యసభకు పంపడంలో ఒకసారి కాంగ్రెస్ మరోసారి బిజెపి రెండుసార్లు జెడిఎస్ మద్దతునిచ్చాయి. కోర్టు బోనులోకి జైలు గోడల వెనక్కుపంపాల్సిన వారిని అత్యున్నత చట్టసభకు పంపిన వారినుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తాం?
