వివాదాల వేదికపై దేశాధినేతా!
రవిశంకర్ గురూజీ శ్రీశ్రీశ్రీ మొదటినుంచి ఆధ్మాత్మిక ముద్రిత మహారాజయోగి. ఆయన ఏది చేసినా అట్టహాసంగా ఆడంబరంగా వుంటుంది. రాజకీయాలు వద్దంటూనే అద్వానీ నరేంద్రమోడీ వంటి వారికి ఆశీస్సులూ ఆమోదాలు అండదండలూ అందిస్తుంటారు. సరే ఇప్పుడాయన యమునా తీరంలో ఒక అనధికార అంతర్జాతీయ సాంసృతిక సమ్మేళనం తలపెట్టారు. దీని ఏర్పాట్లలో సైన్యాన్ని పిలిపించి వినియోగించారు. నొచ్చుకుంటూనే వారు క్రమశిక్షణగా పనిచేశారు. ఇంతలోనే ఈ హంగామా వల్ల పర్యావరణం దెబ్బతింటుందనే ఆందోళన బయిలుదేరింది. ఆ విషయంలో అత్యున్నత సంస్థగా వున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్వయంగా అభ్యంతరాలు తెల్పింది. ఇవన్నీ చూసి వేడుకకు రావలసిన ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ మొహం చాటేశారు. ఆ తర్వాత అయిదు కోట్ల పర్యావరణ పరిహారం కట్టి వేడుక జరుపుకోవాలని ఎస్‌జిటి ఆదేశించింది. కావాలంటే జైలుకైనా వెళ్తాగాని జరిమానా కట్టబోనన్నారు గురువర్యులు. ఇంతలోనే ప్రధాని మోడీ వేడుకకు వెళ్లనున్నట్టు ఎన్‌ఎస్‌జి కమాండోల హడావుడితో తేలిపోయింది. నిర్వాహకులు కూడా ముందు పాతికలక్షలు కట్టి పనయ్యాక మిగిలింది కడతామని రాజీకొచ్చారు. ఈ వివాదాలన్నీ చూసి విదేశాల నుంచి వస్తారనుకున్న అతిధులంతా వెనక్కు తగ్గారు. జింబాబ్వే అద్యక్షుడు రాబర్ట్ ముగాబే హరే విమానాశ్రయం నుంచి బయిలుదేరాక కూడా మానుకున్నాడు.శ్రీలంక అద్యక్షుడు సిరిసేన, నేపాల్ నాయకుడు భట్టాచార్య, ఆఫ్టన్‌మాజీ అద్యక్షుడు కర్జారు, పాక్ మాజీ ప్రధాని జిలానీ ఒకరేమిటి అంతా ఒక్కొక్కరే ఎగనామం పెట్టారు. ఇంత జరిగినా మోడీ మాత్రం స్వామీజీపక్కనే ఆసీనులై విమర్శకులను తిట్టిపోశారు. ఇదంతా చూస్తే సినిమా కథలను తలదన్నడం లేదూ? దేశాధినేత పర్యావరణ ప్రేమికులతోనూ
న్యాయ స్థానాలతోనూ వుండవలసింది పోయి వివాద కారకులకు వత్తాసు పలకడం మొదలెడితే ఇక అధికారులు ఆయా వ్యవస్థలు ధైర్యంగా వ్యవహరించగలవా? సాంసృతిక వారసత్వాన్ని విమర్శించకూడదని మోడీ చెప్పిన సూక్తులు పరోక్షంగా పర్యావరణ విమర్శకులపై ఎక్కుపెట్టినవి కావా?
అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన లలిత్ మోడీకి వత్తాసు నిచ్చిన నాయకురాలు సుష్మా స్వరాజ్. వేల కోట్లు బకాయిలు ఎగవేసి లండన్‌చెక్కేసిన విజరు మాల్యాకు వంత పాడేవారు ఆర్థిక మంత్రి న్యాయకోవిదుడు అరుణ్‌జైట్లీ. ఆయనపై సిబిఐ జారీ చేసిన లుకౌట్ నోటీసును నీరుగార్చడానికి ఆధ్వర్యం వహిస్తారు హౌం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్. విదేశాల్లోని అక్రమ ధనం తెప్పిస్తామన్న వారు ఆ పనిచేయకపోగా అక్రమార్కులు పలాయనాలకు ప్రయాణాలకు దోహదం చేయడం ఎంత గొప్ప దేశభక్తి! ఎంత మహత్తర జాతీయత! భారత్ మాతాకీ జై.
