‘ఉభయ’ సభా పర్వాలు..

assmbly
రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభలు కొలువు తీరిన సమయం. ఆంధ్ర ప్రదేశ్‌ బడ్జెట్‌ వచ్చేసింది. తెలంగాణ బడ్జెట్‌ రావలసి వుంది. రెండు చోట్ల ఒకే గవర్నర్‌ ప్రారంభోపన్యాసం భిన్న సందేశాలతో సంకేతాలతో నడిచింది. సరళీకరణ యుగంలో బడ్జెట్లు తప్పనిసరి తంతులుగా మాత్రమే కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలనే అరకొరగా జరిపించేసి మమ అనిపించుకుందామన్న అభిప్రాయం నెలకొన్నది. కనుక నిజమైన రాజకీయం సభవెలుపలే. అందుకే అటు ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఇటు తెలంగాణలోనూ కూడా అనేక మలుపులూ గెలుపులూ ఫిరాయింపులూ ఠలాయింపులూ చూశాం. ఉదాహరణకు తెలంగాణ తెలుగుదేశంలో ఖచ్చితంగా నిలబడే శాసనసభ్యుడు ఒక్కరే కనిపిస్తుంటే మిగిలిన వారు దాదాపుగా గులాబీ గూటికి చేరిపోయారు. ఆంధ్ర ప్రదేశ్‌లో దాదాపు అంతే సంఖ్యలో వైసీపీ ఎంఎల్‌ఎలు పచ్చ కండువాలు కప్పేసుకున్నా ఇంకా చాలా మంది వున్నారు. ఇదంతా ఘనతగా చెప్పుకునే వారు కొందరైతే రోతగా చూసేవారు మరికొందరు. అవతలి వారు చేసినది తప్పు అని తిట్టిపోసిన వారు తామూ అదే పని మరింత నిస్సిగ్గుగా కానిచ్చేస్తున్నారు. ఇలా ఎన్నికైన సభ్యుల రంగు మార్పిళ్ల ఫలితంగా బలాబలాలు కూడా మారిపోయిన పరిస్థితుల్లోనే సభలు జరుగుతున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి పరిసరాలలో మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ముందస్తు సమాచారంతో బినామీల ద్వారా భూములు కొనుగోలు చేశారని అనేక కథనాలు వెలువడ్డాయి.. సాక్షి లో ఇవన్నీ వైసీపీ నేత జగన్‌ కావాలని రాయించాడని ఆరోపణలకు గురైన వారు ఆ పత్రికపై పరువునష్టం కేసులు పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటాచ్‌మెంట్‌లో వున్న ఆ పత్రిక ప్రజల ఆస్తిగనక ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటామని కొత్తవాదన చేశారు! ఆ పత్రిక రాయడం అటుంచితే ఇలాటి ఆరోపణలు రాజధాని గ్రామాలలో వినిపిస్తూనే వున్నాయి. ఎక్కడ ఎవరు వంటి తేడాలుండొచ్చు గాని పెద్ద తలకాయలు భూములు తీసుకోవడం బహిరంగ రహస్యం. ఇందులో వైసీపీ నేతలతో సహా ఇతరుల పేర్లు కూడా కొన్ని వినిపించకపోలేదు. ప్రభుత్వంపై ఆరోపణలకు జవాబులు చెబుతూ అందరి వివరాలు బయిటపెట్టవలసిన బాధ్యత ప్రభుత్వానిది. కాని మంత్రులూ ముఖ్యమంత్రి కూడా కొంటే తప్పేమిటి అని ఎదురుదాడి చేశారు. రావెల కిశోర్‌బాబు వంటి నేతలు అసైన్డ్‌ భూములపై చట్ట విరుద్ధంగా కూడామాట్లాడారు. కాల్‌మనీ రాకెట్‌ లేదా ఎక్కడో ఎంఎల్‌ఎ దాడితో సహా ప్రతిదాన్నీా ముఖ్యమంత్రి వెనకేసుకు వచ్చే ధోరణి మంచిది కాదని నేను చర్చల్లో గట్టిగానే చెప్పాను.
ఇక ఈ విషయంపై అసెంబ్లీలో ఏం జరుగుతుంది అని అందరూ ఎదురు చూశారు గాని అది ఒక నిర్జీవ తతంగంలాగే ముగిసిపోయింది. తన ప్రసంగంలో వాటిని జగన్‌ ప్రస్తావించగా ఆధారాలు వుంటే మంత్రులను డిస్మిస్‌ చేస్తానని ముఖ్యమంత్రి సవాలు విసిరారు. లేదంటే మీరు క్షమాపణలు చెప్పాలని, ఈ విషయం తేలిన తర్వాతనే ఇతర అంశాలు తీసుకోవాలని తీవ్ర స్వరంలోనే ప్రకటించారు. ముఖ్యమంత్రి స్వయానా ఇలా అనడం అరుదైన వ్యూహమే. అయితే వూహించని ఆ వ్యూహాన్ని తగు వాదనలతో ఎదుర్కోవడానికి జగన్‌ సిద్ధం కాలేదు. మీరే దందాలో కీలక పాత్రధారి అని అన్నారు. మైకు ఇవ్వలేదని సమర్థన చేసుకున్నా – మైకులో మాట్లాడినప్పుడు కూడా సిబిఐ విచారణ కోరడం తప్ప మరో వాదన రాలేదు. ఆధారాలివ్వడంపై సభ వెలుపల చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటివారు చేసిన వాదనలు కూడా జగన్‌ వినిపించలేదు. ఆరోపణలు లేవనెత్తాక సంబంధిత పత్రాలు సభాపతి టేబుల్‌పై వుంచడం, లేదా సభా సంఘం అడగడం, సంయుక్త సభాసంఘం(జెపిసి) కోసం పట్టుపట్టడం అనేక అవకాశాలున్నాయి. బోఫోర్స్‌ కుంభకోణంపై కూడా మొదట జెపిసి నడిచింది. సిబిఐ దర్యాప్తు రాజకీయంగా లేదా న్యాయపరంగా జరగాల్సిన నిర్ణయం. అందుకు నిరాకరించిన ప్రభుత్వం మరో విధంగా విచారణ జరిపిస్తామని గాక ు ఏ విచారణ చేసేది లేదు పొమ్మంటూ తప్పించుకుంది. క్షమాపణలు చెప్పాకే మరో అంశం అన్నవారు అధికారపక్షం అర్ధంతరంగా చర్చ ముగించేయడం కూడా బలహీనతనే చూపిస్తుంది. ఇరు పక్షాలూ సవాళ్లు చేసుకున్నా ఏతావాతా జరిగింది శూన్యం.
పొలవరంపైనా వాగ్యుద్ధం జరిగిందే తప్ప నిర్మాణ వ్యయం మూడు రెట్లు ఎందుకు పెంచారన్న ప్రశ్నకు జవాబు రాలేదు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దానికి తప్ప అన్నిటికీ బదులిచ్చారు. భాగస్వామ్య పక్షమైన బిజెపి సభ్యుడు విష్ణుకుమార్‌రాజు కూడా అడిగినా స్పందించలేదు. చంద్రబాబు బిజెపికి కూడా చురకలు వేశాక విష్ణుకుమార్‌ రాజు ధోరణి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రానికి రావలసిన కేటాయింపులపై కేంద్రాన్ని నిలదీయని టిడిపి, దానిపై విమర్శలు చేస్తూనే చల్లగా సర్దుకునే బిజెపి రెండింటి తీరు తేటతెల్లమైంది. ఇక ఇప్పుడు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు గనక ఆ చర్చలో ప్రతిపక్షం మరింతగా నిప్పులు కక్కొచ్చు. టిడిపి పాత భాగోతాలు ఏకరువు పెట్టొచ్చు. ఏది ఏమైనా ఇరు పార్టీల నేతలు పరస్పరం తిట్టుకుంటూ పుణ్యకాలం గడిపేస్తారని, ఇద్దరూ కూడా కేంద్ర బిజెపిని సుతిమెత్తగా వదిలేస్తారని చాలాసార్లు రుజువైన అనుభవం. ఇప్పుడైనా అంతే. ఈ రెండు పార్టీల వివాదం పక్కనబెడితే వామపక్షాలు ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విస్తారమైన నిరసన కార్యక్రమాలు నడుస్తున్నాయి. శాసనసభ సందర్భంలోనే ఆశావర్కర్లపై పోలీసుల దౌష్ట్యం సాగింది. నిర్బంధ భూ సమీకరణ/సేకరణకు వ్యతిరేకంగా జరిగిన నిర్వాసితుల ప్రదర్శనపైనా పోలీసులు దాడి చేశారు. నిరసన తెలిపిన ప్రతివారూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి ఆరోపించడం ఆగ్రహించడం హాస్యాస్పదం. తొమ్మిదేళ్ల పాలన గురించి పదేపదే ప్రస్తావిస్తారు గనక అప్పటి అనుభవాలు తర్వాత ప్రతిపక్షంలో వున్నప్పుడు చెప్పిన మాటలు ఆయన కనీసంగా గుర్తుంచుకుని అందరి హక్కులనూ ఆవేదనలనూ గుర్తించాలి. చర్చించి సమస్యలు పరిష్కరించాలి.
ఎపి తో పోలిస్తే ఇప్పటికి తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని హాయిగా జాయగా నడిచిపోతున్నట్టు చెప్పాలి. కొత్త రాష్ట్రంలో వారికి ఇది హనీమూన్‌ ఘట్టం. తెలుగుదేశంనుంచి సామూహిక ఫిరాయింపులు దాదాపు ముగించి విలీన ప్రహసనం నడిపిస్తున్నారు. జిహెచ్‌ఎంసి తర్వాత ఖమ్మం వరంగల్‌ కూడా కైవశం చేసుకుని రాజకీయ ప్రాబల్యం చాటుకున్నారు. బంగారు తెలంగాణ నినాదం, సంక్షేమ పథకాల ప్రభావం ఇందుకు కారణమని అంటున్నారు గాని అన్ని వ్యూహాలూ పనిచేశాయన్నది నిజం. ఎన్నికల మేనేజిమెంటులో ధనంపాత్ర కూడా తప్పడం లేదు. అయితే ఈ ఆనందాల తర్వాత ఆచరణాత్మక సవాళ్లు అనివార్యంగా ఎదురవుతాయి. పథకాలకు నిధుల కోసం పన్నులు రుణాలు తీసుకురావడం ప్రజలపై భారాలకు దారి తీస్తుంది.ఇప్పటికే విద్యుత్‌ ఛార్జీల పెంపు పొంచి చూస్తున్నది. గోదావరి ఆనకట్టలపై మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రాత్మకమని సంబరాలు చేసుకోవడంలో పొరబాటు లేదు గాని ఇది ఆరంభమే. బయిటి రాష్ట్రంతో సుహృద్భావం అవసరమేగాని కొత్త రాష్ట్రంలో ఇతర పార్టీలకు చెప్పడం కూడా ప్రజాస్వామిక అవసరమన్న దృష్టిని కెసిఆర్‌ ప్రదర్శించలేదు. రిజర్వాయర్ల ఎత్తు తగ్గింపు, ఈ రీడిజైన్‌ వల్ల వ్యయం పెంపు వంటి కీలకాంశాలపై భిన్నాభిప్రాయాలున్నాయి. డెవిల్‌ ఈజ్‌ ఇన్‌ డీెటైల్స్‌ అన్నట్టు భవిష్యత్తులో చేపట్టే ప్రతి ప్రాజెక్టుపైనా అంగీకారానికి రావడం సులభంగా వుండదు. ఇంత హడావుడి చేసినా ప్రాజెక్టుల నిర్మాణానికి పదేళ్లు కూడా చాలదన్న వాస్తవం వెక్కిరిస్తూనే వుంటుంది. సమైక్య పాలకుల నిర్లక్ష్యాన్ని నిర్వాకాలను విమర్శిస్తూనే వారి హయాంలో కుదుర్చుకున్న ఎత్తుకన్నా తక్కువకు ఒప్పుకుని రావడం తెలంగాణ సమాజంలో విమర్శలు తెచ్చిపెడుతుంది.ఇప్పుడు విజయోత్సాహాల మోతలో అవన్నీ కొట్టుకుపోతాయేమో గాని దీర్ఘశృతిలో తీవ్రధ్వనితో మళ్లీ ముందుకు రాకపోవు. ఎందుకంటే చరిత్ర ముందుకు తెచ్చిన సమస్యను చరిత్రే పరిష్కరించుతుంది.పాఠాలు నేర్చుకుని పదిమందినీ కలుపుకునిపోతే ఆ క్రమం ప్రజాస్వామికంగా వుంటుంది. లేదంటే ప్రజాఉద్యమోధృతతికీ ప్రకంపనాలకూ దారి తీస్తుంది. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం,దేశంలో మత మార్కెట్‌ తత్వాల విజృంభణ నేపథ్యంలో ప్రత్యామ్నాయ వ్యూహాలు లేని ప్రచార మంత్రాలు ఎక్కడైనా ఎంతోకాలం పనిచేయవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *