సవాళ్లు శివాళ్లు చప్పటి క్లైమాక్స్‌లు!

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో మొదటే వాయిదా తీర్మానాలపై పట్టుపట్టి పోరాడటం వల్ల అసలు చర్చలే జరక్కుండా పోతే తమకే నష్టమనిగ్రహించిన వైసీపీ ప్రశ్నోత్తరాలలో పాల్గొంటానని ప్రకటించింది.ఈ సమయంలోనూ విద్యుత్ ఒప్పందాలపై జగన్ చేసిన ఆరోపణలు చూస్తే ఒక పద్ధతిలో ఉపయోగించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు కనిపించింది. అయితే రాజధాని భూముల కొనుగోలు వ్యవహారం ప్రతిపక్షం దాడిని ప్రభుత్వం ప్రతిస్పందన ఎలా వుండబోతున్నాయనేదానిపై చాలా ఆసక్తి నెలకొంది. శాసనసభ జరగబోతున్నందువల్లనే సాక్షి వరుస కథనాలు ప్రచురిస్తున్నదని ఆ పార్టీ నాయకులొకరు చెప్పారు. ఈ కథనాలువచ్చీ రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులూ నాయకులూ కూడా అవసరాన్ని మించి రెండు మూడు సార్లు విరుచుకుపడ్డారు. వివరణలిచ్చారు. సాక్షిపై కేసులు కూడా పెట్టారు.
ఇదంతా సహజమే గాని ముందుగానే ముఖ్యమంత్రి ఏం జరగలేదని తేల్చిపారేయడం అంటే సమర్థించడమే అవుతుంది. కాల్‌మనీ అయినా మరొకటి అయినా ఆరోపణలు వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి ఏకపక్షంగా ముందే ఖండించవలసిన అవసరమేముందని నేను ఒకటికి రెండు సార్లు చర్చలలో ప్రశ్నించాను.
ఇలాటి అనేక విమర్శల పలితమే కావచ్చు- ఈ రోజు శాసనసభలో చంద్రబాబు నాయుడు జగన్ ఆరోపణలు నిరూపిస్తే తన మంత్రులు నారాయణను పత్తిపాటి పుల్లారావును డిస్మిస్ చేస్తానని గట్టిగా ప్రకటించారు. అందుకోసం వున్న సాక్ష్యాలు సమర్పించవలసిందిగా కోరి వ్యూహాత్మకంగా ఆత్మరక్షణలో పడేశారు. అలా సాక్ష్యాలు చూపలేకపోతే క్షమాపణలు చెప్పాలని ఆ తర్వాతే ఇతర అంశాలు తీసుకోవాలని మామూలుకంటే గట్టిగా మాట్లాడారు. ఆయనను అనుసరించి ఇతర మంత్రులు దాడి బృంద సభ్యులు జట్టుకట్టి రంగంలోకి దిగారు. అచ్చెం నాయుడు వంటి వారు ఎప్పటిలాగే ఎదురుదాడి చేశారు. ఈ దశకు వచ్చేసరికి మొదట ఆరోపణలు చేసిన జగన్ తర్వాత అంతే దీటుగా వాదన కొనసాగించినట్టు కనిపించదు. సిబిఐ విచారణ జరపాలన్న కోర్కెకే ఆయన పరిమితమైనారు. పదే పదే అదే అడిగారు. అసలు దందాకోరు మీరే అని కూడా ఆరోపించారు. అంతేగాని తాను సాక్ష్యాధార పత్రాలు సభకు సమర్పించలేకపోవడంలో తర్కం ఏమిటో చెప్పలేకపోయారు. పోనీ వున్నాయి గాని మీకు ఇవ్వడానికి నమ్మకం లేదు అన్నారా అంటే అదీ లేదు. నిజానికి సాక్షి కథనాల్లో మంత్రులకు సంబంధించిన వారుకొనుగోలు చేశారన్న వరకూ కొంత చూపించగలిగారు గాని వారు బినామీలని చెప్పడానికి ఉపయోగపడే ఆధారం ఒకటైనా లేకపోవడం ఒక లోపం. ఈ బలహీనతే జగన్ వాదనలోనూ ప్రతిబింబించింది. పైగా దాన్ని వ్యూహాత్మకంగా వాదించేందుకు అవసరమైన సన్నాహాలుకూడా ఆయన చేసుకున్నట్టు లేదు. మంగళవారం ఉదయం నాతో ఒక చర్చలో పాల్గొన్న వైసీపీ నాయకులొకరు జగన్‌కు సహాయపడాలంటూ త్వరగా వెళ్లిపోయారు. మరి ఇంతమంది కలసి తయారు చేసిన వాదనలో వివిధ కోణాలు ముందుగా ఆలోచించలేదా? అయితే ఆధారాలు చూపలేకపోతే క్షమాపణలు చెప్పాలన్న ప్రభుత్వం కూడా దీన్ని తెగేదాకా లాగకపోవడంలో మతలబేమిటి? ఆ సమస్య తేలిన తర్వాతే మరో చర్చ తీసుకోవాలని హెచ్చరించిన ముఖ్యమంత్రి తేలిగ్గానే వదలిపెట్టేశారు. లేకపోతే ఏదో పొరబాటున అన్నానని చెప్పినాసరిపోతుందని కూడా సన్నాయి నొక్కులకు అవకాశమిచ్చారు. మరోవైపు సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చర్చ ముగిసిందనే తీర్మానంప్రవేశపెట్టారు. అంటే దీనిపై ఒక పరిధికి మించి చర్చ జరగడం ప్రభుత్వం కూడా కోరుకోలేదని తేలిపోయింది. తీగలాగితే కదిలే డొంకల గురించి ఇరు పక్షాలకూ జంకు వుందనుకోవాలి.ఈ మధ్యలో స్పీకర్‌తో సహా ప్రభుత్వ ప్రతినిధులందరూ సిబిఐ దర్యాప్తు వల్ల రాజధాని ప్రతిష్టకు భంగం అని వాదించడం కూడా వాస్తవికంగా లేదు. ఎందుకంటే రేపు ఇంతకంటే తీవ్రమైన సమస్య రావచ్చు. ఇక్కడ ప్రతిష్టకు పాకులాడటం కన్నా నిజాన్ని ప్రతిష్టించడం ముఖ్యం. ఆధారాలు చూపిస్తే మంత్రివర్గం నుంచి తొలగిస్తానని ముఖ్యమంత్రి ఒకటికి రెండు సార్లు చెప్పడం మాత్రం విశేషమే. సభా సంప్రదాయం ప్రకారం జగన్ వున్న ఆధారాలు ప్రకటించి ఆ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి. ఒకవేళ ఈ ప్రభుత్వంపైన విశ్వాసం లేదనుకుంటే నిష్పాక్షిక నిపుణులకైనా వాటిని సమర్పించి నిజానిజాలు తేల్చమనవచ్చు. ఇవేవీ లేకుండా ఆయన అయితే సిబిఐ లేకుంటే లేదు అన్న వైఖరి తీసుకుంటే ఒరిగేది వుండదు. ప్రభుత్వం కూడా సిబిఐ విచారణ నష్టం అనుకుంటే మరో ప్రత్యామ్నాయ విశ్వసనీయ పద్దతిలో అక్రమాలను పరిశోధించాలి గాని ముందస్తుగా కితాబులిచ్చేసి కేసు మూసేస్తే సరిపోదు. అయితే ఈ రోజు సవాళ్లు సర్దుబాట్ల తతంగం చూస్తే కథ ముగిసినట్టే అనిపిస్తుంది. కనుక సభలో చాలాసార్లు చూసిన ప్రహసనమే పునరావృతమైందనుకోవాలి.