న్యూస్‌ టు నోట్‌…

eye111

.గత రెండు రోజులుగా నడుస్తున్న విజయమాల్యా ప్రహసనం చివరకు పలాయనంగా ముగిసింది. ఆయన నుంచి రుణాల వసూలు కోసం దేశం వదలివెళ్లకుండా చూడవలసిందిగా ప్రభుత్వ రంగ బ్యాంకులు న్యాయస్తానాన్ని కోరే సరికి ఆయన దూర తీరాలు చేరుకున్నాడు. ఆయన విదేశాలకు వెళ్లిపోయినట్టు సిబిఐ ద్వారా తమకు తెలిసిందని ప్రభుత్వం నివేదించింది. ఇక చేసేదేముంది? అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. మాల్యాతో సమస్య పరిష్కారం చేసుకోవడం తప్ప వెంటాడటం మన ఉద్దేశం కాదు కదా అని కూడా ఒక న్యాయమూర్తి అన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం పథకం ప్రకారం జరిగిందనేది స్పష్టం. ఈ సందర్భంగానే కింగ్‌ పిషర్‌ ఉద్యోగినులు మహిళా దినోత్సవాన మాల్యాకు రాసిన ఒక బహిరంగ లేఖలో ఆయన పోకడలను నిశితంగా ఖ:డించారు.తల్లిలాటి విమాన సంస్థను నాశనం చేశారని అభిశంసించారు. రుణాలలో పదో వంతు కూడా వసూలు చేయలేరని మీరు అనేవారు గాని ఇప్పుడిలా పలాయనం చిత్తగించడం మాకే బాధగా తలవంపులుగా వుంది. మీరు పతనమై పోవాలని మేము కోరుకోవడం లేదు గాని పరిస్థితికి బాధ్యులు మీరే అని ఆ లేఖలో రాశారు.

.దీర్ఘకాలం పాటు సిపిఎం పాలనలో వున్న ఖమ్మం మునిసిపాలిటీ టిఆర్‌ఎస్‌ గెలుచుకున్నది. దాంతో పాటే వరంగల్‌లోనూ పాగా వేసింది. తిరుగుబాటు అభ్యర్థులను కలుపుకొంటే ఇక్కడ కూడా అత్యధిక స్థానాలు దానికే దక్కాయి. ఇక అచ్చంపేటలోనైతే వున్న 20 స్థానాలూ గులాబీ జెండా వశమైనాయి. మొత్తంమీద జిహెచ్‌ఎంసి వూపును ఈ ఎన్నికలు ఇంకా ముందుకు తీసుకుపోయాయి. మరోవైపున తెలుగు దేశం నుంచి ఇంకో ఇద్దరు ఎంఎల్‌ఎలు దూకడం బోనస్‌.
.పశ్చిమ బెంగాల్‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సిపిఎం కాంగ్రెస్‌ల మధ్య అవగాహనపై విరుచుకుపడ్డారు. ఇది సూత్ర రహితమైందని ఆరోపించారు.తన వరకు తాను కాంగ్రెస్‌తోనూ బిజెపితోనూ కూడా దోస్తు కట్టిన కాలాన్ని మర్చిపోయారనుకోవాలి. ఇకపోతే ఆమెపై పోటీకి నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ మనవడు చంద్రకుమార్‌ బోస్‌ను నిలబెట్టాలని బిజెపి నిర్ణయించింది. గత కొంత కాలంగా నేతాజీ ఫైళ్లపై కేంద్ర హడావుడి తెలిసిందే. బెంగాలీలు ఎంతగానో ప్రేమించే నేతాజీ సెంటిమెంటు తమకు కలసి వస్తే శాసనషభలో ఖాతా తెరవొచ్చని కాషాయ నేతలు ఆశపడుతున్నారు.
.జెఎన్‌యులో అరెస్టులను పోలీసుల వేటను విద్యార్థి సంఘం ఖండించింది. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరింది. దేశద్రోహం ఆరోపణ ఎదుర్కొంటున్న వారు ఏర్పాటు చేశారంటూ ఈ సమావేశానికి ఎబివిపి హాజరు కాలేదు.మరోవైపున ఎబివిపికి చెందిన విద్యార్థులే మనుసృతిని తగలబెట్టడం ఆసక్తి రేకెత్తించింది. ఇదేరీతిలో వామపక్ష భావాలను బలపర్చే ప్రొ.మార్కండ్‌ పరంజపే కొన్ని విషయాలలో కన్నయ్య చరిత్రను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేసి వాస్తవాలు తెలుసుకోవాలని బహిరంగంగానే మందలించారు. కేరళ బెంగాల్‌ రాష్ట్రాలలో తను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవచ్చని కూడా కన్నయ్య ప్రకటించారు.
.రవిశంకర్‌ గురూజీ ఉత్సవాలకు ఎట్టకేలకు ఎన్‌జిటి అనుమతి లభించింది.

.రాజ్యసభ సమాధానంలో మరోసారి ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలపై చురకలు వేస్తూనే బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *