రావెల వ్యాఖ్యకు దళిత నేత దిగ్భ్రాంతి
వ్యక్తులెవరైనా మంత్రులుగా వున్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. ఈ కాలంలో కూడా మాటలతోనే పదవులు పోయిన ఉదంతాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్ బాబు ఆణిముత్యాలు అధికార తెలుగుదేశం పార్టీని చాలా ఇబ్బంది పెడుతున్నాయి.. విభజన నేపథ్యంలో రావెల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌పైన టిఆర్‌ఎస్‌పైన రాజకీయంగా దాడి చేస్తుండేవారు. జగన్‌పై విరుచకుపడేవారు. ప్రత్యర్థులను తిట్టిపోస్తూ తనను ఆకాశానికెత్తేవారిని ఆదరించే లక్షణం చాలామందిలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులోనూ ఎక్కువగా వుంటుంది. వారిని ముందుకు తెచ్చి మీరెందుకు అలా మాట్లాడ్డం లేదని తమనే మందలిస్తుంటారని ఆ పార్టీలో సీనియర్లు చెబుతుంటారు. అలా బయిటివారిని బాగా తిట్టిన చాలామంది ఇప్పుడు ఇతర పార్టీలలో చేరి ఆయనపై అంతకన్నా తీవ్రంగా దాడి చేయడం చూస్తున్నాం. కనుకనే ఆ పార్టీకోసమే గాక రాష్ట్రం కోసం కూడా ఇలాటి వారి విషయంలో జాగ్రత్త అవసరం. రెచ్చగొట్టడం వల్ల కలిగే దుష్ఫలితాలు చాలా వుంటాయి. రావెల విషయానికి వస్తే – రాజధానిలో భూములు నా భార్య కొంటే తప్పేమిటని అసైన్డు భూములు కొంటే తప్పేంటి అని కూడా అర్థంలేని సవాళ్లు విసిరారు. ఉమ్మడి రాజధానిలో తన కుమారుడు సుశీల్ కుమార్ దారుణమైన కేసులో దొరికిపోతే జాగ్రత్తగా మాట్లాడవలసింది పోయి జగన్‌కు అంటగట్టేందుకు ప్రయత్నించి అభాసుపాలైనారు. ఈ సమయంలో ఆపార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు ఫోన్ చేస్తే మంత్రి గారు బదులిచ్చిన తీరుకు ఆయనే విస్తుపోతున్నారు. ఆయన ఏమన్నాడో పేర్కొనడం బావుండదు గనక ఇక్కడ రాయడం లేదు. తను మరీ ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు? అని ఆ దళిత నేత ఆగ్రహించారు. మరి ముఖ్యమంత్రికి ఎప్పుడు కోపం వస్తుందో ముచ్చట గొల్పుతుందో తెలియదుగాని.. రావెల నోటికి తాళం అవసరమే. ఇతరులు వేయకున్నా తనే వేసుకోవడం శ్రేయస్కరం.
