న్యూస్ టు నోట్…
. జెఎన్‌యు విద్యార్థి సంఘ అద్యక్షుడు కన్నయ్య కుమార్‌ను చంపితే 11 లక్షలు బహుమానం ఇస్తానని పోస్టర్లు అతికించిన ఆదర్శశర్మను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతను పేదవాడని ఉద్రేకంలో ఇదంతా చేశాడని కథనాలు వస్తున్నాయి. అసహనాన్ని విద్వేషాలను రెచ్చగొడితే కలిగే పర్యవసానాలు ఇలాగే వుంటాయి. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరం వినాయక్ గాడ్సే కూడా ఇలాగే ద్వేషం పెంచుకున్నాడు. వీరిద్దరూ మౌలికంగా సంఘ పరివార్ భావజాలం నుంచే వచ్చిన వారు కావడం గమనార్హం. దేశాన్ని తన శవంపైనే ముక్కలు చేయాలని గాంధీజీ అన్నాడు. దేశం ముక్కలైంది గాని గాంధీ బతికేవున్నాడు అన్నది గాడ్సే కక్షా వాక్కు. అతన్ని దేశభక్తుడుగా పరిగణిస్తూ గాంధీని స్వచ్చ భారత్ అడ్వర్టయిజ్‌మెంట్లకోసం వాడుకునే వారు ఇప్పుడు ఆదర్శ శర్మ వంటివారిలో నాటుతున్న విద్వేషబీజాలు తొలగించేందుకు కూడా శ్రద్ద వహించాలి.
.చత్తీస్‌ఘర్‌లోని రారుపూర్‌లో ఒక చర్చిపై దాడి చేసి పలువురుని గాయపర్చిన ఎనిమిది మంది భజరంగదళ్( ఇది కూడా సంఘ పరివార్‌లో భాగమే) వ్యక్తులను అరెస్టు చేశారు.
. పిడిపి నాయకురాలు మెహబూబా మఫ్తి బిజెపితో మిశ్రమ ప్రభుత్వం తమ తండ్రి మనోభీష్టం అని ప్రకటించారు. ఇందుకు తానూ వెనుకాడబోనని పేర్కొన్నారు.తండ్రి మఫ్తీ మహ్మద్ సయిద్ మిశ్రమ ప్రభుత్వం నడిపిన సంగతి దేశమంతటికీ తెలుసు కదా! బిజెపి తరపున రామ్‌మాధవ్ ఇప్పటికే సంప్రదింపులలో తలమునకలై వున్నారు. ఇంతకూ మహబూబా ఈ సంగతి తెలుసుకోవడానికి ఇంత కాలం ఎందుకు పట్టింది?బిజెపిని ఆమె ఏం కోరారు? లేదా బిజెపి ఏం షరతులు పెట్టింది? బిజెపితో ఆమెకు ఏ సమస్యలు వచ్చాయి? ఏం కొంచెమైనా పారదర్శకత అవసరం లేదా? అంత కీలకమైన సరిహద్దు రాష్ట్రంలో రెండు మాసాలు రాజకీయ శూన్యం ఎందుకు సృష్టించారనేది అన్నిటికన్నా పెద్ద ప్రశ్న.
..కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజరు మాల్యా లండన్ కంపెనీ నుంచి భారీ మొత్తం తీసుకుని తన బ్యాంకు ఎగవేత రుణాల నుంచి బయిటపడే ప్రయత్నం భగమైంది. ఇప్పటికే పదివేల కోట్లు దాటిన ఆయన రుణంపై మరింత లోతైన దర్యాప్తు జరిగే వరకు ఈ వచ్చే మొత్తాన్ని డిపాజిట్‌చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతకు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. గొప్పవారి గోత్రాలు ఇలా అఘోరిస్తున్నాయి.
.యమునా నది తీరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు రవిశంకర్(శ్రీశ్రీ) తలపెట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లే ఆలోచనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విరమించుకున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతినివ్వడంపైనా, పర్యావరణకు నష్టంపైనా చాలా విమర్శలు రావడం ఇందుకు కారణమైంది. గతంలో బాబా రామ్‌దేవ్ కూడా చాలా విమర్శలు వివాదాల్లోచిక్కుకు పోవడం తెలిసిందే. ఏతావాతా ఆధ్యాత్మిక షోలు కూడా ఆర్భాటాలుఎక్కువై విమర్శల్లో కూరుకుపోతున్నాయన్నమాట.
.బిజెప అద్యక్షుడుి అమిత్ షా అమిత షోలో తాము రాష్ట్రానికి గొప్పగా సహాయం చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్న 24 గంటల తర్వాత కూడా ఈ రాత్రి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాటి వివరణ రాలేదు. బిజెపి అధినేత కూడా తమ నాయకులు పురంధేశ్వరి, సోము వీర్రాజుల తరహాలో విమర్శలు చేయకుండా ఏవో హామీలు స్నేహవాక్కులు వినిపించి వెళ్లారు. ఏతావాతా దక్కింది లేదు గాని బిజెపి టిడిపిల వ్యవహారం దాగుడు మూతల దండాకోర్ అన్నట్టుగా తయారైందని తేలిపోయింది. అయితే ప్రజలు మాత్రం అంత తేలిగ్గా సంతృప్తి చెందరు. సమస్యలు కూడా పరిష్కారం కావు. కనీసం ప్రస్తుత శాసనసభా సమావేశాలలో గవర్నర్ నరసింహన్ ప్రారంభోపన్యాసంలో లేవనెత్తిన కోర్కెలనైనా కేంద్రం నెరవేర్చనప్పుడు టిడిపి ఇంత మౌనం ఎందుకు పాటిస్తుందో అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం ఆ రెండు పార్టీల అంతర్గత ఏర్పాటుగా మారిపోతున్నదా?
