వెంకయ్య ఫ్లాష్‌బ్యాక్‌ ..కన్హయ్య సూపర్‌ స్ట్రోక్‌

kannahayavnkayya111
వెంకయ్య నాయుడు మోడీ ప్రభుత్వంలో అత్యంత ప్రభావ శీలమైన మంత్రుల్లో ఒకరు. దీనికి ముందు ఆయన తొలిఅడుగులు వేసింది ఆంధ్ర యూనివర్సిటీలో ఎబివిపి నాయకుడుగా. సీతారాం ఏచూరి జెఎన్‌యు లో ఎస్‌ఎఫ్‌ఐ నేతగా. జైపాల్‌ రెడ్డి ఉస్మానియాలో. ఇలాటి ఉదాహరణలు ఇంకా చాలా వున్నాయి. స్వాతంత్రానికి పూర్వం మదన్‌ మోహన్‌ మాలవీయ స్థాపించిన బెనారస్‌ యూనివర్సిటీలోనే చండ్రరాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, నండూరి ప్రసాదరావు తదితర నేతలంతా వచ్చారు. లండన్‌లో చదువుకుంటున్నప్పుడే మహాత్మాగాంధీ, జ్యోతిబాసు వంటి వారు నాయకులయ్యారు. ఈ జాబితా చాలా పెద్దది. కాని విచిత్రమేమంటే అదే వెంకయ్య నాయుడు గారు జెఎన్‌యు విద్యార్థి సంఘ అద్యక్షుడు కన్హయ్య కుమార్‌ను రాజకీయాల్లోకి రావద్దంటున్నారు. చదువో రాజకీయాలో ఏవో ఒకటి చూసుకొమ్మంటున్నారు. ఇంతకన్నా విడ్డూరం ఏముంటుంది? నీ ఆదర్శం ఏమిటో చెప్పమన్న వెంకయ్య సవాలుకు కన్హయ్య అద్భుతంగా సమాధానం చెప్పాడు- నేను రాజకీయ నేతను కాదు. నా ఆదర్శం రోహిత్‌ వేముల తప్ప అఫ్జల్‌ గురు కాదు అని. అయితే భారత దేశ పౌరుడైన అఫ్జల్‌ గురు ఉరిపై చర్చకు అవకాశముందని కూడా స్పష్టం చేశాడు. బహుశా వీటిలో వెంకయ్యకు సమాధానం లభించివుండాలి. శుక్రవారం ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసంలో వెంకయ్య నాయుడు వామపక్ష మితవాద విద్యార్థి సంఘాలంటూ తనే విభజించి చూపారు. మరి మితవాద విద్యార్థి సంఘం ఎబివిపి ఫిర్యాదులకు మొత్తం కేంద్రమంత్రులంతా అతిగా స్పందించడంలో రాజకీయం లేదా? కనుక ఒకప్పటి విశాఖ విద్యార్థి నేతగా కేంద్రమంత్రి గారు తన ఫ్లాష్‌బ్యాక్‌ చూసుకోవడం మంచిది కదా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *