రివర్స్‌ గేర్‌.. వై?ఎస్సార్‌…

tdpys111jagan4444

కొంత కాలం కిందట నేను ఒక సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుసుకున్నాను. అప్పటికి తెలంగాణలో టిడిపి నుంచి వలసలు కొద్దిగానే జరిగాయి. అయితే ఇంకా చాలా మంది వెళతారని సమాచారం మాత్రం వుంది. కొంతమంది మాలాటి వారితో తమ అసంతృప్తి వ్యక్తం చేసేవారు. దీని గురించి చంద్రబాబుతో ప్రస్తావిస్తే ‘వెళ్లేవాళ్లందరూ వెళ్లిపోయారు.ఇక రాజకీయంగా ముందుకు పోవడమే’ అన్నారు. కాదు ఇంకా వెళ్లిపోయే అవకాశముందనే వాస్తవాన్ని అంగీకరించలేదు. ఇదే పరిస్థితి ఇప్పుడు వైఎస్సార్‌ పార్టీ ఎదుర్కొంటున్నది. ఎంతో కష్టపడి కేవలం నలుగురినే తీసుకుపోయారని జగన్‌ తేలిగ్గా తీసేశారు. కాని ఇంతలోనే మరో ముగ్గురు ఫిరాయించారు. ప్రలోభాలతో తీసుకుపోతున్నందుకు తెలుగుదేశంను విమర్శించవచ్చు గాని అంతర్గత పరిస్థితిని పసిగట్టడంలో, అడ్డుకోవడంలో వైఫల్యాన్ని వైసీపీ అధినేత పరిశీలించుకోవద్దా?
విభజిత ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా సమస్యలున్నాయి. వనరుల కొరత వుంది. ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి కూడా వుంది. రాజధాని నిర్మాణంలో అయోమయం, రైతుల ఇతర స్థానికుల ప్రయోజనాల పరిరక్షణలో జాప్యం సందేహాలు చాలా వున్నాయి. బాక్సయిట్‌ తవ్వకం వంటి సమస్యలున్నాయి. రాయలసీమలో ఉద్యమాలు వస్తున్నాయి. కాల్‌మనీ నుంచి అగ్రిగోల్డ్‌ వరకూ అనేక సమస్యలు సంచలనం కలిగించాయి. అయితే వీటిపై రాజకీయ విమర్శలు తప్ప ఒక పరిధి మించి ముందుకుపోగల స్థితిలో వైసీపీ వుండదు. వాటిలో వారి నాయకులు కూడా కొందరు వుండటం, భూముల సేకరణలోనూ వారి పేర్లు వినిపించడం, గతంలో చేసిన పనులూ అన్నిటినీ మించి అపరిష్క్రతంగా వున్న కేసులూ వైసీపీకి పగ్గం వేస్తుంటాయి. కిరణ్‌ కుమార్‌ హయాంలో చంద్రబాబు చేతులు కట్టేసుకున్నట్టే ఇప్పుడు జగన్‌ కూడా తనకు తాను గీసుకున్న గీతలలోనే సంచరిస్తుంటారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్‌ వాదులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఖాతరు చేయనట్టు వ్యవహరిస్తుంటుంది.
ఇక ఇప్పుడు వైసీపీ ఎంఎల్‌ఎల వలస కూడా మొదలవడం పరిస్థితిని ఇంకా దిగజారుస్తుంది. తెలంగాణలో తనవారిని చేర్చుకుంటే విమర్శించిన తెలుగుదేశం ఎపిలో అదే పని చేయడం హేయమే. కాని వారిని నిలబెట్టుకోలేకపోవడంలో జగన్‌ పాత్రకూడా వుంది. ఈ ఘటనల తర్వాతనైనా ప్రధాన ప్రతిపక్షం ప్రజలను కదిలించేందుకు పార్టీని క్రియాశీలం చేసేందుకు చర్యలు తీసుకుంటే బావుంటుంది. అలాగే భేషజాలకు పోకుండా రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వంతో సంప్రదించడానికి రాయబారాలు వెళ్లడానికి సిద్ధం కావాలి.ఎంతసేపటికి గవర్నర్‌కే మెమోరాండాలు ఇచ్చి వస్తామంటే సరిపోదు,సరికాదు కూడా. ప్రభుత్వం అఖిలపక్షాలు జరపడం లేదు ప్రతిపక్షమైనా అందరి సలహాలు తీసుకోవడానికి ఎందుకు సిద్ధం కాదు?

నిజానికి ఈ తరహా పరిస్థితి ఇప్పుడే కాదు, గతంలోనూ వుండేది. పాత్రలే మారాయి. ప్రతిపక్షం ఢ అంటే ఢ అనే స్థితిలో వుండటం డీలా పడిపోవడం రెంటినీ చూశారు తెలుగు ప్రజలు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు హయాంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లి సమస్యలు లేవనెత్తుతూ ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిగానే ప్రతిష్టితులైనారు. సంఖ్య రీత్యా ఇప్పుడు జగన్‌ అంతకన్నా ఒకింత అధికంగా వున్నా ఆ వ్యూహం ఆ ప్రజా కోణం గోచరించడం లేదు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో తెలుగు దేశం రెండు సార్లు ఓడిపోయింది. ఆయన మరణానంతరం కాంగ్రెస్‌ చెప్పలేనంత దారుణమైన రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. జగన్‌ బలంగా సవాలు చేశారు.కాని తెలుగు దేశం ఆయన గురించి కాంగ్రెస్‌ కన్నా ఎక్కువ జాగ్రత్త తీసుకుంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. ప్రభుత్వం నామకార్థంగా నడిచింది. అయితే ఆ సమస్య పట్ల ఎలాటి వైఖరి తీసుకోవాలో తేల్చుకోలేక కొంత, జగన్‌ను రాకుండా చేయడమే ప్రధానమనుకోవడం వల్ల కొంత తెలుగుదేశం ఆఖరి వరకూ అంతర్గత సమస్యలతో సతమతమైంది. చివరకు చంద్రబాబు నాయుడు పాదయాత్రలతోనూ నిరాహారదీక్షలతోనూ ఎలాగో బతికించుకోవలసి వచ్చింది.
ఇంత చేసినా తెలంగాణలో టిఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా వస్తే తెలుగుదేశం మనగడకు ఠికాణా లేకుండా పోయింది. జగన్‌ అధికారంలోకి రాలేకపోయినా దీటైన ఏకైక ప్రతిపక్షంగా గణనీయంగా సీట్లు ఇంచుమించుగా ఓట్లు తెచ్చుకోగలిగారు. కాని ఓదార్పులు పరామర్శలు వ్యక్తిగత పర్యటనలు తప్ప ప్రజలను కదిలించడం ఆయనకు పెద్దగా పట్టదు. అందుకోసం వనరులు కేటాయించడానికి సిద్ధం కారు. కార్పొరేట్‌ తరహాలో క్యాలికులేటెడ్‌గా అడుగులు వేస్తుంటారు. ముఖ్యమంత్రిని కాలేకపోయాననే వాస్తవాన్ని ఆయన ఒక్కనాటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడో అప్పుడో ఆ స్థానంలోకి వస్తాననే వూహించుకుంటున్నారు. అందుకే ప్రభుత్వంలోకి వచ్చాక ఏం చేయాలనేది తప్ప ప్రతిపక్షంగా ఎలా శక్తివంతమైన పాత్ర నిర్వహించాలనేదానిపై ఆయనకు స్పష్టత లేదు. ఇష్టత కూడా లేదు. తన బలం చాలు గనక ఎవరికోసం ఎందుకు పాకులాడాలనుకుంటారు. మరో సమస్య అన్ని పాలక పార్టీలకూ వున్నదే ఆయనకూ వుంది. తాత్కాలికంగా వ్యతిరేకించడం తప్ప రేపు తను వచ్చినా ఈ వ్యాపారానుకూల విధానాలనే అనుసరించాలి గనక మరీ సమరశీల పోరాటాలు పెంపొందించడం నచ్చదు. ఆ వరవడీ వుండదు. కనుక ఇప్పుడు జగన్‌ కూడా తన వారిని నిలుపుకోలేక ఉద్యమ మార్గం తీసుకోవడం ఇష్టం లేక అప్పుడు చంద్రబాబు అనుసరించిన మార్గాన్నే చేపట్టవచ్చు.

ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రిని లేదా మంత్రులను కలుసుకున్న దాఖలాలు లేవు. అలాగే ముఖ్యమంత్రి ఆయనను ఆహ్వానించిన సందర్బాలు కూడా లేవు. మేము రాజధాని శంకుస్థాపనకు పిలిస్తే రాలేదని ప్రభుత్వం వారంటారు. కాని అప్పుడు కూడా మంత్రులు వెళ్లడం తప్ప ముఖ్యమంత్రి స్వయానా మాట్లాడింది లేదు. పిలవడానికి వారు వస్తామంటే జగన్‌ స్పందించకపోవడం కూడా చూశాం. రెండెద్దులుజోడాయ చేను బీడాయా అన్నట్టు ఈ రెండు పార్టీలు పరస్పరం ఘర్షణ పడుతూ నూతన రాష్ట్ర ప్రయాజనాలపై జరగాల్సిన ఉమ్మడి కృషికి నష్టం చేయడం బాధాకరమైన వాస్తవం. ఫిరాయింపుల వేట ఆపి అందరినీ కలుపుకొని ముందుకు పోవడానికి ప్రభుత్వం చొరవ చూపించాలి. ప్రతిపక్షంగా ప్రజలను కదిలించే పాత్ర వైసీపీ తీసుకోవాలి. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో వున్న బిజెపి కూడా రాష్ట్రానికి న్యాయం చేసి తన గౌరవం నిలబెట్టుకోవాలి. వెంకయ్య నాయుడు పొగడ్తలు సోము వీర్రాజు తెగడ్తల ద్వంద్వ రాజకీయాలు విరమించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *