ఆస్కార్ అవార్డు ‘రహస్యాలు
చూస్తుండగానే ఏడాది హాలివుడ్ రీలులా గిర్రున తిరిగిపోయింది. ఆస్కార్ అవార్డుల వేడుక మళ్లీ వచ్చేసింది. సాధారణంగా ఆస్కార్ పురస్కారం పొందే చిత్రాలు దర్శకుల గురించిన అంచనాలు ఇంచుమించుగా అంతిమ ఫలితాలతో సరిపోతుంటాయి. కొద్దిసార్లు మాత్రమే స్పష్టంగా చెప్పలేని స్థితి వస్తుంటుంది. ఈ సారి గతఏడాది అంతగా ఉత్కంఠ లేదు గాని రకరకాల జోస్యాలు నడుస్తున్నాయి. ఈ సారి ద బిగ్ షార్ట్, మ్యాడ్ మ్యాక్స్, రెవనెంట్, రూమ్, స్పాట్‌లైట్, బ్రిడ్స్ ఆప్ స్పైస్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి దానికి తోడు ఆస్కార్‌పై కొత్త కొత్త వివాదాలు వస్తున్నాయి. నల్లజాతి వారికి అవకాశాలు బాగా తక్కువగా వుండటం, అమెరికా విదేశాంగ విధానానికి అనుగుణంగా నిర్ణయాలు జరగడం వంటి విమర్శలు గతంలో వున్నాయి. ఈసారి అదనంగా హాలివుడ్ పురుష పక్షపాతం కూడా మీడియాలో చర్చనీయమైంది. నటనకు సంబంధించి ఎవరి పాత్రలు వారివైనప్పుడు ఉత్తమ హీరో హీరోయిన్లకు విడివిడిగా ఎందుకివ్వాలని కొందరు ఫ్రశ్న లేవనెత్తారు. మహిళా ప్రధానమైన చిత్రాల్లో వారినే ప్రధాన పాత్రధారులుగా పరిగణించాలని వాదిస్తున్నారు.
ఆస్కార్ గురించిన కథలు ఎలా వున్నా నిజానికి ఈ అవార్డుకు చాలా చాలా పూర్వ రంగం వుంటుంది. ప్రతిఏటా ముందుగానే వివిధ విభాగాల కింద నామినేషన్ల జాబితా విడుదల చేస్తుంటారు. అయితే అందులో కూడా అన్నిటికన్నా అగ్రస్థానాన వున్న ఒకటి రెండు చిత్రాలే అవార్డులన్నీ పొందుతుంటాయి. అలా చూస్తే గత సారి బర్డ్‌మ్యాన్, బారుహుడ్, గ్రాండ్ బుడాపెస్ట్ హొటల్, ఇమిటేషన్ గేమ్, అమెరికన్ స్నిప్పర్స్ వంటి పేర్లు వినిపించాయి. ఇందులో చివరకు బర్డ్ మ్యాన్ ఎ క్కువ అవార్డులు పొందింది. ఆస్కార్ పొందే చిత్రం కుటుంబ విలువలు కలిగివుండాలని చెబుతారు. గతంలో విజేతగా నిలిచిన ఆర్టిస్ట్ చిత్రం కుటుంబమంతటితో చూసేది మాత్రమే కాదు. మీ బామ్మ కూడా ఆనందించగలిగిందిగా వుంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ బామ్మ కూడా తన బామ్మతో కలసి ఆనందించగలిగిందై వుండాలట! ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎలాటి సామాజికత లేకుండా సకుటుంబ విలువల పేరిట దద్దోజనంలా వుండటమే గొప్పని 2010లో హిందూ విమర్శకుడు భరద్వాజ్ రంగన్ ముందే జోస్యం చెప్పాడు. నిజంగానే ఆర్టిస్ట్ ఉత్తమ చిత్రంగానే గాక ఉత్తమ నటుడు దర్శకుడు తదితర అనేక అవార్డులు తెచ్చుకోగలిగింది. ఆ చిత్రంలో మూకీ యుగం నాటి ఒక నటుడు తెరమరుగై పోతే ఆయన కారణంగా అప్పట్లో బాగా రాణింపునకు వచ్చిన ఒక ఎగ్‌స్ట్రా నటి తనకు మళ్లీ అవకాశం వచ్చేలాచేయడం ఈ చిత్ర కథ. అందులోనూ అది నలుపు తెలుపు చిత్రం! రంగులకూ హంగులకూ పెట్టింది పేరైన హాలివుడ్ ప్రపంచంలో ఇదెలా విజేత కాగలిగింది? ఈ చిత్రం చాలా సాదా సీదాగా ఎలాటి శ్రమ లేకుండా కళా హృదయాలను సృశించగలుగుతుందని అప్పట్లో ఇచ్చిన వివరణ. దాంతోపాటే సమకాలీన ప్రపంచాన్ని కాస్సేపైనా మర్చిపోయేలా చేసి అంతా బాగుందన్న భావన లేదా భ్రమ కలిగిస్తుందని గార్డియన్ పత్రిక రాసింది. తొమ్మిది సార్లు ఆస్కార్ వేడుకల సమర్పకుడిగా వ్యవహరించిన బిల్లీ క్రిస్టల్ ఒకసారి ఏమన్నాడంటే’ నేటి ప్రపంచంలోని ఆర్థిక సంక్షోభాలు వగైరాలను మర్చిపోయి కాస్సేపైనా హయిగా వుండాలంటే ఏకైక మార్గం ఈ రాత్రి కొన్ని గంటల పాటు ఈ ఉత్సవాలను తిలకించి ఆనందించడమే’! గత ఏడాది పంట పండించుకున్న బర్డ్‌మ్యాన్ కథ ఇంచుమించు నాటి ఆర్టిస్ట్‌కు దగ్గరగా వుంటుంది.
మాజీ హీరో మధనం
ఈ చిత్రం కూడా ఒక మాజీహీరో కథతో నడుస్తుంది.స్పైడర్ మ్యాన్ తరహాలో బర్డ్‌మ్యాన్‌గా బాగా పేరుతెచ్చుకున్న రిగ్గన్ థామ్సన్(మైకెల్ కేటాన్) అనే హీరోచుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఎంతసేపటికీ తనను బర్డ్‌మ్యాన్‌గా తప్ప నటుడుగా గుర్తించకపోవడం అతన్ని చాలా బాధిస్తుంది. నటుడుగా తన సత్తా ఏమిటో చూపించాలనుకుంటాడు. జీక్ అనే మిత్రుడి సహాయంతో ఒక బ్రాడ్వే థియేటర్లో ఒక నాటకం ప్రదర్శించాలని భావిస్తాడు. అందుకోసం ‘వాట్ వురు టాక్ వెన్ వురు టాక్ అబవుట్ లవ్’ అనే నాటకం ఎంచుకుంటాడు. అప్పటి నుంచి అతని సమస్యలు మొదలవుతాయి. వసూళ్లలో రికార్డులు సృష్టించిన బర్డ్‌మ్యాన్‌ను దర్శకుడు అలెగ్జాండర్ గోనాలెంజ్ ఇషరూ ఎంతో ప్రత్యేక శ్రద్ధతో రూపొందించాడు.. చివరకు బర్డ్‌మ్యాన్‌కు ఉత్తమ నటుడు,దర్శకుడు, ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లే తదితర అనేక పురస్కారాలు దక్కాయి!
ఆస్కార్ ఎంపిక ఎలా?
ఆస్కార్ అవార్డుల వేడుకలు విశ్వ వ్యాపితంగా ప్రసారమై కోట్లమందిని అలరిస్తాయి.ఆ తరుణంలో బహుమతి గ్రహీతల హావభావ విన్యాసాలు వినోద విభావరుల వివరాలు మీడియాలో నిండి పోతాయి. కాని దానికి ముందు చాలా తతంగమే నడుస్తుంది. దశల వారీ తతంగాలు సాగుతాయి. హాలివుడ్ మాతృభూమి అమెరికా అంతర్జాతీయ ప్రయోజనాలూ ప్రతిబింబిస్తాయి. ఇది తరతరాలుగా సాగుతున్న కథ. ఈ సారి ఎంపికలోనూ అవన్నీ చూడొచ్చు. ఏవో చెదురు మదురు సందర్భాలలో బలమైన కారణాలు తోసుకువస్తే తప్ప ఆస్కార్ ఆస్కారం ఏమిటో తిరాస్కారాలెందుకో పరిశీలకులు చెప్పేస్తుంటారు. ప్రపంచ వినోద పరిశ్రమకు కేంద్ర స్థానమైన హాలివుడ్ సూత్రాలు అంత బలమైనవన్న మాట.
ఈ అవార్డు ఎంపిక కళాత్మక విలువలను బట్టి జరుగుతుందనుకుంటారు గాని ఓటింగును బట్టి తుది నిర్ణయం జరుగుతుందని చాలా మందికి తెలియదు. అధికారికంగా ఈ అవార్డు పేరు అకాడమీ అవార్డులు.అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్జ్ అండ్ సైన్సెస్ సభ్యులైన 5783 మంది ఓట్లు వేస్తారు. దానికి ముందు నామినేషన్ల పేరిట తొమ్మిది ఉత్తమ చిత్రాల జాబితా రూపొందిస్తారు. ప్రైజ్ వాటర్ కూపర్స్ అనే ఆడిటింగ్ సంస్థ(కుంభకోణాల్లో ఈ పేరు విన్నాం) ఓట్లను లెక్కించి ప్రకటిస్తుంది. అయితే ఈ వివరాలు గోప్యంగా వుంటాయి గాని ఒకసారి లాస్ ఏంజెల్స్ టైమ్స్ ప్రస్తుత వివరాలను సంపాదించి ప్రచురించింది.ఈ ఎంపిక చేసే ఓటర్లలో 94 శాతం మంది శ్వేతజాతీయులుంటారనీ,77 శాతం పురుషులేనని పత్రిక వెల్లడించింది.గతంలో చాలా సార్లు జాతి వివక్షకు సంబందించిన ఆరోపణలను ఎదుర్కొన్న ఆస్కార్ నేపథ్యం ఈ విధంగా బహిర్గతమైంది.రెండు శాతం మంది మాత్రమే నల్లజాతి వారు కాగా మరో రెండు శాతం మంది లాటిన్ అమెరికన్లట.15 విభాగాల్లోనైతే అచ్చంగా శ్వేతజాతి పురుషులే వున్నారట.నల్లజాతి కళాకారుల పట్ల వివక్షకు నిరసనగా గతంలో కొంతమంది ప్రముఖులే ఈ కమిటీ నుంచి నిష్క్రమించారు కూడా.
ఆ సంగతి అలా వుంచితే అవార్డుల ఎంపికలోనూ కొన్ని రివాజులు ఏర్పడ్డాయి.ఇవి మిగిలిన చిత్రోత్సవాలకు భిన్నంగా వుంటాయి. ఉదాహరణకు కేన్స్‌ను తీసుకుంటే అక్కడ ప్రయోగవాదానికి పెద్ద పీట లభిస్తుంది.వెనిన్‌లో నవ్య వాస్తవిక వాదం ఆదరణ పొందుతుంది.బెర్లిన్‌లో వాస్తవిక చిత్రణకు పట్టం కడతారు. వీటన్నిటినీ హాలివుడ్ గమనిస్తూనే వుంటుంది. కాని వారి కొలబద్దలు వేరు.పురోగామి శీలత కన్నా యథాతథ స్తితిని గతావలోకనాన్ని ప్రతిబింబించే చిత్రాలకు అక్కడ పురస్కారాలు ఎక్కువగా దక్కుతాయి. ఉదాహరణకు ఈ జాబితాలో చోటు సంపాదించిన ఎక్స్‌ట్రీమ్లీ లౌ డ్ అండ్ ఇన్ క్రెడ ిబుల్లీ క్లోజ్”,వార్ హార్స్, ద హెల్ప్ వంటి చిత్రాలను తీసుకుంటే వాటి బాక్సాఫీసు విజయాలకు తోడు పాత చూపు కూడా కీలక పాత్ర వహించింది. గతంలో కూడా షేక్స్‌పియఱ్ ఇన్ లవ్,గ్లాడియేటర్,లార్డ్ ఆఫ్ రింగ్స్,రిటర్న్ ఆఫ్ ద కింగ్, స్లమ్ డాగ్ మిలియనిర్, ,వంటి చిత్రాలన్ని పురస్కారాలు పొందాయి.ఇవన్నీ అర్హమైనవా కాదా అనే ప్రశ్న పక్కన పెడితే వీటిలో ఏదీ భవిష్యత్తుకు సంబంధించిన చైతన్యం ఇచ్చేది కాదు.అవార్డుతో వాటిని ఆకాశానికెత్తడమే జరిగింది.మిలియన్ డాలర్ బేబీ, హర్ట్ లాకర్ వంటి చిత్రాలు ఎప్పుడైనా మన్నన పొందాయంటే తమకూ కొన్ని విభిన్న విలువలున్నాయని చెప్పుకోవడానికి మాత్రమేనన్నది విమర్శకుల విశ్లేషణ. ఈ సారి ద బిగ్ షార్ట్, మ్యాడ్ మ్యాక్స్, రెవనెంట్, రూమ్, స్పాట్‌లైట్, బ్రిడ్స్ ఆప్ స్పైస్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అండ్ ద ఆస్కార్ మే గో టు..

