నలుగురి గుప్పిట్లో తెలుగు రాజ్యాలు

crony1111

ఇప్పుడు క్రోనీ క్యాపిటలిజం నడుస్తున్నది. రాజకీయాధికారంతో వనరులను వశం చేసుకుని మీడియా సహాయంతో చక్రం తిప్పడం దీని లక్షణం. సరళీకరణ పితాహహుడైన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్వయంగా ఇలాటి వ్యవస్థ పెరిగినందుకు ఆందోళన వెలిబుచ్చారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ఇది తారాస్థాయికి చేరిందని ఆ క్రమంలోనే జగన్‌ లక్ష కోట్లు పోగేసుకున్నాడని పెద్ద ప్రచారమే నడిచింది. ఆయనపై కేసులు కొనసాగుతూనే వున్నాయి. అవి ఎప్పుడు ఏమవుతాయో గాని ఇప్పటికైతే నత్త నడక నడుస్తున్నాయి.

వైఎస్‌ కుటుంబం గురించి ఆ ప్రచారం వచ్చింది గాని నిజానికి అలాటి ఆధిపత్య పరివారాలు ఇంకా వున్నాయంటున్నారు సంఘ పరివార్‌కు విధేయుడైన ఒక నాయకుడు. అంతెందుకు?

తెలుగు రాష్ట్రాలలో ఆర్థిక రాజకీయ పరిణామాలను అమితంగా ప్రభావితం చేస్తున్న అత్యంత శక్తివంతులు నలుగురున్నారని ఆయన చెబుతున్నారు. ఎన్నిసార్లు విమర్శించుకున్నా మధ్య మధ్య ప్రశంసించుకున్నా ఆలింగనాలు చేసుకున్నా కారాలు మిరియాలు నూరుకున్నా.. అంతిమంగా అధికారం సంపదలూ పంచుకుంటారు… వారి మాటే చెల్లించుకుంటారు. ఇది ఆ ఆరెస్సెస్‌/ బిజెపి నాయకుడి ఆవేదన. ఆగ్రహం కూడా.

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోడీ విశ్వాసం పొంది అన్ని సందర్బాల్లో తానై సంచరిస్తున్న ఒక సీనియర్‌ తెలుగు నేత,
రెండు తెలుగు రాష్ట్రాలలో సర్వాధికారం నెరుపుతున్న ఇద్దరు టూ స్మార్ట్‌ అధినేతలు
మీడియా సామ్రాజ్యాన్ని రికార్డు స్థాయిలో విస్తరించిన ఒక పెద్ద .. వీరే ఆ నలుగురనీ, ఇదో ఇష్ట చతుష్టయం అని అంటున్నాడా అసలు సిసలు ఆరెస్సెస్‌ వాది.

నిరంతరం రాజకీయాల్లో లీనమై వుండే వీరికి వ్యాపార వ్యవస్థలతో అవినాభావ సంబంధాలున్నాయి. అస్మదీయుల ప్రయోజనాలున్నాయి. ఆధ్యాత్మిక అనుబంధాలున్నాయి. అధికార యంత్రాంగలో పైనా కిందా తిరుగులేని పట్టు వుంది గనక వీరు అనుకున్నదే జరుగుతుంది. లేకుంటే జరక్కుండా చేస్తారు. అనుకున్నది జరిగే వరకూ ఆపేయించగలరు. లెక్కలు కుదరగానే చిక్కులు తొలగిపోతాయి. పనులు జరిగిపోతాయి. తన పేరు సంస్థల పేర్లు చెప్పడం లేదు గాని ఈ ఇరవై నెలల్లోనూ అందుకు ఎన్నో ఉదాహరణలు చూపిస్తున్నాడాయన.

ఇక్కడ కలిసివచ్చే అంశమేమంటే ప్రముఖ ప్రతిపక్ష నేతలు కూడా ఈ తరహా వ్యాపార లావాదేవీలకు పెద్దగా అభ్యంతరం చెప్పరు. లివ్‌ అండ్‌ లెట్‌ లివ్‌ అన్నది వారి జీవన సూత్రం. ఎవరికి వారికి ీ ఆర్థిక కార్యకలాపాలు సాగిపోతూనే వుండాలి. ఇవన్నీ అనుసంధానం చేసే ‘ఎకనామిక్‌ హిట్‌ మెన్‌’ ‘ట్రబుల్‌ షూటర్స్‌’ వుంటారు గాని అంతగా కనిపించరు.లోలోపల అల్లుకుపోతుంటారు. వైరాలు వైరుధ్యాలు వస్తే సర్దుబాటు చేసి సామరస్యంగా నడపడంలో ఈ సంధాన కర్తలు సమర్థులై వుంటారు.
ఎవరూ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.. గత కొద్ది మాసాల పరిణామాల పరంపర నెమరేసుకోండి… ఎవరు ఎప్పుడు అలిగారు, ఎవరు ఎప్పుడు దిగారు, ఎవరు ఎలా అతికించారు, ఎలా బతికించారు తెలుస్తుంది.

గత కేంద్ర ప్రభుత్వంలో బాగా సీనియర్‌ అయిన ఒక మాజీ కేంద్ర మంత్రి చాలా రోజుల కిందట ఇదే మాట నాతో చెప్పారు. ప్రభుత్వంలో ఎవరు వున్నా కనిపించని కార్పొరేట్‌ శక్తులే నడిపిస్తుంటాయి. వారి గురించి లేఖలు రాశాను, మీడియాకు లీకులిచ్చాను కాని ఏం లాభం? ఈ పాలకుల కన్నా వారే మహా శక్తివంతులు.. ఇలాటి ప్రయత్నాలు తేలిగ్గా అడ్డుకోగలరు అని ఆయన అనుభవంతో చెప్పిన మాట. ఇప్పుడు జంట తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది చూస్తుంటే ఆరెస్సెస్‌ వాది చెప్పిందీ మాజీ మంత్రి వర్యుడు చూసిందీ నిజమేనని అర్థమవుతుంది.

తరాలు కాలాలు మారిపోవచ్చు గాని ప్రేమ శాశ్వతం, ప్రేమికులు మారుతుంటారు అన్నట్టే ప్రయోజనాలు శాశ్వతం, ప్రభుత్వాలు పాలక పార్టీలూ మారుతుంటాయి! అంతిమంగా ధనమూలమిదం జగత్‌. ఓం శాంతి శాంతి శాంతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *