సెక్స్‌ వర్కర్లంటే సానుభూతి లేని సృతి మేడం!

సెక్స్‌ వర్కర్లంటే సానుభూతి లేని సృతి మేడం!durga1111

జెఎన్‌యు వివాదంపై మాట్లాడవలసిన మానవ వనరుల మంత్రి సృతి ఇరానీ అసందర్భంగా చాలా ప్రస్తావనలు చేశారు. వీటివల్ల రాజకీయ ప్రత్యర్థులపై ఆధిక్యత సాధించాలని ఆమె అనుకొని వుండొచ్చు గాని అనవసరమైన చాలా వివాదాలు తీసుకొచ్చారు. ఉదాహరణకు జెఎన్‌యు వివాదానికి ఆమె చదివిన తీస్తా సెతల్వాద్‌ పుస్తకాలకూ సంబంధం ఏమిటి? బిజెపి పాలిత రాష్ట్రాలలో పాఠ్య పుస్తకాలలో నూరిపోస్తున్న విషయాలు చాలా వున్నాయి?.అలాగే దుర్గాపూజ బెంగాల్‌లో ఎక్కువగా జరుగుతుంది గనక రేపటి ఎన్నికల్లో లాభం జరుగుతుందనే ఆశ తోనే ఆమె దేవతను అవమానించారన్న పోస్టరులో భాగాలంటూ కొన్ని చదివి వినిపించారు. జెఎన్‌యు విద్యార్థుల పోస్టరులో ఏముందో పూర్తిగా తెలియదు గాని ఆమె పార్లమెంటులో చదివి వినిపించడం ద్వారా లేని ప్రచారం కల్పించారు. ఇందువల్ల విద్వేషం పెంచడమే ఉద్దేశమైతే దేశం ఎంత మూల్యం చెల్లించాల్సి వుంటుందో ఆలోచించారా?
దుర్గాదేవి మాతృస్వామిక వ్యవస్థకు ప్రతీకగా నిలిచిన దేవత. మహారాష్ట్రలో ఒక కథ ప్రకారం ఆమె మహిషాసురుణ్ని హతమార్చాక అతను కొత్త రూపంలో వచ్చి ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. ఇక బెంగాల్‌లోని అసుర అనే గిరిజన తెగ వారు తాము మహిషాసుర సంతతి అని నమ్ముతారు. వామనుడు అణగదొక్కిన బలిని మళయాలీలు దేవుడుగా పూజిస్తారు. కనుక రాక్షసులు దేవతల గురించిన కథలన్నీ అన్నిచోట్లా ఒకేలా వుండవు. మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యం ప్రకారమే చూసినా శివుడి వరాల వల్ల చావు లేకుండా చేసుకున్న మహిషుణ్ని వధించడానికి త్రిమూర్తులు తమ శక్తులు ధారపోసి దుర్గను తయారు చేస్తారు. ఆమె మహత్తర సౌందర్యంతో ఆయుధధారియై పులిమీద వచ్చి యుద్ధానికి పిలుస్తుంది. మహిషుడి సైనికులు ఒక అప్సరస మీ కోసం వచ్చిందని చెబుతారు. తర్వాత అతను యుద్దంలో హతమవుతాడు. మహిషాసురిడి పేరుమీదనే మైసూరు ఏర్పడిందని ఇతిహాసం. అక్కడి చాముండేశ్వరి ఆలయంలో మహిషాసురుడి విగ్రహం వుంటుంది. మహిష అతని చెల్లెలు అంటూ ఆమెకు కూడా ఒక చోట గుడి కట్టారు. ‘ఏమంటివి ఏమంటివి నీది ఏ కులము?’ అని ఎన్టీఆర్‌ డైలాగులు మార్మోగుతుంటే భారతాన్ని అవమానించినట్టా?ఆయన కన్నా పౌరాణిక బ్రహ్మలా వీరు?
ఇతర విషయాలు ఎలా వున్నా మహిళా మంత్రిగా సెక్స్‌ వర్కర్‌ అని నొక్కి పలుకుతూ చులకన చేయడం సబబేనా? పురాణాల్లో దేవ వేశ్యలుగా ఇంద్రలోకంలోనూ జోగినులు బసవిలు, దేవదాసీల పేరిట సమాజంలోనూ అట్టిపెట్టబడిన వారు గాని ఒక విధంగా సెక్స్‌వర్కర్లు కారా? ఇంకో చేదు నిజం కూడా ఆమె తెలుసుుకోవాలి. బెంగాల్‌లోని కుమార్‌ తులిలో దుర్గా విగ్రహాలు చేసే కళాకారులు సెక్స్‌ వర్కర్ల వాడగా పేరొందిన సోనాగచ్చి నుంచి మట్టి తీసుకువస్తారు. ఇది తరతరాలుగా అమలవుతున్న ఆచారం. ‘నిషిధ్ధ పలి’్ల నుంచి ‘పుణ్యమటి’్ట గా దాన్ని భావిస్తారే గాని చులకనగా చూడరు. ఇందుకు రకరకాల వివరణలు వున్నాయి గాని ఇక్కడ అప్రస్తుతం. కనుక రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను మతాలను తీసుకురావడం దారుణం. సాక్షాత్తూ శ్రీరాముణ్ని రథంపై ఎన్నికల గుర్తుగా వేసుకుని వూరేగిన వారికంటే మరెవరూ అవమానించగలరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *