ప్రియమైన దీపికా…
.
పీకూ చిత్రానికి గాను ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సందర్భంలో దీపికా పడుకునే తన తండ్రి బాడ్మింటన్ తార ప్రకాశ్ పడుకునే ఎప్పుడో రాసిన లేఖను చదివి వినిపించి అందరితో కంటతడి పెట్టించారు. ఆ లేఖ కొద్దిపాటి సంక్షిప్తీకరణతో….
………………………
ప్రియమైన దీపికా అనీషా,
జీవిత యాత్ర ప్రారంభ దశలో వున్న మీతో నా జీవితం నేర్పించిన కొన్ని పాఠాలు పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని దశాబ్దాల కిందట బెంగుళూరులో చిన్న కుర్రాడుగా నేను పెరుగుతున్నప్పుడే బాడ్మింటన్‌ను ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ రోజుల్లో శిక్షణ ఇచ్చే వారు గాని స్టేడియంలు క్రీడావరణాలు గాని లేవు. కెనరా యూనియన్ బ్యాంకు సమీపంలోని ఒక కళ్యాణమండపం మాకు బాడ్మింటన్ కోర్టు. దానికి సంబంధించిన సమస్తం అక్కడే నేర్చుకున్నాను. అక్కడ ఏ వేడుకలు లేని రోజులు గమనించి స్కూలు అయిపోగానే పరుగెత్తుకెళ్లేవాళ్లం. వెనక్కు తిరిగి చూస్తే నా బాల్యంలోనూ యువ ప్రాయంలోనూ కొట్టవచ్చినట్టు కనిపించే లక్షణం ఏమంటే జీవితం గురించి నేనెలాటి ఫిర్యాదులు చేయకపోవడమేనని గుర్తించాను. వారంలో కొన్ని గంటలైనా షటిల్ ఆడేందుకు మాకు అవకాశం వుందని సంతోషించేవాణ్ణి. నా పురోగమనానికి పునాదిగా ఏదైనా ఉపయోగపడిందంటే అది ఏ విషయానికి అతిగా పొంగిపోవడం గాని కుంగిపోవడం గాని చేయకపోవడమే. నా పిల్లలుగా మీకు చెప్పదలుచుకున్నదదే. జీవితంలో దృఢ నిశ్చయం, కఠోర పరిశ్రమ, దృఢసంకల్పం, కోరుకున్నది సాధించాలనే తపన అనేవాటికి వేరే ప్రత్నామ్నాయాలు వుండవు. మీరు చేసేదాన్ని మీరు ప్రేమించేట్టయితే మీకు మరేదీ ప్రధానంగా అనిపించదు- అవార్డులు ప్రతిఫలాలు, పత్రికల్లో టీవీలలో మీ ముఖం చూసుకోవడం ఏదైనా దాని తర్వాతే. నేను ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ ఛాపింయన్‌షిప్ గెల్చుకున్నప్పటికి బహుమతి మొత్తం గణనీయంగా 3000 పౌండ్లకు పెరిగింది. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తమే.అయితే ఈ క్రీడకు సంబంధించి భారత దేశానికి ప్రపంచ పటంలో స్థానం కల్పించడం అన్నదే నాకు అత్యధిక ఆనందం కలిగించింది.
దీపికా.. పద్దెనిమేదేళ్ల వయసులో నీవు మోడలింగ్ వృత్తి చేపట్టేందుకోసం ముంబాయికి వెళతానన్నప్పుడు నీ వయస్సు తక్కువనీ, నీకేమీ తెలియని ఒక మహానగరంలో వంటరిగా వుండేందుకు అవసరమైన అనుభవం లేదనీ అనుకున్నాము. ఆ పరిశ్రమ గురించి మాకూ ఏమీ తెలియదు. కాని చివరకు నీ మనసులో ఏముందో తెలుసుకుని ఆ కలను సాకారం చేసుకునే అవకాశం ఇవ్వాలని దాన్ని నిరాకరించడం క్రూరత్వమవుతుందని భావించాము. నీవు విజయం సాధిస్తే అది మాకు గర్వకారణమవుతుంది. ఒకవేళ నీవు గనక విజయవంతం కాకపోయినా సరే ప్రయత్నం చేశావు గనక నీకే విచారమూ వుండదు. దీపికా. జీవితంలో మనమెల్లప్పుడూ విజయం సాధించలేమని మీరు కావాలనుకున్నవన్నీ కాలేకపోవచ్చనీ జీవితం నాకు నేర్పించింది. మనం కోరుకున్నట్టుగానే పరిస్థితులు వుండవు. కొన్ని గెలవాలంటే కొన్ని పోగొట్టుకోవాలి. జీవితంలో ఆటుపోట్లను ఒకే స్పూర్తితో తీసుకోవడం నీవు నేర్చుకోవాలి. నేను ఆట మొదలు పెట్టిన రోజునుంచి ముగించేవరకూ ఒకే విధంగా దానిపై శ్రద్ద చూపుతూ వచ్చాను. అత్యంత క్లిష్టమైన కాలంలో కూడా నేను లేనిదానిపై గాక వున్నదానిపైనే దృష్టి కేంద్రీకరించాను. అత్యంత అధ్వాన్నమైన పరిస్థితులను కూడా దృఢంగా వుండి లక్ష్యం సాధించగల శక్తి సమకూర్చుకున్నాను.
తలిదండ్రులు పైకి ఎగతోయాలని చూడకుండా ముందుకు దూసుకుపోవాలని నేను మీకు నిరంతరం చెబుతూ వచ్చాను గుర్తుందా? పిల్లలు తమ కలలు నెరవేర్చుకోవడానికి తామే కష్టపడి పనిచేయడం అత్యుత్తమని నేను నమ్ముతాను. అన్నీ పళ్లెంలో అమర్చి అందించాలని వారు ఎదురు చూడకూడదు. నీవు ఇంటికి వచ్చినప్పుడు దీపికా, నీ పరుపు నీవే వేసుకోవాలి, భోజనం తర్వాత బల్ల శుభ్రం చేయాలి. అతిధులు వుంటే నేలపైన పడుకోవాలి అని చెబుతుంటాము. నిన్ను మేమెందుకు తారగా చూడటం లేదని ఆశ్చర్యం అనిపించినా నీవు మొదట మా కూతురువి. తర్వాతనే సినిమా తారవు.నీవెక్కడకు వెళ్లినా వెంటనంటి వచ్చే కెమెరాలు, విద్యుద్దీప కాంతులూ ముందుముందు మాయమై పోతాయి. వాస్తవ ప్రపంచమే మిగులుతుంది. నీవు చాలా కొత్తదానికి, చాలా పరిమితమైన శక్తి గల దానివీ అయినా సరే నీ చుట్టూ సానుకూల వాతావరణం పెంపొందించేందుకు ప్రయత్నించు. నీవు ఎంచుకున్న పరిశ్రమలో ఎప్పుడూ భారీ సంపదలు చలామణిలో వుంటాయని నాకు తెలుసు. అయితే నా ఉద్దేశంలో ఎంత డబ్బు ఎంత అనేదానితో నిమిత్తం లేకుండా అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రయత్నించు. జీవితంలో నిజంగా నిలిచివుండేవి సంబంధాలు అనుబంధాలు, నిజాయితీ తలిదండ్రులనూ పెద్దలనూ గౌరవించడం వంటివి మాత్రమే. భౌతిక సంపదలు పెంచుకోవడం ముఖ్యమే గాని సంతోషానికి మూలంగా వుండేది మాత్రం మానసిక ప్రశాంతత….
చివరగా నీ వృత్తిజీవితం ముగిసిన తర్వాత నిజంగా నీతో వుండిపోయేది నీవు సృష్టించుకున్న కుటుంబం స్నేహితులూ మాత్రమే. ఆరోగ్యకరమైన జీవితం గడుపు. నీ మానసిక దృష్టికి అనుగుణంగా జీవించు. మిగిలిందతా తాత్కాలికమే. ఒకటి గుర్తు పెట్టుకో.. ఏది ఎలాఅయినా సరే మేము నీ కోసం వుండనే వుంటాము.
ప్రేమతో
పప్పా.
……………………………
ఆయన రాసిన లేఖను ఆమె ఉద్వేగంతో పూర్తి చేయగానే కరతాళధ్వనులు మార్మోగాయి. చాలామంది కళ్లుతుడుచుకున్నారు. వేదిక మీద వున్న రేఖ అభిమానంగా ఆలింగనం చేసుకున్నారు!