నాటకీయ ఆవేశం, రాజకీయ దాడి
హెచ్‌సియు జెఎన్‌యు ఉద్రిక్తతలపై మానవ వనరుల శాఖా మంత్రి సృతి ఇరానీ సుదీర్ఘ సమాధానం సర్దుబాటు ధోరణిలో గాక మరింత ఘర్షణ పెంచే రీతిలో సాగింది. ఈ సందర్భంగా ఆమె తన టెలివిజన్ సీరియల్స్ రోజులకు తిరిగి వెళ్లారని చాలామంది ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.ఇప్పటి వరకూ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలనే కాగితాలు చదువుతూ పునరుద్ఘాటించడం మినహా సమస్య ఎందుకు ఈ రూపం తీసుకుందో పరిష్కరించడానికి ఏ చర్యలు తీసుకుంటారో ఆమె చెప్పింది లేదు. భారత దేశం పేరు పదే పదే ఉపయోగిస్తూ తమ పార్టీ చెప్పే హిందూత్వ భావజాలమే దేశమన్నట్టు చిత్రించేందుకు మిగిలిన వారంతా దీన్ని రాజకీయాలకు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలనే గాక తీస్తా సెతల్వాద్ వంటివారి పేర్లు కూడా ఉటంకించారు. చాలాసార్లు మొహం తుడుచుకుంటూ ఆవేశపడుతూ ఉద్రేకం ప్రదర్శించారు తప్ప కొత్తగా సమస్యపై వెల్లడించిన విషయాలేమీ లేవు. ప్రతి నీటి చుక్కా మాకు గంగాజలమే, ప్రతి కంకర రాయి మాకు శంకరుడే చనిపోయిన తర్వాత గంగానదిలో నిమజ్జనం చేస్తే మా అస్తికలు కూడా భారత మాతాకు జై అని నినదిస్తాయి అని అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పిన మాటలు ఉటంకించడం చూస్తే వ్యూహాత్మకంగానే మంత్రి ఉద్వేగం పెంచారని అర్థమతుతుంది. అంతకు ముందు రాజ్యసభలోనూ బిఎస్‌పి నాయకురాలు మాయావతిని ఢకొీంటూ నా తలను కోసి మీ పాదాల దగ్గర సమర్పిస్తానని నాటకీయంగా ప్రకటించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇందిరాగాంధీని బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో వాజ్‌పేయి కూడా దుర్గా అని సంబోధించారని అంటూనే నిజానికి ఆ విషయంలో ఆమె విముక్తి చేసిందేమీ లేదని ఒక పుస్తకాన్ని ఉటంకించారు. రోహిత్ ఆత్మహత్య విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించలేదని కూడా ఆమె ఆరోపించారు.ఈ వ్యవహారంలో మొదటి నుంచి వివాదాస్పద ప్రకటనలూ వ్యాఖ్యలు చేసింది ఆమెనే గనక సమర్థించుకోవడానికి కూడా తీవ్ర స్వరం వినిపించారనుకోవాలి. మొత్తంపైన ఈ రోజు ఇరానీ ఉద్వేగంగా మాట్లాడిన దానికి దీటుగా ప్రతిపక్షం కూడా గొంతెత్తడం ఖాయం. లౌకిక విలువలు, ప్రజాస్వామ్య చర్చ వంటి వాదనలపై ప్రభుత్వం దాడి చేయబోతున్నట్టు కూడా ఈ రోజు విదితమైంది.ఈ లోగా కూడా సభలో లోపలా బయిటా నిరసనలు వ్యక్తమైతే ఆశ్చర్యం లేదు. చర్చకు సిద్ధమన్న ప్రభుత్వం నిజానికి యుద్ధానికి సిద్ధమైంది గనక రైల్వే బడ్జెట్ ముందూ తర్వాత ఈ రాజకీయ రణశంఖాలు మళ్లీ వినిపించవచ్చు.
