భరోసా ఇవ్వని రాష్ట్రపతి ప్రసంగం
దేశమంతా జెఎన్‌యు ఉదంతంపై ఉడికిపోతున్నది. జాట్లు, కాపులు, పటేళ్లు తదితర సామాజిక వర్గాల ఆందోళనలు తీవ్ర రూపం తీసుకున్నాయి. ప్రస్తుతానికి కొన్ని సర్దుకున్నా మళ్లీ రాజుకోవనే పరిస్థితి లేదు. ఇక అరుణాచల్‌లో రాజ్యాంగ సంక్షోభం, జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయ శూన్యం కొనసాగుతూనే వున్నాయి. అసహనం గురించిన వివాదం ఏదో రూపంలో రగులుకొంటుంటే సంఘ పరివార్ వివాదాస్పద వ్యాఖ్యలు వినిపిస్తూనే వున్నాయి. వృద్ధిరేటు లెక్కలు ఎలా వున్నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం, కార్పొరేట్ల లక్షల కోట్ల ఎగవేతతో బ్యాంకుల దివాళా రైతుల ఆత్మహత్యలు ఉత్పత్తి ఉపాధి రంగాల ప్రతిష్టంభన ఇలా ప్రతిదీ ఆందోళన కలిగిస్తున్నది. ఇలాటి నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం దేశానికి భరోసా ఇచ్చేలా రూపొందించాల్సింది. అందరినీ కలుపుకొని పోవడం ద్వారా ప్రశాంతతను ప్రజాస్వామ్య విలువలను కాపాడతామన్న సందేశం అందాల్సింది. అయితే జరిగింది వేరు. ఇచ్చిపుచ్చుకునే రీతిలో చర్చలు జరగాలనీ, పార్లమెంటరీ చర్చలు అర్థవంతంగా వుండాలని వ్యాఖ్యానించడం ప్రతిపక్షాలకు హెచ్చరిక వంటిదేనని భావిస్తున్నారు.ఇందుకు భిన్నంగా ప్రధాని మాత్రం సభ ప్రయోజనకరంగా జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ప్రతిపక్ష మిత్రులతో జరిపిన వివిధ చర్చల్లో సానుకూల ధోరణి వ్యక్తమైందని కూడా ఆయన అభినందించారు. అలాటప్పుడు రాష్ట్రపతి ప్రసంగంలోనూ దాన్ని ప్రతిబింబించకపోవడం ఎందుకో అర్థం కాదు. నిజానికి ప్రతిపక్షాలు చాలాసార్లు రాష్ట్రపతిని కలిసి ఈ విషయాలన్నీ దృష్టికి తెచ్చారు.అయినా సరే షరామామూలుగా ప్రభుత్వ పథకాల ప్రశంసకూ వాగ్దానాలకు ఆయన పరిమితమైనారు. పైగా ఈ ప్రసంగంపై కాంగ్రెస్ నిరుత్సాహం వ్యక్తం చేస్తే వారి కితాబు మాకక్కర్లేదు అని కేంద్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం ఆదిలోనే హంసపాదులా వుంది. ఇదే గనక ప్రభుత్వ వైఖరికి ప్రతిబింబమైతే పార్లమెంటు సమావేశాల్లో ప్రకంపనాలు తప్పకపోవచ్చు.
