జెఎన్‌యులో దాగుడు మూతలా?
దేశ వ్యతిరేక నినాదాలు చేసి కనిపించకుండా పోయారన్న విద్యార్థి నాయకులందరూ జెఎన్‌యులో మళ్లీ ప్రత్యక్షమైనారు. తాము వచ్చినట్టు కూడా మీడియా ద్వారా తెలియజేశారు. . జెఎన్‌యు విద్యార్థి సంఘ కార్యదర్శి రామనాగీ, అఫ్టల్ గురు నినాదాల విషయంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్, అనిర్‌బెన్ భట్టాచార్య, మాజీ అద్యక్షుడు అశుతోష్ కుమార్, అనంత ప్రకాశ్‌లు యూనివర్సిటీలోనే వున్నామని వెల్లడించారు. ఇందులో ఖలీద్, భట్టాచార్యలు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరగా హైకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.లాయర్ల సలహా మేరకు వారు మీడియాతో మాట్లాడేందుకు కూడా నిరాకరించారు ఇక రామానాగీ తమకు దాచిపెట్టుకోవలసిన అవసరం లేదనీ కేవలం ఆ రోజు పరిస్థితిని బట్టి లోపల తలదాచుకున్నామనీ ప్రకటించారు. ఇద్దరు మాత్రమే క్‌ోర్టుకు వెళ్లడానికి కారణమేమిటంటే వారిపై ప్రత్యక్ష ఆరోపణలుండటమే నని మరో అనంత ప్రకాశ్ జవాబునిచ్చారు. అశుతోష్ కుమార్ మాట్లాడుతూ తమకు యూనివర్సిటీ నిర్వహించే విచారణపై నమ్మకం లేదన్నారు. ఇదంతా ఇలా వుంటే వీరిని అరెస్టు చేయకుండా ఢిల్లీ పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారనేది దురూహ్యంగా వుంది. వారుగా లొంగిపోవాలని లేకపోతే మా ఆప్షన్లు మాకుంటాయని కమిషనర్ బస్సీ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.నిజానికి పార్లమెంటు సమావేశాల ప్రారంభం రీత్యానే పోలీసులు తటపటాయిస్తున్నట్టు కనిపిస్తుంది. అదీగాక కోర్టుల ఆదేశాలు ఎలా వుంటాయనే సందేహం కూడా వుండొచ్చు. ఏమైనా విద్యార్థి నేతలపై దేశ ద్రోహ ముద్ర వేసి విపరీత ప్రచారం చేసిన ప్రభుత్వం వారు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా దాగుడుమూతలు ఆడటం విచిత్రమే.
