వైసీపీ టు టీడీపీ….. ప్రభావమేమిటి?

jagan babu11

తెలంగాణలో తమ వారందరినీ కెసిఆర్‌ టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నట్టే వైఎస్సార్‌ పార్టీ నుంచి ఎంఎల్‌ఎలను చేర్చుకోవాలని తెలుగుదేశం నాయకత్వం ఉబలాటపడటం రాజకీయంగా సరైందేనా? లేక పులిని చూసి నక్క వాతపెట్టుకున్న చందం అవుతుందా? ఎందుకంటే తెలంగాణలో కెసిఆర్‌కు మొదట అత్తెసరు మెజార్టి వుండటంతో భద్రత కోసం ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం రాజకీయ అవసరంగా భావించారు. తన బలం పెంచుకోవడానికే గాక ప్రతిపక్షాలు తనను పడగొట్టే పరిస్థితి లేకుండా చేసుకోవడానికి ఆయన ఈ పద్ధతి అనుసరించారు. విమర్శలు ఖాతరు చేయకుండా ఫిరాయింపులను ఇంకా ప్రోత్సహిస్తూనే వున్నారు. కాని ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వానికి ఆ పరిస్థితి లేదు. పైగా వైసీపీ వారిని మరీ భారీ ఎత్తున చేర్చుకుంటే అప్పుడు yరికి పట్టుపెరుగుతుంది.ే కీలకమైన సామాజిక సమీకరణలలోనూ మార్పు వస్తుంది. తెలంగాణలో ఫిరాయింపులు తెలంగాణలో చలామణి అయినంత సులభంగా ఆంధ్రప్రదేశ్‌లో నడవవనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీకి శాసనసభలో ఢ అంటే ఢ అనగల సంఖ్యాబలం వుంది. కనుక ఈ ఫిరాయింపుల ప్రహసనం ఇది సభా ప్రతిష్టంభన వంటి పరిణామాలకు దారితీస్తుంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌పై వ్యక్తిగతంగా దాడి పెరుగుతుంది. ఆయన ఎలాగూ పార్టీ మారిన వారితో వెంటనే రాజీనామాలు చేయించే అవకాశం వుండదు.
వైసీపీ నుంచి తమలోకి వచ్చేస్తున్నారని టిడిపి నేతలు ఇంతగా చెబుతున్నారంటే కొందరిపై గట్టి నమ్మకం వుండబట్టే. పునరేకీకరణ పేరుతో ముఖ్యమంత్రి కూడా ఇందుకు ఆమోదముద్ర వేశారు. అయితే దీనివల్ల రాజకీయంగా పడే ప్రభావం కూడా ఆలోచించాల్సిన విషయం. ే ఇప్పటికే చంద్రబాబు నాయుడు తమను సరిగ్గా పట్టించుకోవడం లేదనే భావన కొందరు ముఖ్య నాయకులలోనే వుంది. ఎప్పుడు ఏ పదవి ప్రకటిస్తారా అని చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. వారిని సంతృప్తి పర్చడానికి ఆయన కూడాతంటాలు పడుతున్నా చిన్న రాష్ట్రం కనుక పరిమితులు ఎక్కువగానే వున్నాయి. ఈ పరిస్థితులలో వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహిస్తే వారికి కూడా పదవులు పందేరాలు పనుల కానుకలు కట్టబెట్టవలసి వస్తుంది. ఇప్పటికే అసంతృప్తితో వున్న వారికి అర్థంతరంగా వచ్చే వారికి మధ్య వైరుధ్యం తలెత్తుతుంది. ఈ కారణంగానే వచ్చే వారికి సంబంధించి స్పష్టంగా ప్రకటన చేయకుండా నచ్చజెప్పేందుకు భారీ కసరత్తు చేశారు. ఇక వైసీపీ నేత స్వభావాన్ని బట్టి వెళ్లేవారిని ఆపడానికి అన్ని విధాల వత్తిడి చేస్తారు. సామదాన భేద దండోపాయాలు ప్రయోగిస్తారు. .మొదట్లో వెళ్లిన రేణుక వంటివారి విషయమే ఒక కొలిక్కి రాలేదని గుర్తుంచుకోవాలి. పార్టీ మారిన వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు జరిపించాలనే కోర్కెతో వైసీపీ రాజకీయ దుమారం లేపేందుకు కూడా ప్రయత్నిస్తుంది. అప్పుడు తెలుగుదేశం అనుకోని రాజకీయ ఘర్షణ విభజన ఎదురవుతుంది. వైసీపీని బలపర్చే సామాజిక తరగతులలో ఇప్పటికి పెద్ద మార్పు లేదు గనక మారిన వారినుంచీ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి కూడా ఎక్కువగానే వుంటుంది. దేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ ఫిరాయింపులు మామూలే అయినా ఈ ప్రత్యేక కారణాల రీత్యా ఎపిలో దాని ప్రభావం కొంత భిన్నంగా వుండొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *