సిపిఎం కార్యాలయంపై దాడి అఘాయిత్యం

సిపిఎం కార్యాలయంపై దాడి అఘాయిత్యం AKG-BHAVAN-ATTACK-PHOTO-4 akg3333

న్యూఢిల్లీలోని సిపిఐ(ఎం) కేంద్ర కార్యాలయం ఎకెగోపాలన్‌ భవన్‌పై కొందరు దుండగులు దాడి చేసి బోర్డుకు రంగు పూసి నినాదాలు రాయడం ఎంతైనా ఖండనార్హం. దేశద్రోహులారా తప్పుకోండి అని, పాకిస్తాన్‌ ముర్దాబాద్‌ అనీ వారు నినాదాలిచ్చారు. జెఎన్‌యు ఘటనల నేపథ్యంలో ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. దేశంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయంపైనే దాడి జరగడం పెరుగుతున్న అసహనానికే గాక అప్రజాస్వామిక ధోరణులకు అద్దం పడుతుంది. వారిలో ఒకరిని అక్కడున్న నాయకులు కార్యకర్తలు పట్టుకున్నారు. తను ఆమ్‌ ఆద్మీ సేనకు సంబంధించిన వాడనీ, బిజెపి ఆరెస్సెస్‌ల తో సంబంధం లేదనీ పోలీసు వర్గాలు మీడియాకు చెబుతున్నాయి. పైగా అతను గతంలో కొంతకాలం ఆప్‌లో పనిచేశాడని ముక్తాయిస్తున్నారు. నిజంగా సంబంధం లేదనుకుంటే దేశంలో యువతపై ప్రభుత్వ ప్రచారాల ప్రభావం ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతుంది. అలాగే తమ ప్రచారాలతో రెచ్చిపోయిన వారి నుంచి రక్షణ కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం కూడా తెలుస్తుంది. గతంలో గాంధీజీని హత్య చేసిన నాథూరాం వినాయక్‌ గాడ్సే కూడా ఆరెస్సెస్‌నుంచి వైదొలగి మరో హిందూ తీవ్ర వాద సంస్థ పెట్టుకున్నాడని చెబుతుంటారు. కాని సంఘ పరివార్‌ ఆయన వాంగ్మూలాన్ని ప్రచారం చేస్తుంది. బిజెపి శివసేన ఆయనపై నాటకాలు వేస్తాయి. ఇప్పుడైతే గాడ్సే గొప్ప దేశభక్తుడని కితాబులిస్తున్నారు. కనుక పరివార్‌ పరోక్ష ప్రత్యక్ష భాగస్వాములెవరన్నది విచారణలో గాని తేలదు. ఒక జాతీయ పార్టీ కేంద్రంపై దాడి చేశారంటే వారికి వెనక తప్పక దన్ను వుండి వుండాలి. అదేమిటో తేలాలి.ఇదివరకు కూడా ఆరెస్సెస్‌ వారు కేరళలోని కన్ననూర్‌ ఘటనలకు నిరసన పేరిట ఎకెజి భవన్‌పై దాడి చేశారు.హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంపైనా దాడి చేసి ఆయన చిత్రపటాన్ని పాడుచేసేందుకు ప్రయత్నించారు. విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంను మరో పేరుతో అద్దెకు తీసుకుని లోపల తిష్టవేసి ఇదంతా చేయడం గమనార్హం.
ఈఘటనపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్‌లో వ్యాఖ్యానం చేస్తే ఆయనపైనా ద్వేషపూరిత వ్యాఖ్యలు కుప్పిస్తున్నారు. అంతెందకు?నా ఫేస్‌బుక్‌ పేజీ ‘ తెలకపల్లి రవి వ్యూస్‌’లో ఎంత విషం కురిపిస్తున్నారో ఇప్పుడే చూడొచ్చు. ఆఖరుకు ఒకరిద్దరైతే చంపేయాలని రాస్తున్నారు. మరి మోడీపై ఏదో రాశారని కేసులు పెట్టే మన సైబర్‌ నిఘా వర్గాలు ఇలాటివి ఎందుకు పట్టించుకోవో అర్థం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *