వర్గీకరణంపై టిడిపిలో రణశంఖాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులరాజకీయాలు వద్దని హితబోధలు చేస్తుంటే ఆయన పార్టీ ముఖ్యులే బేఖాతరుగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఎదురుదెబ్బలు కాపునాడు కల్లోలం రాజధాని గజిబిజి చాలనట్టు ఇప్పుడు ఆ పార్టీలో ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణపౖౖె వివాదం రాజుకున్నది. మొదటిసారిగా తన హయాంలో వర్గీకరణ చేసిన చంద్రబాబు తర్వాత ఆమోదం పొందలేకపోయారు. ఇప్పటికీ కేంద్రం దాన్ని పక్కనపెడుతున్నది. దాంతో వివిధ సందర్భాలలో వర్గీకరణ సమస్య చర్చనీయంగానే ముందుకు వస్తూన్నది. తాజాగా మాదిగదండోరా నాయకుడు మందకృష్ణ దీనిపై అల్టిమేటం జారీ చేసి కొత్త వివాదానికి తెరతీశారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పందన వచ్చేలోగానే వ్యవసాయమంత్రి పత్తిపాటి పుల్లారావు మందకృష్ణపై విమర్శలు గుప్పించారు. ఆ అవకాశమే లేదని తోసిపారేశారు. పుల్లారావు వ్యాఖ్యలపై కృష్ణమాదిగ స్పందించడానికి ముందే సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు వాటిని కొట్టిపారేశారు.తమ ప్రభుత్వం వర్గీకరణకు కట్టుబడి వుందని ఆ విషయాలు మాట్లాడేందుకు తామంతా వున్నామని చెప్పారు.ఆ మధ్య టిడిపిలో చేరిన మాజీ కాంగ్రెస్ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మరింత తీవ్ర స్తాయిలో పత్తిపాటి పుల్లారావు పై విరుచుకుపడ్డారు. మీశాఖలో అనేక సమస్యలు వుంటే మా సంగతి మీకెందుకని ఆక్షేపించారు. రావెల, పీతల సుజాత వంటివారు మాట్లాడతారని వ్యాఖ్యానించారు.
ఇంతలో గృహనిర్మాణ కార్పొరేషన్ అద్యక్షుడు దళిత నేత వర్ల రామయ్య డొక్కా వరప్రసాద్‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన మీకు ఇంకా తెలుగుదేశం పద్ధతులు అలవడలేదని ఎద్దేవా చేశారు. వర్గీకరణ సమస్య తమ అధినేత చూసుకుంటాడని మందకృష్ణ సలహాలు అవసరం లేదని విమర్శించారు. మరో వైపున మందకృష్ణ 48 గంటల్లోగా వర్గీకరణపై వైఖరి చెప్పకపోతే తమ వాళ్లతో కలసి కార్యాచరణ ప్రకటిస్తానని ‘అల్టిమేటం’ జారీచేశారు.ఈ విషయంలో ఆయనకు ప్రధాన ప్రత్యర్థి ఎస్‌సి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు ఎదురుదాడి చేయడమే తరువాయి. ఏమైనా కాపుల రిజర్వేషన్ సమస్యతో మొదలుపెట్టి కులాల వారీ సమస్యలు వరుసగా పెరిగే సంకేతాలు స్పష్టం
.

