సంచలనాలూ, సంక్షోభాలూ!
సంచలనాలూ, సంక్షోభాలూ!
టిఆర్‌ఎస్ క్రియాశీల కార్యకర్త బొంతు రామ్మోహన్ మేయర్‌గా ఎన్నికవడంతో హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరోవైపు సాక్షాత్తూ శాసనసభా పక్ష నాయకుడితో సహా అధికార పార్టీలోకి పయనం కట్టడం తెలుగుదేశం పార్టీకి రెండో పెద్ద విద్యుద్ఘాతమైంది. వైఎస్సార్‌సీపీ ఎంఎల్‌ఎలకు ద్వారాలు తెరవాలని తెలుగుదేశం నిర్ణయించుకోవడంతో సహౌదర వ్యూహాలు మనోహరంగా ఆవిష్క్రతమైనాయి. దానికి ముందు కాపునాడు కల్లోలం. ఇలా ఈ పక్షంలో తెలుగు రాష్ట్రాలు అనుదిన సంచలనాలకు నిలయాలైనాయి.
ఎన్నికలలో సైదరాబాదు అని గమనంలో రాశాను గాని ఓటర్లు ‘సౌ’దరాబాదుగా టిఆర్‌ఎస్‌ను వందవరకూ తీసుకెళ్లారు. వరంగల్ ఉప ఎన్నికలో దాదాపు అయిదు లక్షల మెజార్టితో టిఆర్‌ఎస్ ప్రత్యర్థి పార్టీల విశ్వాసాన్ని దెబ్బతీయగలిగింది. జిహెచ్‌ఎంసితో రెండవ పెద్ద అడుగు. ఈ మార్పు హైదరాబాదీలు ఆందోళనతోనో అభద్రతలోనే ఇచ్చిన తీర్పు కాదు. ప్రభుత్వం గొప్పగా ఏదో చేసేసిందనీ కాదు. ఒక రాజకీయ పరిణామ క్రమంలో వచ్చిన ఫలితమే ఇది. ఎన్నికల లెక్కల్లో చూస్తే ఢిల్లీలో కేజ్రీవాల్, త్రిపురలో సిపిఎం సాధించిన విజయాలతో పోల్చదగింది. గతంలో 14 శాసనసభ స్థానాలు పొందిన టిడిపి బిజెపి కూటమి 1,4 డివిజన్లకు పరిమితం కావడం, అప్పుడు ఆ పార్టీకి వచ్చిన 22 శాతం ఓట్లు ఇప్పుడు ఈ కూటమికి రావడం ఒక తలకిందులు పరిణామం.గతంలోనూ ప్రభుత్వాలకు అనుకూలంగా ఫలితాలు వున్నాయనే మాట నిజం కాదు. తెలుగుదేశం మేయర్ గెలిచినా మెజార్టి తెచ్చుకోలేదు. కాంగ్రెస్ హయాంలో టిడిపిదిి ప్రథమ స్థానమైంది.ఇప్పుడు టిఆర్‌ఎస్ అప్రతిహత విజయం దాని రాజకీయాధికారానికి సంపూర్ణత కల్పిస్తుంది.
ఈ ఎన్నికల్లో సీమాంధ్రుల పేరిట లేనిపోని సందేహాలు పెంచే ఎత్తుగడ పనిచేయదని నేను చెబితే కొందరికి రుచించలేదు. విభజన తర్వాత ప్రశాంతంగా బతుకుతూ స్నేహపూర్వకంగా మెలగాలన్న భావనే రెండు చోట్ల వుంది. ఎక్కడైనా ముఖ్యంగా ఉద్యోగ రంగంలో సమస్యలున్నా ఉద్రేకాలు కోెరుకోవడం లేదు. కెసిఆర్ కూడా మొదట్లో ‘ఉద్యమకస’ిని కాపాడే ప్రయత్నం చేసినా పంథా మార్చుకోకతప్పలేదు. కెటిఆర్ ఈ క్రమాన్ని పరాకాష్టకు తీసుకెళ్లారు. టిడిపి లోకేశ్‌ను లోకలేశ్‌గా ముందుంచి ప్రయత్నించినా ఫలితం రాలేదు. కేసు పోయినా లా తెలిసిందన్నట్టు ఆయన ‘తమ్ముడి’ పాత్ర ఆమోదం పొందిందని మాత్రం ఒప్పుకోవాలి. .బిజెపిపై పెరుగుతున్న వైముఖ్యం కూడా ప్రభావం చూపింది. అయినా ఈ కూటమికి పాతిక శాతం వరకూ ఓటింగు వుంది.కాంగ్రెస్‌ను గురించి కొత్తగా చెప్పవలసింది లేదు గాని మజ్లిస్ కోటలో ప్రజాస్వామ్య ప్రక్రియ పెంపుదలకు టిఆర్‌ఎస్ సాహసిస్తుందా? సందేహమే.
ఈ విజయం తర్వాత టిఆర్‌ఎస్ (తనలాగే?) తిరుగులేని రాజకీయ శక్తి అయిపోయిందని కెటిఆర్ వ్యాఖ్య. ఆకాశవాక్కులు, అతిశయ వాగ్దానాల కన్నా తక్షణ సమస్యల పరిష్కారం కీలకం. వీధికుక్కల బెడద దాటి విశ్వనగర స్థాయికి చేర్చాలంటే పెద్దపనే .డబుల్ బెడ్‌రూం ట్రిబుల్ ప్రచారం నిజం కావడం కష్టం గనక నిరుత్సాహం కూడా ఇంతే త్వరితంగా వచ్చేస్తుుంది. డ్రైనేజీ,ట్రాఫిక్,రోడ్లు,మురికివాడల వంటి సమస్యలు అసంఖ్యాకంగా వున్నాయి. .కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే మేయర్ వస్తాడు ఇక్కడ ఒక భావి ముఖ్యమంత్రి వచ్చారు అని నేను చాలాసార్లు వ్యాఖ్యానించాను. ఛానళ్లు ఎన్నికల విజయాన్ని ‘నాన్నకు ప్రేమతో…’ అంటూ ప్రసారం చేశాయి. నిజానికి కటిఆర్‌కు ఈ బాధ్యత అప్పగించడమే పుత్రుడికి ప్రేమతో ఇచ్చిన కానుక. తండ్రి వచనాల్లో ఏదైనా సందేహాలుంటే తనయ కవిత అన్నయ్య సాక్షిగా పూర్తి చేశారు. తర్వాత సర్దుకుని హరీష్ రావు బుల్లెట్ అనీ, గ్లేడియేటర్ అనీ ఎంత పొగిడినా వెళ్లాల్సిన సంకేతాలు వెళ్లిపోయాయి..దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలలోనూ వున్న సంప్రదాయమే అయినా కెసిఆర్ హడావుడి పడి అవతలివారి స్థానాన్ని ఇబ్బందిలో పెట్టవలసిన అగత్యం లేదు. లోగడ జమ్మూ కాశ్మీర్‌లో ఫరూక్ జిఎంషాలు, ఎపిలో బాలకృష్ణ చంద్రబాబు నాయుడు దగ్గుబాటి లక్ష్మీపార్వతులు, తమిళనాడులో స్టాలిన్ అళగిరి సోదరులు, మహారాష్ట్రలో ఉభయ ఠాకరేలు, బీహార్‌లో లాలూ బావమరిది వంటివారితో వచ్చిన సమస్యలు రాకుండా ఆయన ముందే రంగం సిద్ధం చేశారనుకోవాలి. పార్టీలోనూ పాలనలోనూ కెటిఆర్ ఎంత విజ్ఞతతో నిగ్రహంతో వ్యవహరిస్తారనేదే ఇప్పుడు ప్రశ్న. హైటెక్ బాబును మరపించే పర్యటనలు ప్రచారాల బదులు ప్రజాబాహుళ్య సమస్యలపై ఆయన కేంద్రీకరిస్తే మంచిది.హైదరాబాదు లౌకిక ప్రజాస్వామిక వారసత్వాన్ని ప్రశాంతతను కాపాడుకోవడం అన్నిటికన్నా ముఖ్యం.
ఫలితాలతోనే కుదేలైన తెలుగుదేశం ఎర్రబెల్లి త్రయం ఫిరాయంపుతో కకావికలైందంటే కేవలం స్వయంకృతమే. ఉద్యమ కాలంలోనూ తర్వాత కూడా ఆ పార్టీకి విధాన స్పష్టత లేదు. ప్రజల పరిశీలనాశక్తిని తక్కువగానూ తమ శక్తిని అతిగానూ అంచనా వేసుకుని – యుక్తులతో ఆగక కుయుక్తులకు దిగి- ఓటుకు నోటుతో అభాసుపాలైనారు. ఆ కేసు తేలకుండానే రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా పదవి కట్టబెట్టి- ముఖ్యమంత్రి అభ్యర్తిగా ప్రకటించిన కృష్ణయ్యను పక్కనపెట్టి ఇష్టానుసారం వ్యవహరించారు. కేసు తర్వాత అధినేత స్నేహ వాక్కులు రేవంతుల దూషణోక్తుల ద్వంద్వ క్రీడతో విశ్వసనీయత పోగొట్టుకున్నారు. గ్రేటర్ విజయం తర్వాత కూడా సామూహిక ఫిరాయింపుల జాడ్యం వీడని టిఆర్‌ఎస్‌ది ఎంత తప్పో నిలకడైన విధానం లేని తెలుగుదేశంది కూడా అంతే తప్పు అని చెప్పాలి. పైగా ఈ తప్పిదాలవల్ల తెలంగాణల్లో సముతుల్యత దెబ్బతిని ఏకపక్ష ధోరణులు పెరగడానికి వారూ కారకులైనారు. రాష్ట్రంలో వారికి యంత్రాంగం హంగులు ఎన్నివున్నా ప్రస్తుతానికి ప్రధాన పాత్ర కోల్పోయినట్టే. వైసీపీ వారిని మేము చేర్చుకుంటే ఒప్పు టిఆర్‌ఎస్ మా వారిని చేర్చుకుంటే తప్పు అనే టిడిపి విమర్శలో నైతిక బలం నాస్తి.
ఇక ఎపికి వస్తే కాపులకు నిధులు, కమిషన్, రిజర్వేషన్ వాగ్డానాలపై ఆలస్యం చేసి ఆందోళన రూపం తీసుకోవడానికి ప్రభుత్వమే కారణమైంది. ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపి ముందే నివారించకుండా కత్తిగట్టినట్టు వ్యవహరించినా లక్షల మంది రాకుండా ఆపలేకపోయింది. రైలు పోలీసు స్టేషన్ దహనం వంటివి వూహించలేదంటున్నా వున్న నిఘా వర్గాల సమాచారం మేరకైనా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎదురుదాడి కాల్‌మనీ పట్టిసీమ రాయలసీమల వరకూ వెళ్లి వెనక్కు వచ్చింది.ఇదంతా వైసీపీ వల్లనే జరుగుతున్నట్టు తనే ప్రచారం చేసి పెట్టింది. కాని ఈ ఘటనలతో సహా ఇంతవరకూ ఏ విధ్వంసం పైనా నిర్దిష్ట నివేదికలు వెల్లడించింది లేదు. నిజానిజాలు తెలిస్తే కారకులెవరైనా ప్రజలుసహించరు.కాని ప్రభుత్వమే దాగుడు మూతలు ఆడటమెందుకో అర్థం కాదు.
ముద్రగడ దీక్ష విరమించిన తర్వాత ఎస్‌సిలుగా ఎవరూ పుట్టాలనుకోరు అంటూ చంద్రబాబు నాయుడు మరో పొరబాటు చేశారు. నిఖిలలోకమెట్లు నిర్ణయించిన తరుగులేదు విశ్వనరుడ నేను అన్న జాషవా పద్యం చదివితే ఇలాటి మాటలు మాట్లాడరు. పోనీ తర్వాతనైనా సూటిగా సవరించుకున్నారా అంటే పేదలుగా పుట్టాలనుకోరు అనే అర్థంచెప్పి మరో పొరబాటు చేశారు.గౌతమ బుద్ధుడి గాంధీల నుంచి పుచ్చలపల్లి సుందరయ్య వరకూ వున్నవి వదిలేసి ప్రజల్లోకి వచ్చిన ఉదంతాలు గాక సంపదల సృష్టినే ఘనతగా చూసే దృష్టిదోషమిది. కులాల రాజకీయం వద్దనేవారు ఆచితూచి మాట్లాడాలి గాని నోరు జారకూడదు. అవన్నీఎలా వున్నా విభజిత రాష్ట్రంలో మరోసారి కుల రాజకీయాల కుంపట్లు రాజుకోకుండా ప్రశాంతతను కాపాడుకోవడం ఇప్పుడు ముఖ్యం. ఇన్నిటి తర్వాత ఢిల్లీయాత్రలో హడావుడి తప్ప హామీలు లేవు గనక అందరినీ కలుపుకోవడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవడం ముఖ్యం ేగాని ప్రతిపక్షాలపై ఒత్తిడ ప్రజా ఉద్యమాలపౖిె దాడి వల్ల ఒరిగేది వుండదు.
ఆంధ్రజ్యోతి,గమనం,12,2,16