మోడీ భార్యకు గౌరవం వద్దా?

Jashodaben_2734693_2734693f

ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి యశోదాబెన్‌ పట్ల ప్రభుత్వం గాని మీడియా గాని వ్యవహరిస్తున్న తీరు అనుచితంగా వుంది. ఆమెకు వ్యక్తిత్వం అస్తిత్వం లేనట్టుగా తీసిపారేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ముంబాయిలో గుడిసెల తొలగింపుకు వ్యతిరేకంగా పేదలు చేస్తున్న ఆందోళనలో పాల్గొన్నారు. గుడ్‌సమరిటన్‌ మిషన్‌(జిఎస్‌హెచ్‌) అనే క్రైస్తవ సేవాసంస్థ ఎస్‌.పిటర్‌ రాజ్‌పాల్‌ నాయకత్వంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు.మహిళల క్రియాశీలత కోరేవారెవరైనా బలపర్చాలి.కాని మీడియా మాత్రం ఆమె స్పష్టత లేకుండా మాట్లాడారని వంకలు పెడుతున్నది. పేదలకు మేలు జరుగుతుందని తాను వచ్చానని ఆమె చెప్పారు. తాను 2014లో 2015లో ముంబాయి వచ్చినప్పుడు ఈ సేవాసంస్థను సందర్శించి వారి కార్యక్రమాలు మంచివని తెలుసుకున్నానన్నారు. రేపో మాపో తాము తమ వూరు మేషనీ వెళ్లిపోతామని ఆమె ఆమె సోదరుడు కూడా చెబుతున్నారు. ఇంతకంటే స్పష్టత ఏం కావాలి? పార్లమెంటు సభ్యులు అమాత్య వర్యులు అనేక సార్లు తెల్లమొహం పెడుతుంటారు గాని ఈ వృద్ధ మహిళ వారి ప్రశ్నలకు ఠంచనుగా సమాధానం చెప్పకపోవడం దోషమైంది!
కారణం ఏదైనా ప్రధాని మోడీ ఆమెను దూరం పెట్టినంత మాత్రాన తన ఇష్ట ప్రకారం జీవించే హక్కు సమాచారం తెలుసుకునే హక్కు ఆమెకు వుండవా అనేది ప్రశ్న. ఈ విషయాలు అడిగితే వ్యక్తిగతం అంటారు. కాని స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అంటూనే కుటుంబంలోనూ సమాజంలోనూ వారిని చిన్నచూపు చేసే దేశం మనది. అందుకు గృహహింస చట్టంతో సహా చాలా వచ్చాయి. మోడీ తన భార్య వద్దనుకుంటే విడాకులు ఇచ్చి వుండాలి. ఆమె వున్నట్టు కూడా చాలా సంవత్సరాలు చెప్పకుండా అత్యున్నత పదవికి వచ్చాకనే అంగీకరించారు. కాని ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు. దీంతో అక్కడెక్కడో పల్లెటూళ్లో అన్నయ్య అశోక్‌ అండతో బతుకుతున్న ఆమె జీవితం మారిపోయింది. తనను అనుక్షణం పోలీసులు నిఘాలో వుంచుతున్నారని ఆమె వాపోయింది.తను సిటీ బస్సులో వెళ్తుంటే వారు కార్లు వేసుకుని వెంటరావడమేమిటని ప్రశ్నించారు. భర్తకు సంబంధించిన వివరాల కోసం అనేకసార్లు అధికారులను ఆశ్రయించారు. ఈ మధ్యన కూడా మోడీ పాస్‌పోర్టులో ఏం వివరాలిచ్చారో చెప్పాలని కోరారామె. ఇవన్నీ వింటుంటే ఒక వ్యక్తిగా తనను ఎంత వేదనకు గురవుతున్నదీ తెలుస్తుంది.ఈయన సర్వశక్తివంతుడైన దేశ ప్రధాని. ఆమె నిస్సహాయురాలైన అమాయక పరిత్యక్త గృహిణి.
మోడీ ఏం చేస్తారనేది ఆయన ఇష్టమైనా దేశ ప్రధానిగా భార్య పట్ల ఎలా ప్రవర్తిస్తారనేది తప్పక పట్టించుకోవలసిన విషయమే. పరమ శివుడు అర్థభాగం ఇచ్చాడనీ, విష్ణుమూర్తి వక్షస్థలంలో పెట్టుకున్నాడని కథలు చెప్పే ఈ దేశంలో ఈయశోదకు మరింత గౌరవం కల్పించాల్సిన అగత్యం లేదా? ఆమెలో కాస్త చైతన్యం వస్తే ప్రోత్సహించాల్సిన పనిలేదా? మీడియా కూడా ఆలోచించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *