వాస్తవికదృష్టితోనే దీక్ష విరమణ

deexa1111

ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్ష విరమణలో ఉభయ పక్షాలూ వాస్తవికత ప్రదర్శించినట్టు చెప్పాలి. నివేదిక సమర్పణ గడువును తగ్గించడం, కాపు కార్పొరేషన్‌కు నిధుల కేటాయింపు పెంచడం ప్రభుత్వం వైపు నుంచి అంగీకరించిన అంశాలు. కమీషన్‌లో కాపునాడు ప్రతినిధులకు చోటు కల్పించడం పరిశీలిస్తామని మాత్రమే చెప్పారు. అయితే అరెస్టు చేయడం వంటి ఆలోచనలకు పోకుండా నచ్చజెప్పి ఒప్పించడం మంచి విషయం. అంతేగాక చంద్రబాబును’అనరాని మాటలు అన్నందుకు’ ముద్రగడ క్షమాపణలు చెప్పడం ఆసాధారణ పరిణామం. ఎందుకంటే ఇలాటి సందర్భాల్లో భేషరతుగా ముగించడం తప్ప క్షమాపణలు వుండవు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వంతో ఆయనకు అవగాహన కుదిరిందనే భావించాల్సి వుంటుంది. ఉద్రేకంతో పాటు వ్యూహాత్మక రాజకీయాలకు కూడా ఆయన పెట్టింది పేరు గనకే ఇంతకాలం ఉనికి కాపాడుకోగలుగుతున్నారు. దీక్ష విరమణ వైసీపీకి ఆశలు భగం చేసినట్టు భావించేవారున్నారు గాని బహుశా కొనసాగినా వారు కూడా ఉపయోగించుకోగల స్థితి వుండదు. ఎందుకంటే ముద్రగడ స్వభావ రీత్యా పరిస్థితి వారి చేతుల్లోనూ వుండదు. పైగా మొదటి రోజు ఘటనతో ఉద్యమ కారులు కూడా ఇబ్బందిలో పడిపోయారు. అయినా కేసుల పేరుతో అనవసరంగా వేధించడం వుండదని కూడా మంత్రి అచ్చెం నాయుడు హామీనివ్వడం కాపులలో సదభిప్రాయం కాపాడుకోవడానికి అక్కరకు రావచ్చు.
పెద్దతలకాయల దెబ్బ..
ముద్రగడను పరామర్శించేందుకు చిరంజీవి దాసరి వంటి సినీ ప్రముఖులు రఘువీరా తదితర రాజకీయ వేత్తలు రావడం కూడా ఆయన నిర్ణయానికి కారణమై వుంటుంది.’ నేను చిన్న మనిషిని’ అని మొదలుపెట్టారు. తన కన్నా పెద్ద తలకాయలు వచ్చేస్తే అసలు సమస్య వెనక్కు పోతుందని పరిస్థితి తన చేయి దాటిపోతుందనిగ్రహించారు గనకే ఆయన ప్రభుత్వ హామీలకు సమ్మతించారు. దీంతో పాక్షిక ఫలితాలు సాధించినట్టవుతుంది. మరింత వ్యవధి కూడా దొరుకుతుంది. తర్వాత జరక్కపోతే ప్రభుత్వానిదే బాధ్యత అవుతుంది.
రాజకీయ కుదుపు..
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎదుర్కొన్న మొదటి రాజకీయ కుదుపుగా దీన్ని చెప్పుకోవచ్చు. మిగిలిన హామీల విషయంలో ఇలాగే ఆందోళనలు రావడానికి ఆరంభం కావచ్చు. ఏమైనా కుల రాజకీయాలు విషమించకముందే దీక్ష విరమణ అందరికీ ఉపశమనం కలిగించాలి. విరమణ జరుగుతుందని ఉదయమే ప్రభుత్వానికి అవగాహన వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *