తుని మంటలతో మలుపులు

tuni111

తునిలో కాపునాడు సందర్భంగా రగులొక్కన్న చిచ్చు ఎపి రాజకీయాలను బాగా వేడెక్కించింది. ఈ ఘర్షణ ఇంకా పెరుగుతుందే గాని తగ్గుతుందని భావించడం కష్టం. నిర్వాహకులు, ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం ఎవరూ సర్దుబాటు ధోరణి ప్రదర్శించడం లేదు. కాపునాడుకు తమ వారిని వెళ్లకుండా చేయడం, ఆటంకాలు కల్పించినట్టు ఆరోపణల కారణంగా తెలుగుదేశం ముందే వ్యతిరేకంగా వున్నట్టు వెల్లడించుకుంది. అయినా అది భారీగానే జరగడం ప్రభుత్వానికి వ్యతిరేక సంకేతమే. ఆ తర్వాత జరిగిన విధ్వంసకకాండ కొన్ని అరాచక శక్తులు వైసీపీ వారే చేశారని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. అంటే అంతా వారి అధీనంలోనే వుందని ఒప్పుకుంటున్నట్టు అవుతుంది. ఇంత ప్రచారంతో భారీగా సభ జరుగుతున్న చోట అప్రమత్తంగా వుండి పరిస్థితి అదుపు తప్పకుండా చూడవలసిన బాధ్యతలో ప్రభుత్వం విఫలమైందని పవన్‌ కళ్యాణ్‌ కూడా విమర్శ చేస్తున్నారు. ఈ సభను సమీకరణను వ్యతిరేకించడంలో చంద్రబాబు నాయుడు చొరవ చూపించినంతగా ఆయన సహచరులు, ముఖ్యంగా ఆ వర్గీయులు ముందుకు రాలేదు. సభకు ఆహార వాహనాలు సమకూర్చిన వారిలో కొందరు తెలుగుదేశం శాసనసభ్యుల పేర్లు కూడా వినిపించాయి. దీనంతటినీ నడిపిస్తున్న ముద్రగడ పద్మనాభంను వదలిపెట్టి ప్రతిపక్ష నేత జగన్‌పై ధ్వజమెత్తడం ద్వారా ముఖ్యమంత్రి ఆయనకు విస్త్రత ప్రచారం కల్పిస్తున్నారు. వైసీపీకి కావలసింది అదే! ఈ కమీషన్‌ పూర్తి నియామకం, దాని సిఫార్సులు రావడం వంటివి చాలా సమయం తీసుకోవడం అనివార్యం గనక ఈ రాజకీయ చిచ్చు రగులుకుంటూనే వుంటుంది. దాని ప్రభావం ప్రభుత్వంపైనా పడుతుంది. పైగా సామాజికాంశాన్ని రాజకీయ ప్రత్యర్థిపై దాడికే ఉపయోగించారన్న నింద మోయవలసి వస్తుంది.
చంద్రబాబు నాయుడు పట్టిసీమ, రాయలసీమ, అమరావతి, కాల్‌మనీ కేసులను ఈ సందర్భంలో ప్రస్తావించడం సమర్థనీయం కాదు .అధికారులకు సంయమనం పాటించమని చెప్పి మంచి పనిచేసిన చంద్రబాబు తానే ఎందుకు దాన్ని పాటించలేకపోయారు. బీసీల నుంచి అభ్యంతరాలు వస్తాయని తనే చెప్పడం కూడా ఉద్దేశపూర్వకంగా ఎగదోస్తున్నారనే ఆరోపణకు దారి తీస్తుంది. బీసీలకు ఇబ్బంది లేకుండా చేస్తామంటూనే వారి నుంచి వ్యతిరేకత వస్తుందనే జోస్యాలు ఎందుకు వదులుతున్నారు? బిసి కాపు వేదికలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు?

వైసీపీకి కూడా ఇరకాటమే

అయితే , వైసీపీ ఈ సభ నుంచి ఆశించిన ప్రయోజనం కూడా నెరవేరలేదు. అంటే దహన కాండతో పరిస్థితి మారిపోయింది.దీనికి ప్రభుత్వానిదే బాధ్యత అనవచ్చు గాని తమ పార్టీ ముఖ్య నేతలను పంపించిన జగన్‌కూడా సమాధానం చెప్పకతప్పదు. మాకు తెలియదు అనేట్టయితే అంతగా మీకు పట్టులేని చోటకు ఎందుకు వెళ్లారనేది చెప్పాల్సి వుంటుంది. రిజర్వేషన్ల కల్పన సాధ్యం కాదంటే మీ తండ్రి హయాంలో ఎందుకు చేయలేదనే ప్రశ్న వైసీపీని వెంటాడుతుంటుంది. రాజకీయాంశాలకు జగన్‌ గట్టిగానే జవాబు చెప్పొచ్చు గాని ఈ దాడులకు ఎత్తుగడలకు సంబంధించి ఆయన దగ్గర పెద్ద సమాధానాలు దొరకవు. రేపు జరిగేవి కూడా వారి చేతుల్లో లేనప్పుడు ముఖ్య పాత్రధారులుగా ముద్ర వేయించుకోవడం తప్పవుతుంది.గతంలో కోస్తా ప్రాంతంలో జరిగిన కుల ఘర్షణలను గుర్తు చేయడం వల్ల పెరిగే అభద్రతా భావం చంద్రబాబుకే ఉపయోగపడుతుంది. ఈ పాతికేళ్ల కాలంలో పరిస్థితులు చాలా మారాయనే వాస్తవం వైసీపీ గుర్తించవలసి వుంటుంది.

కాపునాడు విషయంలో కులాలు రాజకీయాలు పెనవేసుకుపోయాయి. ఇందులో రెండు ప్రధాన పార్టీల పాత్ర వుంది. మొదటి కాపునాడు జరిగినప్పుడు గాని వంగవీటి రంగా హత్య, ఆ తర్వాతి పరిణామాలు గాని ప్రత్యక్షంగా చూశాను. దీనంతటి నుంచి వారు చాలా నేర్చుకుని వున్నారు. కాంగ్రెస్‌తో చాలా కాలం వుండి ఆ తర్వాత చిరంజీవిని వెనక నడిచి నష్టపోయామని భావిస్తున్న కాపులు విభజన తర్వాత ్ల మొదటిసారిగా తెలుగుదేశంను బలపర్చారు. వైసీపీకి అండగా వుంటాయనుకున్న గోదావరి జిల్లాలు తెలుగుదేశంను గద్దెక్కించడంలో కీలక పాత్ర వహించాయి. అయితే కాపుల మద్దతు రిజర్వేషన్లు, నిధులు, రాజకీయ ప్రాధాన్యత వంటి హామీలను బట్టి ఇచ్చిందే. వాటిని అమలు చేయడంలో గాని విస్త్రతంగా చర్చకు పెట్టడంలో గాని ప్రభుత్వం జాగు చేసిన మాట నిజం.. ఎన్నికల అనంతర రాజకీయ పునస్సమీకరణలో( అంటే ఇంగ్లీషులో చెప్పుకునే రీ అలైన్‌మెంట్‌- రాజకీయ సామాజిక శక్తులు అటూ ఇటూ మారడం) ఇది ప్రధానమైన మలుపుగా అందరూ భావించారు. అయితే తుని విధ్వంసకాండ ఈ పరిణామాన్ని మరింత సంక్లిష్లం చేసింది. కాపునాడు నాయకులను పిలిచి చర్చలు జరిపి సహేతుక పరిష్కారం సాధించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. తమ నిరసనలో ఉద్రిక్తతలు చేయిదాటకుండా చూసుకోవలసిన బాధ్యత కాపునాడు నాయకత్వానిది. ఈ ఇద్దరి మధ్యలో వైసీపీ ఏ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించగలుగుతుందనేది రాజకీయ ప్రశ్న.

జాగ్రత్త పాటించని జగన్‌

చంద్రబాబు అడుగుజాడల్లోనే సోమవారం ఉదయం నుంచి తెలుగుదేశం మంత్రులూ ఎంఎల్‌ఎలు ఎంపిలు వరుసగా మాట్లాడారు. అంతా అయ్యాక ప్రతిపక్ష నాయకుడు జగన్‌ సుదీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలను తిప్పికొట్టడం వరకూ ఒకె. కాని ఆ వూపులో కనీస జాగ్రత్త పాటించకుండా దాడి చేశారు. వంగవీటి మోహన రంగా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, నిందితులు అనేబదులు చంపిన వారు, ముద్దాయిలు అని ఒకటికి రెండు సార్లు మాట్లాడారు. ఈ ఆరోపణలను స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రి ఉమా మహేశ్వరరావు వెంటనే ఖండించారు. అసలు జగన్‌ దేవినేని సోదరుల పేర్ల విషయంలో గందరగోళానికి గురైనట్టు కూడా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ ఘటనతో సంబంధం లేని విషయాలను ప్రస్తావించడం ఒకటైతే జగన్‌ మరింత ముందుకు పోయి ఆర్థికాభివృద్ది లెక్కలు వగైరా వల్లించారు.
మరో వైపు చంద్రబాబు నాయుడు రెండవ రోజు కూడా సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. అంతసేపు అదే అంశం సాగదీసి చెప్పడం వల్ల కొంత ఆత్మరక్షణలో వున్నారనే భావం కలిగించారు. కాపులను కులంగా ప్రస్తావించి వారిపట్ల గౌరవం అంటూనే దాన్ని వివరించడంలో తడబాటుకు గురైనారు. ఇదంతా కూడా పెద్ద విషయం లేకుండా సాగదీసినందువల్ల జరిగిందే. పట్టిసీమ నుంచి కాల్‌మనీ వరకూ కలగాపులగం చేయడం సరికాదన్న విమర్శల నేపథ్యంలో చంద్రబాబు వాటిని ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఆందోళన కారులను పిలిచి చర్చలు జరిపి పరిష్కారానికి కృషి చేస్తామన్న మాట కూడా ముఖ్యమంత్రి నుంచి వచ్చివుంటే బావుండేది.రిజర్వేషన్ల కల్పన సులభంగా జరిగిపోయేది కాదనే సంకేతం మాత్రం చంద్రబాబు మాటల్లో వుంది.
పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడిన దానిలో ప్రభుత్వ వైఫల్యం, నిర్వాహకుల అజాగ్త్రత్త గురించి ఎత్తిచూపడం బాగానే వుంది. తాను ఏ ఒక్క వర్గానికో నాయకుడిగా గాక అందరి తరపున పెద్ద మనిషిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే తన పునాదిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడ్డం కూడా అర్థమవుతూనే వుంది. లేకపోతే ఆఘమేఘాల మీద షూటింగు మానుకుని రావలసిన అవసరం లేదు. రిజర్వేషన్ల కల్పనపై ఆ శలు కల్పించడం వల్లనే వారు అంతమంది వచ్చారని ఆయన స్పష్టంగానే చెప్పారు. అయితే కమిషన్‌ ఏర్పాటు దాని సిపార్సుల వంటి విషయాల్లో మాత్రం స్పష్టత లేదనిపించారు. గతంలో నేను వ్యాఖ్యానించినట్టు కథానాయకుడు అతిధి నటుడిలా ప్రభుత్వం ఇరకాటంలో పడినప్పుడే వచ్చి మాట్లాడ్డం ప్రజలు మెచ్చరు.

One thought on “తుని మంటలతో మలుపులు

  • February 2, 2016 at 4:10 pm
    Permalink

    కులాల కోసం ఇంత వెంపర్లాట ఎందుకో అర్ధంకాదు …. బీసీ కంటే ఎస్సీ లో రిజర్వేషన్లు బాగుంటాయి .. అందులో ప్రయత్నిస్తే బాగుంటుంది … కాని ఒప్పుకోరు ..ఎందుకంటే కులం ప్రతిష్ట కావాలి , రిజర్వేషన్లు కావాలి ….

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *