మమ్ముల్ను రానివ్వరా? ప్రార్థనాస్థలాలకు మహిళల సవాల్‌

shanishingnapur_live_9 Haji-Ali-Dargah

మత విశ్వాసాలు మనోభావాల పేరుతో చాలా అన్యాయాలు అసమానతలు సాగిపోతూనే వున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాటి జోలికి పోవు. న్యాయస్థానాల్లో రకరకాల తీర్పులు అభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. దేవాలయాల్లోకి రానివ్వకపోవడం వాటిలో ముఖ్యమైంది. దళితుల ఆలయప్రవేశం కోసం స్వాతంత్ర పోరాట కాలంలోనే సత్యాగ్రహాలు నడిచాయి. అయినా ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ దుర్మార్గమైన ఆంక్షలు కొనసాగుతూనే వున్నాయి. కాగా కులంతో సంబంధం లేకుండా అసలు మహిళలకు ప్రవేశం నిరాకరించడం చాలా మతాల్లో వుంది. మహిళలను మనుషులుగా సమానంగా చూసిన మతాలు దాదాపు లేవు.వారిని పాపానికి మూలాలుగా చిత్రించడమే ఎక్కువ. ఆలయాల్లోకి అనుమతించకపోవడం పెద్ద సమస్య కాదనుకునే అతి కొద్ది మందిని మినహాయిస్తే నూటికి తొంభై శాతం మంది దళితులు మహిళలకు ఇది ఆత్మగౌరవ సమస్యగానే వుంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు మహిళలు నిషిద్ద ఆలయాల్లోకి వెళ్లాలనే ధిక్కార నిర్ణయం తీసుకోవడం సంచలనమవుతున్నది.
మహారాష్ట్రలోని శని సింగపూర్‌ ఆలయంలో ఎప్పటినుంచో మహిళలను అనుమతించడం లేదు.ఈ ఆలయం అహ్మద్‌నగర్‌ జిల్లాలో వుంటుంది. భూమాత బ్రిగేడ్‌కు చెందిన తృప్తిదేశారు అనే కార్యకర్త నాయకత్వంలో మహిళలు ఒక హెలికాఫ్టర్‌లో ంచి దిగి ఆ గుడిలోకి వెళ్లాలని కార్యక్రమం పెట్టుకున్నారు.. గత నవంబరులో ఒక మహిళ ఆ ఆలయ వేదికపైకి దూకడం పెద్ద అపరాధమైంది. అందుకు ఏడుగురు ఉద్యోగాలు కోల్పోయారు. ఆలయ ధర్మకర్తలు రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి ఇప్పుడు వాళ్లను దిగనీయకుండా చేసేందుకోసం ఆలయ నిర్వాహకులు ఒక మహిళా దళాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
శబరిమలై ఆలయంలోకి మహిళలను అనుమతించకపోవడంపై ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు వాదనలు వినవలసి వుంది. 2006లో ఈ నిషేదాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వీరు సవాలు చేస్తున్నారు. ఇందుకు గాను అనేక బెదిరింపులను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఈ అసోసియేషన్‌కు ముస్లిం యువతి నాయకత్వం వహిస్తుండడం విశేషం. మహిళలను రానివ్వకపోవడం రాజ్యాంగం చెప్పే సమానతా సూత్రాన్ని ఉల్లంఘించడమేనని వారు వాదిస్తున్నారు.

తమ ప్రవేశం వల్ల పవిత్ర మూర్తి బ్రహ్మచర్యానికి భంగం కలుగుతుందనే వాదనలో అర్థం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఆనాటికి అత్యంత పురోగామి భావాలు ప్రకటించిన బుద్ధుడు కూడా బౌద్ధ సంగాల్లో మహిళల ప్రవేశం వద్దనే మొదట చెప్పాడంటారు. తర్వాత ఆ ఆంక్షలు సడలించాలని నిర్ణయించినప్పుడు బాధపడ్డాడని కూడా చెబుతారు.
ఇక ముంబాయిలోని హాజీ అలీ దర్గా అంతర్భాగంలోని పవిత్రపీఠానికి తమను అనుమతించకపోవడాన్ని భారతీయ ముస్లిం మహిళా ఆందోళన కమిటీ న్యాయస్థానంలో సవాలు చేస్తున్నది.శబరిమలై విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వచ్చేదాకా చూద్దామని న్యాయమూర్తులు వాయిదా వేశారు.
ఇవన్నీ చివరకు ఎలా ముగుస్తాయో గాని మహిళలను తక్కువ స్థాయి మనుషులుగా చూసి అడ్డుకోవడం రాజ్యాంగ సూత్రాలనే గాక మానవీయ విలువలను కూడా అవహేళన చేస్తున్నది. ఒత్తిళ్లు పెరుగుతున్న కారణంగానే శబరిమలై లో మహిళా భక్తులు పెరునాడ్‌ ఆలయంలో పూజలు చేసుకోవచ్చంటూ సంతృప్తిపర్చే ప్రయత్నం చేసింది. శనిసిగ్నాపూర్‌ ఆలయ కమిటీకి మొదటి సారి ఒక మహిళను చైర్మన్‌ను చేశారు. కాని ఇవన్నీ పైపై మెరుగులు తప్ప మౌలిక మార్పులు కాదు గనక మహిళలు సంతృప్తి చెందడం లేదు. పైగా ఇటీవలనే తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి ఒకరు ఆలయాలకు వచ్చేమహిళలు పురుషులు సభ్యతగల దుస్తులు వేసుకోవాలంటూ లుంగీ పంచ అంటూ నిర్దేశించారు. ఇది తమ ఆధిపత్యానికి భంగం అంటూ దేవాలయ కమిటీ సవాలు చేసి స్టే తెచ్చుకుంది.

ఇవి మాత్రమే కాదు- మహిళల శరీరాలపై తరతరాలుగా వివిధ మతాల్లో రకరకాల అవమానాలు అమలవుతున్నాయి. బహిష్టు పేరిట బయిట కూచోబెట్టడం.. జననాంగంలో భాగాలను కత్తిరించడం, కన్యాత్వ పరీక్షలు చేయడం ఇంకా చెప్పరాని అనేక అమానుషాలున్నాయి. దావూదీ బోహ్రా శాఖలో ఖట్నా పేరిట సాగుతున్న అనాచారాన్ని మహిళలు ఇప్పటికే సవాలు చేశారు. మొదటిసారిగా దీనిపై బహిరంగ చర్చ చేపట్టారు.
(లైవ్‌ మింట్‌ పత్రిక సౌజన్యంతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *