నేతాజీ రహస్యపైళ్ల ‘ దస్త్రం పేలని రాజకీయ అస్త్రం

netaji1111

ప్రధాని నరేంద్ర మోడీ విపరీత ప్రచారంతో విడుదల చేసిన తొలివిడత ఫైళ్లు రాజకీయంగా బిజెపికి నిరుత్సాహమే మిగిల్చాయి. అసలు ఈ ఫైళ్లలో కొత్తగా బయిటపడేది శూన్యమని ఇంగ్లీషు మీడియా గానీ, నిపుణులు గానీ ముందే చెప్పేశారు. నా వరకు నేను ఈ విషయమై చాలా సార్లు వ్యాఖ్యానం రాశాను. నేతాజీని గౌరవించినంత మాత్రాన ఆయన గురించిన నిరాధార కథనాలను పట్టుకుని వేళ్లాడవలసిన అవసరం లేదు. అయితే కొన్ని శక్తులు కావాలని కాల్పనిక కథలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నాయి. దాన్ని ఒక విధమైన బ్లాక్‌ మెయిలింగ్‌ సాధనంగా వాడుకున్నాయి. మరణంపై మిస్టరీ వీడలేదంటారు గాని అసలా మిస్టరీ ఏమిటో ఎలా వచ్చిందో స్పష్టంగా చెప్పరు. ప్రమాదానికి ప్రత్యక్ష సాక్షులు వున్నారు గాని బతికి వున్నట్టు చూశామని సాక్ష్యమిచ్చిన వారు లేరు. ఎవరో ఎవరికో ఏదో చెప్పారన్నట్టు మాట్లాడేవారి మాటలతో ఒక మహాపురుషుడి మరణాన్ని వివాదంగా మిగల్చడం ఎంతైనా బాధాకరం.
పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల పూర్వరంగంలో రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విడుదల చేసిన 64 ఫైళ్లలోనూ ఒక్క ముక్క కొత్తది ాలేదు. ఇప్పుడు మోడీ బయిటపెట్టిన వాటిలోనూ గతంలో తెలియని కీలకమైన కొత్తసమాచారం లేదు.
నెహ్రూకు తద్వారా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారానికి ఈ ఫైళ్లు అక్కరకు వస్తాయనుకుంటే నెహ్రూ అవతలివారికే అనుకూలంగా వుండటం ఈ ఫైళ్లలో కనిపిస్తున్నది. నేతాజీ మరణం తర్వాత జర్మనీలోని ఆయన భార్యకు పెన్షన్‌ ఇప్పించేందుకు నెహ్రూ కృషి చేశారని ఒక లేఖ చెబుతున్నది. జపాన్‌లోని ఒక దేవాలయంలో భద్రపరచిన నేతాజీ చితాభస్మాన్ని తెప్పించి నదుల్లో కలపాలనే ప్రతిపాదనను నాటి ప్రభుత్వం నిరాకరించినటు మరో ఫైలు చెబుతున్నది. ఆ చితాభస్మం తెప్పించడమంటే నేతాజీ మరణం నిజమనే అభిప్రాయాన్ని రుద్దినట్టవుతుంది గనక వద్దని భావించారు. దీన్నిబట్టి ఈ విషయంలో కేంద్రం సున్నితంగా వున్నట్టే అనుకోకతప్పదు. .
ఈ ఫైళ్లలో రాజకీయ వివాదానికి దారి తీసే సంతకం లేని లేఖ ఒకటుంది. నేతాజీని యుద్ధ నేరస్తుడుగా ప్రస్తావిస్తూ నెహ్రూ బ్రిటిష్‌ ప్రధాని అట్లీకి రాసినట్టు చెప్పబడుతున్న లేఖ నమ్మదగిందిగా లేదు. బ్రిటిష్‌ వారి దృష్టిలో నేతాజీ యుద్ధ ఖైదీ అనే అర్థంలో నెహ్రూ ప్రస్తావించిన ఆ లేఖపై ఆయన సంతకం కూడా లేదు. పైగా నేతాజీ రష్యాకు వెళ్లాడనిఆ లేఖలో ధృవీకరించి రాయడం నెహ్రూ వంటి అనుభవజ్ఞుడు చేస్తాేడనుకోలేము. ఇంత కీలకమైన క్లిష్టమైన సమస్యలో సంతకం లేని లేఖను నెహ్రూ లాటి నాయకుడికి ి ఆపాదించడం ఎలా కుదురుతుంది?. శ్యాం లాల్‌ జైన్‌ అనే ఒక స్టెనోగ్రాఫర్‌ ఈ లేఖను టైపు చేసినట్టు నేతాజీ బంధువు ప్రదీప్‌ బోస్‌ 1999లో వాజ్‌పేయి ప్రభుత్వానికి లేఖ రాశారు. నిజానికి ఆ స్టెనో గ్రాఫర్‌ రాసింది వేరే లేఖ.
కాంగ్రెస్‌ను చాలా విషయాలకు విమర్శించాల్సిందే కాని నెహ్రూ తన నాయకత్వానికి చిక్కుగా వుంటాడనే భయంతో నేతాజీని రానివ్వలేదని రష్యాలో చంపించేశారనీ ఆరోపించడం వూహకందని కట్టుకథ. ఆనాటికి తిరుగేలేని నేత ఆయన. పైగా అప్పటి సోవియట్‌ నేత స్టాలిన్‌కు నెహ్రూ అంటే అంత గొప్ప అభిప్రాయం వుండేది కాదు. నేతాజీ కుటుంబంపై నిఘా మాత్రం కాంగ్రెస్‌ సమాధానం చెప్పుకోవలసిన వివాదమే. సమాచారం తెలుసుకోవడానికే అలా చేశామని సమాధానం వస్తే దానికీ ఆశ్చర్యపోకూడదు.
ప్రజలకు అనేక సమస్యలు వుండగా వాటిని వదలిపెట్టి ఏడు దశాబ్దాల కిందట మరణించిన నేతాజీ గురించి లేనిపోని కథనాలతో సమయం వృథా చేయడం అర్థం లేని పని. ఇది పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలలో బిజెపికి ఉపయోగపడుతుందన్న ఆశ హాస్యాస్పదం. ఈ ఫైళ్ల విడుదలతో నేతాజీ మరణవివాదం నెమ్మదిగా వెనక్కుపోవచ్చు. కుటుంబ సభ్యులు కూడా అధికారికంగా ఏదో ఒకటి ప్రకటించి దీన్నిముగించాలని కోరుతున్నారు. తమపై నిఘాకు సంబంధించిన నిజానిజాలు కోరుతున్నారు. ఈ రెండు పనులూ చేస్తే నేతాజీకి నివాళులర్పించి ముందుకు పోవచ్చు. కాని బిజెపి ప్రభుత్వం మాత్రం ఈ వివాదం పచ్చిగా వుండాలనే కోరుకుంటుంది. కాంగ్రెస్‌పైనా కమ్యూనిస్టులపైన దాడికి అస్త్రంగా వాడాలనుకుంటుంది. కాని తాజాగా విడుదలైన విషయాలు దాని ఆశలు వమ్ము చేస్తున్నాయి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *