అమరావతి భూసమీకరణం – వాగ్దానరథం రివర్స్‌గేర్
అమరావతిని అపురూప రాజధానిగా నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలపై రోజురోజుకు సందేహాలు ముసురుకొంటున్నాయి. తెలుగుదేశం వారే బుర్ర గోక్కుంటున్నారు, పగలగొట్టుకుంటున్నారు కూడా. ఎందుకంటే రాజధాని నిర్మాణ ప్రణాళికలో అడుగడుగునా అయోమయం తాండవిస్తున్నది. తమకే అవగాహన లేకున్నా రైతులతో ఔననిపించుకోవడానికి వేసే మొక్కుబడి అవగాహనా సదస్సులు రైతుల ఆగ్రహావేశాలతో రణసీమలవుతున్నాయి. ఏదో నమ్మడానికి రైతులు సిద్ధంగా లేరు. ఇలాటి సమస్యలపై గతంలో చాలాసార్లు చెప్పుకున్నా ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రమై పోయింది.
అమరావతి అభివృద్ది ఫలాలు భూములిచ్చిన రైతులకే చెందాలి అన్నది ముఖ్యమంత్రి మాట. కాని ఇప్పుడు మాష్టర్ ప్లాన్ ప్రకారం వారికి కోర్ కాపిటల్‌లో గాని, ప్రైమ్ కమర్షియల్‌లో గాని ప్లాట్లు వచ్చే అవకాశం వుండదు. బహుశా నాసిరకం ప్లేసులే దక్కుతాయి. అది కూడా ఎప్పుడో ఎవరికి ఎక్కడో తెలియదు. తీసుకున్న స్థలాలకు దగ్గరలోనే ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామంటూ 2015 ఏప్రిల్ 17న వెలువడిన జివో 84 హామీ ఇచ్చింది. అయితే లాటరీ ప్రకారం నిర్ణయమంటూ వీలైనంత వరకూ దగ్గరగా ఇస్తామని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైగా ఇదంతా మే నెలకు గాని పూర్తి కాదని చెబుతున్నారు అధికారులు. రాజధాని కట్టినా అక్కడి గ్రామాల నిర్మూలన జరగదనీ, గ్రామ కంఠాలకు కాపాడతామనీ అప్పట్లో చెప్పిన వారు ఎక్కడ రోడ్లు వస్తాయో చూస్తాం అని కొత్తపల్లవి ఎత్తుకున్నారు. ఠంచనుగా పరిహారంఇచ్చేసామన్నవారు వచ్చిన వారికి వచ్చినప్పుడు వచ్చినంత తీసుకోవలసిందేనన్నట్టు ఆచరణలో వ్యవహరిస్తున్నారు. చట్టబద్దమైన ప్రక్రియలు పూర్తికాకపోయినా స్వాధీనం చేసుకునేలా 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేయాలన్నది ఇప్పటి ఆలోచన.
రాజధాని వస్తే ఇటు విజయవాడ నుంచి అటు నరసరావు పేట వరకూ ధరలు అలా పెరిగిపోతాయని వూరించిన వారేకృష్ణా గుంటూరు జిల్లాలలో విస్తార ప్రాంతాలను సేద్య క్షేత్రాలుగానే వుంచాలని హుకుం జారీ చేశారు. ఈ విధంగా ఎలాటి వాణిజ్య, ఇళ్ల స్థలాల వెంచర్లు అనుమతించబోమని ఉత్తర్వులిచ్చాక భూముల రేట్లు పెరగడం ఎలా సంభవమో ఏలిన వారికే తెలియాలి. అసలు మూడు పంటలు పండే పొలాలను జరీ భూములతో సహా నయానోభయానో సమీకరించి మామూలు పొలాలను మాత్రం వ్యవసాయానికే పరిమితం చేసుకోవాలని శాసించడం తర్క విరుద్ధం.
అసలు రాజధాని నిర్మాణంపై సింగపూర్ ప్రభుత్వం గాని దానిి సంబంధించిన అధికార సంస్థలు గాని ఆసక్తి చూపడం లేదు గనక ఏవో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే సూచనలున్నాయి. అప్పుడవి తమ సబ్ కాంట్రాక్టర్లుగా ఇక్కడి వారినే అంటే సర్కారీ సన్నిహితులనే ఎంచుకోవచ్చు. ఇప్పటకే తెలుగుదేశంతో సహా పోలక పార్టీల నేతలు భారీతా భూములు కొని పెట్టుకున్నారు. దానికి తోడు ి ఎలాటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం 99 సంవత్సరాల లీజు క్లాజు చేర్చుతున్నారు. మిగిలిన చోట్ల లావాదేవీలు నిలిపేస్తే అమరావతి పరిసరాలకు బూమ్ రాకతప్పదనే వ్యూహం దీనివెనక వుంది. ఇన్ని మతలబులు వున్నాయి గనకేే రైతులు తిరగబడుతున్నారు. అది ఉద్యమ రూపం తీసుకోకుండా పోలీసులు ఆంక్షలతోి సభలూ ప్రదర్శనలను అడ్డుకుంటున్నారు. ఇది అమరావతి అసలు కథ. అక్కడి వారి వ్యధ. ఇంతవరకూ దేశంలోనూ ప్రపంచంలోనూ ఎక్కడా ఎరుగని వింత సంత గాధ.

