రామ్‌మాధవ్‌ మాటలు… రామమందిరం రాళ్ల బాటలు..

ram madhav1111 swamy1111.

కుక్కతోక వంకరలాగా బిజెపి సంఘ పరివార్‌ నేతలు రీతులు కూడా మారేవి కావనిపిస్తుంది. మతతత్వ రాజకీయాలూ మారవు. ప్రజాగ్రహం వల్లనో లేక పరిస్థితుల ప్రతికూలత వల్లనో కాస్త వెనక్కు తగ్గినట్టు కనిపించినా సహజ స్వభావం వారిని అలా వుండనీయదు. బాలివుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌ పై తాజాగా బిజెపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. దేశంలో అసహనం గురించిన ప్రశ్నపై అమీర్‌ఖాన్‌ స్పందిస్తూ అభద్రత పెరిగిపోతున్నదనీ, తన భార్య కిరణ్‌ రావు దేశం వదలివెళ్లిపోదామని అప్పుడప్పుడూ అంటుంటుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బట్టి అసహన వాతావరణాన్ని చక్కదిద్దాలని గుర్తించేబదులు సంఘ పరివార్‌ అమీర్‌ఖాన్‌పై విరుచుకుపడింది. ఆయన దేశభక్తిని శంకించే వ్యాఖ్యలు చేసింది.మీడియాలోనూ ఒక భాగం అదే పోకడ ప్రదర్శించింది. ఫేస్‌బుక్‌లోనూ నాపై చాలామంది విరుచుకుపడ్డారు. తర్వాత కొంత కాలానికి పార్లమెంటులో ప్రధాని మోడీ కొంత సర్దుబాటు ధోరణిలో మాట్లాడారు. అమీర్‌ఖాన్‌ ట్విట్టర్‌లో వివరణ ఇస్తూ తాను దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నానని తను గాని కిరణ్‌ గాని దేశం వదలివెళ్లాలనుకోవడం లేదని స్పష్టంగా ప్రకటించారు. అదే సమయంలో తమ దేశభక్తికి ఎవరి కితాబూ అవసరం లేదని కూడా చెప్పారు. అమీర్‌ ఖాన్‌ను సినిమా రాజకీయ రంగాలలోనూ ఇతరత్రా కూడా ఎందరో బలపర్చారు. వారిలో ఒకరైన షారుఖ్‌ఖాన్‌ సినిమా దిల్‌వాలే విడుదల సమయంలో శివసేన ఆటంకాలు కల్పించడం వల్ల ఆయన ఒక విచారం వ్యక్తం చేస్తూ తన వ్యాఖ్యలు సరిగ్గా ప్రసారం కాలేదని వివరణ ఇచ్చారు. ఆ చిత్రం కూడా బాగా విజయవంతమైంది.
నిజానికి ఇలాటి తరుణంలో పాత వ్యాఖ్యలపై వివాదం తిరగదోడవలసిన అవసరమే లేదు.కాని ప్రభుత్వ ప్రకటన చిత్రాలనుంచి అమీర్‌ఖాన్‌ తప్పించడం అందుకు కారణమైంది. దాన్నికూడా ఆయన స్వాగతించాడు. ఇలాటి సమయంలో బిజెపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ ముందు మీ భార్యకు దేశభక్తి నేర్పండి అన్న రీతిలో మాట్లాడ్డం అసందర్భమే గాక అనుచితం కూడా. స్త్రీలను కుటుంబ విలువలను గౌరవిస్తామని చెప్పే ఆరెస్సెస్‌ శిబిరం నుంచి వచ్చిన రాం మాధవ్‌ ఒక భర్త తన భార్యకు ఏం నేర్పాలో చెప్పడం సాధారణ సంస్కారానికి అందేది కాదు. అమీర్‌ మొదటి ప్రకటనలోనే తను ఆమెతో ఏకీభవించలేదని చెప్పాడు. కనుక ఇంతకాలం తర్వాత ఈ సమస్యను మళ్లీ పైకి తేవడంలో రాజకీయ దురుద్దేశాలు వున్నాయి. ఈ ఏడాది జరిగే కేరళ పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలలోనూ తర్వాత యుపిలోనూ మరోసారి హిందూత్వ రాజకీయాలను తారస్థాయికి తీసుకెళ్లాలని బిజెపి భావిస్తున్న కారణంగా మరోసారి ఇలాటి నిరర్థక వివాదాలు ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చూస్తాం. మాధవ్‌ మాటలను కేంద్ర మంత్రి షా నవాజ్‌ఖాన్‌ సమర్థించడం అందుకు ఉదాహరణ. రామమందిర నిర్మాణానికి రాళ్లు చేర్చడం సుబ్రహ్మణ్యస్వామి వంటివారు అదేపనిగా ఆ సమస్యను లేవనెత్తడం కూడా అందుకోసమే. గుజరాత్‌తో సహా తము పాలించే చాలా రాష్ట్రాలలో స్థానిక ఎన్నికలలో కూడా దెబ్బతిన్నప్పటికీ బిజెపికి రాజకీయంగా హిందూత్వ వ్యూహాలు తప్ప మరో తరహా రాజకీయాలు ఎలా వస్తాయి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *