మారిన గ్రేటర్‌పై ఆశ, ఆసక్తి లేని చంద్రబాబు

babu nizam
‘అదియును నీ పతి ప్రాణంబు దక్క’ అన్నట్టు హైదరాబాదు మినహా మిగిలిన చోట్లనే ఆధిక్యత నిచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తొలి శాసనసభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు. అంతకు ముందు కూడా హైదరాబాదు గురించి ఎన్ని చర్చోపచర్చలు జరుగుతున్నా రెండు విషయాలపై పూర్తి స్పష్టత వుంది. మొదటిది-చారిత్రికంగా భౌగోళికంగా అది తెలంగాణకు రావలసిందే. రెండవది- రాజకీయంగా అక్కడ టిఆర్‌ఎస్‌ ప్రభావం పరిమితంగానే వుంటుంది. ఈ రెండో వాస్తవం మిగిలిన వారికంటే కెసిఆర్‌కు బాగా తెలుసు. అందుకే ఆయన వ్యూహాత్మకంగా 2010 కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీకి దిగకుండా ఉద్యమంపై కేంద్రీకరిస్తామని ప్రకటించారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినా 22 శాతం ఓట్లతో 24కు రెండు స్థానాలు మాత్రమే వచ్చాయి. అందులోనూ తొమ్మిది స్థానాలతో టిడిపి, అయిదింటితో బిజెపి ముందు నిలబడ్డాయి. విభజనానంతర వాతావరణంలో హైదరాబాదులోని మిశ్రమ జనాభా ఇంకా సూటిగా చెప్పాలంటే తెలంగాణేతర తెలుగు ప్రజానీకం ఓట్లు అందుకు కీలక పాత్ర వహించాయి. మజ్లిస్‌ బలం అయిదు నుంచి ఏడు స్థానాలకు పెరిగింది. కార్పొరేషన్‌లో ప్రథమ పార్టీగా వుండిన కాంగ్రెస్‌కు ఒక్కటంటే ఒక్క స్థానమూ దక్కలేదు. ఇది రాజధాని ప్రాంత గత ముఖచిత్రం. దీన్ని మార్చకపోతే తెలంగాణలో తమ ప్రభుత్వ అధికారానికి నైతిక ఆమోదం వుండదని ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ మొదట్లోనే అర్థం చేసుకున్నారు. హైదరాబాదు తెలంగాణకు రాజధాని మాత్రమే కాదు. జనాభా రీత్యా మూడో వంతుకు ఆదాయంలో 40 శాతానికి కేంద్రం. అక్కడ అన్యులకు ఆధిక్యత వుండటమంటే గుండెకాయలో గండి పడినట్టేనని ఆయన భావించారు. ఈ కారణంగానే ఎంత నీతిబాహ్యంగా కనిపిస్తున్నా,పార్టీలోనూ గగ్గోలు వున్నా తెలుగుదేశం ఎంఎల్‌ఎలను చేర్చుకుని మంత్రులను చేశారు.
మరోవైపున ఎన్నికల తర్వాత తెలుగుదేశం అధినేత ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదేళ్లు ఇక్కడే వుంటాననీ, వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తానని రాజకీయ వ్యాఖ్యలు చేశారు. మొదట్లో కొంతకాలం తను పాలించాల్సిన రాష్ట్రం కన్నా తెలంగాణ తమ్ముళ్లకే అధిక సమయం ఇచ్చి అవతలి వారికి అసంతృప్తికీ కారణమయ్యారు. హైదరాబాదు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా వుంటుందన్న ఏర్పాటును అతిగా అంచనా వేసుకున్న ఫలితమది. ఒకసారి విభజన జరిగి మరో రాష్ట్రానికి రాజధాని అయిన తర్వాత ఇక్కడ తమ రాజ్యాంగ స్తానానికి రక్షణ వుండొచ్చు గాని రాజకీయాధికారం చెల్లుబాటయ్యే ప్రసక్తి వుండదని గ్రహించేందుకు ఆయనకు సమయం పట్టింది. తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిగా తనకు ఒక ప్రత్యేక పట్టు వుంటుందని వేసుకున్న అంచనాలు తారుమారయ్యాయి. అసలు విభజన చట్టంలోని నిబంధనల్లోనూ బోలెడు అస్పష్టతలున్నా కేంద్రం గాని గవర్నర్‌ గాని తెలంగాణ ముఖ్యమంత్రిని చికాకుపర్చే ఏ చర్యలూ అనుమతించబోరని అర్థమైంది. దాంతో పాటు కెసిఆర్‌ కూడా కొన్ని తెలుసుకున్నారు. ఫీజుల రీ ఇంబర్సుమెంటు, వాహనాల రిజిస్ట్రేషను, తెలంగాణ నివాసయోగ్యత వంటి అంశాల్లో ఆయన ప్రభుత్వ చర్యలు న్యాయస్థానంలో వీగిపోయాయి. హైదరాబాదులో భవనాల మార్పుపై చేసిన అనేక హడావుడి ప్రకటనలు అర్థంతరంగా నిల్చిపోయాయి. ఆఖరుకు మెట్రో పొందిక మార్పుపై ఆదిలో తెల్పిన అభ్యంతరాలు కూడా ఆచరణలో నిలవక పోగా ఆర్థిక భారాన్నే పెంచాయి. ఈ కారణాలవల్ల గాని మొదట చెప్పుకున్న నేపథ్యంలో గాని కెసిఆర్‌ ఆయన ప్రభుత్వం హైదరాబాదుపై ఏడాది కాలంలో చెప్పుకోదగిన చొరవలేమీ చూపించలేదని చెప్పాలి. అయితే తెలుగుదేశం స్వయం కృతంగా అపఖ్యాతికరమైన ‘ఓటుకు నోటు’ ఇదంతా మార్చేసింది!
ఓటుకు నోటుకు కేంద్ర స్థానం హైదరాబాదు. సర్పయాగంలో తక్షకుడికి రక్షణ నిచ్చినందుకు ఇంద్రుడి శిరస్సుకే చుట్టుకున్నట్టు నిందితుడైన రేవంత్‌ రెడ్డిని కాపాడాలనుకుంటే చంద్రబాబు మెడకే చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ సూత్రధారిగా లోకేష్‌ పేరు కూడా విమర్శలు మూటకట్టుకుంది. ఆ పరిణామం తెలుగుదేశంను ఎంతగా కుదిపేసందంటే ఆ రోజుల్లో ఆ పార్టీ తరపున మాట్లాడేందుకు టిటిడిపి నేతలెవరూ అందుబాటులో వుండేవారుకాదు! ిఈ క్రమంలో తమ ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు ఆ వూపులోనే రాజధాని తరలింపు ప్రక్రియ వేగవంతం చేశారు. ఇక్కడ తమకు భద్రతలేదని పైకి ఆరోపించినా వాస్తవానికి సర్దుకోకతప్పదని నిర్ధారణకు వచ్చారు. పైగా అవతల పాలనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలనుతట్టుకోవడానికి కూడా ఇది అనివార్యమైంది. ఇద్దరు ముఖ్యమంత్రులు మొదట్లో సవాళ్లు విసురుకున్న స్థితి పోయి సఖ్యత ప్రదర్శించడం పెరిగింది. సహజంగానే సహృదయులందరూ దీన్ని హర్షిస్తున్నా ఇది చంద్రబాబు తలవంచిన ఫలితమేననే విమర్శలూ పెరిగాయి. హైదరాబాదులో ఆట మొదలైంది అంటూ హల్‌చల్‌ చేయజూసిన రేవంత్‌ రెడ్డి వంటివారి వైఖరికి పూర్తి భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. మిగిలిన వారి సంగతి అలా వుంచి టిటిడిపిలోనే అద్యక్షుడు, కార్యనిర్వాహక అద్యక్షుడు, శాసనసభా నాయకుడు అంటూ త్రిముఖ కేంద్రాలను ఏర్పాటు చేసి మరో వైపున లోకేష్‌ సారథ్యం, హైదరాబాదు పార్టీ అద్యక్షుడుగా మాగుంట గోపీనాథ్‌ నాయకత్వం మొత్తం పరస్పరం పొందిక పొంతన లేని తతంగమై పోయింది. దీని ప్రభావం బిజెపినీ ఇరకాటంలో పెట్టింది. అంతకు ముందు మోడీ మోత కొంత మేలు చేసినా ఇప్పుడు బీహార్‌ తర్వాత అది కూడా బెడిసికొట్టింది. ఆ పార్టీలో అంతర్గత కలహాలూ బహిర్గతమైనాయి.ఇలా ఎన్‌డిఎ కూటమికి శాసనసభ ఎన్నికల నాటి బలాధిక్య పరిస్థితి లేకుండా పోయింది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే ఒక్కస్థానం కూడా లేని నగరంలో బలమైన నాయకుడిని గుర్తించి వున్న ఓటింగును సంఘటిత పర్చుకునేబదులు అలవాటైన అంతర్గత కలహాలే వెన్నాడాయి. ఈ నేపథ్యంలో వరంగల్‌ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అపూర్వమైన ఆధిక్యత తెచ్చుకోవడం రాష్ట్రమంతటిలోనూ రాజకీయ దృశ్యాన్ని మార్చేసింది.
అయినా హైదరాబాదుపై నమ్మకం లేని కెసిఆర్‌ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి లోపాయికారిగా అనేక చర్యలు తీసుకుని విమర్శలు మూటకట్టుకున్నారు. చివరకు మేయర్‌ ఎన్నికలో ప్రజా ప్రతినిధులకు ఓటింగు కల్పించేందుకు కూడా సిద్ధమైనారు.మొదటే చెప్పినట్టు ఏదేమైనా గ్రేటర్‌పై జెండా ఎ గరాలన్నదే ఆయన లక్ష్యంగా వుంది. ఒక్కదెబ్బకు రెండు పిట్టల్లా ఈ పేరుతో కెటిఆర్‌ను దళపతిగా పంపించి వారసత్వానికీ ఆమోద ముద్ర వేయించుకున్నారు. కెటిఆర్‌ రంగంలోకి దిగినప్పటి నుంచి హైదరాబాదులో శంకుస్థాపనల పర్వంతో పాటు సీమాంధ్ర ఓటర్లను మెప్పించడం ప్రధాన వ్యూహంగా చేసుకున్నారు. మరి వీటి తీరుతెన్నులు ప్రజల స్పందన ఎలా వున్నాయి? మరో సారి చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *