ఎంవోయుల మర్మం – అనుభవాల సారం

ఎంవోయుల మర్మం – అనుభవాల సారం vizag cii 1111vizag cii 1111

విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సులో 4.78 లక్షల కోట్ల మేరకు 331 ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వీటివల్ల పదిలక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
ఇలాటి ప్రాథమిక అవగాహన ఒప్పందాలపై ఎక్కువగా ఆశపెట్టుకోవడానికి లేదని అనుభవం హెచ్చరిస్తున్నది. 2013లో మోడీ హయాంలో జరిగిన వైబ్రంట్‌ గుజరాత్‌ సదస్సులో కుదిరిన ఎంవోయులలో 8 శాతం మాత్రమే అమలుకు వచ్చినట్టు అంకెలు చెబుతున్నాయి. ఆ రాష్ట్రాన్ని ఆయన పాలించిన కాలమంతటిలోనూ 15శాతానికి మించి ఒప్పందాలు అమలు కాలేదు. అనుకున్న ప్రకారం అమలు కాని అనిల్‌ అంబానీ ప్రతిపాదనలు కూడా వాటిలో వున్నాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ చివరి దశలో కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో ఒక్కరోజులో రెండు లక్షల కోట్ల ఎంవోయులపై సంతకాలు జరిగాయని హంగామా చేశారు. అయితే అందులో నిజంగా వచ్చినవెన్ని? ఉద్యోగాలిచ్చిందెక్కడీ వైఎస్‌ హయాంలోని ఫ్యాబ్‌సిటీ, లేపాక్షి హబ్‌ బ్రాహ్మణి వంటివన్నీ ఎక్కడకు పోయాయి? అంతకుముందు చంద్రబాబు పాలనలో ఇచ్చిన భూముల్లోనూ నిజంగా వచ్చినవెన్ని? గోల్ఫ్‌ కోర్సు, ఎంఆర్‌ఎంజిఎప్‌ వంటివి చివరకు ప్రహసనాలుగా కుంభకోణాలుగా ముగిశాయి. ఈ 18 నెలల పాలనలో అనుభవాలు చూసినా అట్టే ఫలితాలు కనిపించవు. నూతన రాజధాని అమరావతిలో అన్ని అద్భుతమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఎంతగానో చెబుతున్నారు. కాని ఈ సదస్సు ఒప్పందాలలో రాజధాని అభివృద్ధి పథకాలకు ముందుకు వచ్చిన వారెవరు?
మెమోరాండం అప్‌ అండర్‌స్టాండింగ్‌(ఎంవోయు) అనేది ఒప్పందంకాదు. ప్రాథమికంగా అనుకునే మాట మాత్రమే. సంతకాలు జరిగితే సంకేతాలు వెళతాయని చాలా విషయాల్లో అస్పష్టంగానూ హడావుడిగానూ ప్రకటించేస్తుంటారు. ప్రభుత్వాలు పెట్టుబడిదారులు పరస్పరం ప్రచారం కోసం ప్రహసనం నడిపిస్తుంటారు. అసలు కథ తర్వాతే మొదలవుతుంది. ఇంతకంటే గట్టిగా కుదిరిన ఒప్పందాలే అమలుకు నోచుకోలేదు. వామపక్ష ప్రభుత్వ హయాంలో పశ్చిమబెంగాల్‌లో లక్ష రూపాయల కారుకు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి కొంత దూరం వెళ్లిన తర్వాత కూడా గుజరాత్‌కు తరలించుకుపోయిన అనుభవం వుంది. అందుకు రాజకీయ కారణలు తప్ప పాలనాపరమైన కారణాలు లేవు. నాటి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించడానికి అండగా వుండటానికి సంసిద్ధత తెల్పినా వెళ్లిపోయారు. తర్వాత ఆ కారు పెద్దగా జయప్రదమైంది కూడా లేదు.టాటాల వంటి వారి ఆధ్వర్యంలో అంత వరకూ వచ్చిన ఒప్పందానికే ఆ గతి పడితే వూరికే రాసుకున్న వాటికి విలువెంత? కనుక ఇరుపక్షాలలో ఎవరినీ నిబద్దులను చేయని ఎంవోయులను అతిగా ప్రచారం చేసి పెట్టుబదుల వరద అనీ, ఉద్యోగాల వెల్లువ అని చెప్పడం తాడూ బొంగరం లేని వ్యవహారం. అవన్నీ నిజం కావాలని ఆశించవచ్చు వస్తే సంతోషించవచ్చు గాని పెట్టుబడులు ఉద్యోగాలు వచ్చేస్తాయని అధికారికంగా చెప్పడం వల్ల అమాయక యువతకు రేపు తీవ్రంగా ఆశాభంగం కలిగిస్తుంది.ఈ క్రమంలో రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలాలు రైతాంగ భూముల సేకరణలు లేనిపోని సమస్యలుగా మారతాయి.కనుక నిర్దిష్టత వచ్చినప్పుడే అడుగు పడినట్టు అనుకోవాలి. అలా ముందుకు వెళ్లేవి వుంటేవాటిపై కేంద్రీకరించడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *