‘గ్రేటర్’లో టిఆర్‌ఎస్ వ్యూహాలు- ప్రతిపక్షాలు
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్(జిహెచ్‌ఎంసి) ఎన్నికల పై టీవీ చర్చల్లో నేను కాస్త మెత్తగా మాట్లాడుతున్నానని కొందరు మిత్రులు విమర్శకులు వ్యాఖ్యానించారు. ఎన్‌టివి సర్వేపై చర్చలో ఫోన్‌లైన్‌లోకి వచ్చిన తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి మీరు కెసిఆర్‌ను సమర్థించదల్చుకుంటే మీ ఇష్టం అని బహిరంగంగానే ఆరోపించారు. అయితే ఆ తర్వాత నేను అదే చర్చలోకి వచ్చిన కెటిఆర్‌తో మాట్లాడింది రేవంత్ విన్నారో లేదో నాకు తెలియదు. కెటిఆర్‌తోనూ కాస్త ‘సాఫ్ట్’గా మాట్లాడానని కొందరు యువ కాంగ్రెస్ మిత్రులన్నారు. ఈ విమర్శలన్నిటికి ఒకే కారణం. హైదరాబాదు ఎన్నికలను రాజకీయ పరంగా ప్రజా సమస్యల పరంగా చూడాలి గాని తెలంగాణ వర్సెస్ సీమాంధ్ర అన్నట్టు మాట్లాడటం మంచిది కాదని నేను చెప్పడం వారికి నచ్చలేదు. నచ్చినా నచ్చకపోయినా చేయగలిగింది కూడా లేదు. నా వరకు నేను తెలంగాణ ఉద్యమం ఉధృతదశలో కూడా తెలుగు ప్రజల మధ్య వైరుధ్యాలు పెరగరాదని భావించాను. ఎవరెంత రెచ్చగొట్టినా వారు రెచ్చిపోరని శాంతికి భంగం రాదని వాదించాను. ప్రజల అప్రమత్తత నా అంచనాను నిజం చేసింది. ఇప్పుడు ఎన్నికల ముంగిట్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వాధినేతలు ముఖ్యంగా కెటిఆర్ ఆంధ్ర ప్రాంతం వారిలో ఆందోళనలు పారదోలడానికి ధారాళంగా మాట్లాడుతున్నారు. చమత్కారాలు విసురుతున్నారు. ఇదంతా ఎన్నికల కోసమేనని తర్వాత మళ్లీ మొదటికి వస్తారని రేవంత్‌తో సహా కొందరు చెబుతున్న మాట. నిజంగా అలా జరిగితే ప్రజలు వూరుకోరు . కనుక ఎన్నికల తర్వాత దాడులు జరుగుతాయన్నట్టు ఎందుకు మాట్లాడాలి అని నేను వాదించాను. (ఇలాటి వాదనే కాంగ్రెస్ నాయకుడు శ్రావణ్‌తోనూ జరిగింది) రేవంత్ కూడా ఆ రోజుల్లో తీవ్రంగా మాట్లాడిన కొన్ని సంభాషణలు కొన్ని గుర్తు చేశాను. అందువల్లనే ఆయన నాపైనే ఆరోపణలకు దిగారు. ఆయన వాదనాశైలి టిటిడిపి నిజంగా మేలు చేస్తుందో లేదో పలితాలు చెప్పాలి. నా వరకు నేను ఉద్యమం ఉధృతంగా వున్నప్పుడు గాని కెసిఆర్ అధికారం చేపట్టిన తర్వాత గాని విమర్శలకు వెనుకాడిన ఉదాహరణే లేదు. ఉండదు కూడా. ఆయా పార్టీలు తమతో గొంతు కలపలేదని భావించినప్పుడు ఏదో ఒక ముద్ర వేయడం మామూలే. జగన్ కేసుల సమయంలో నేను తెలుగుదేశంకు అనుకూలమని ఆయన అనుయాయులు అంటుండేవారు. తర్వాత నేను జగన్ పార్టీని సమర్థిస్తున్నానని తెలుగుదేశం వారు ఆరోపిస్తుంటారు. తెలంగాణ ఉద్యమ ఉద్వేగాల దశలో కూడా నేను టిఆర్‌ఎస్‌తో సహా అందరి వాదనల పోకడల నిజానిజాలు విశ్లేషించినప్పుడు పరస్పర విరుద్ధమైన ముద్రలు వేసేవారు. ఇవన్నీ మామూలే. ట్యాంకుబండ్‌పై విగ్రహాల విధ్వంసం జరిగిన వెనువెంటనే టీవీ9 చర్చలో పాల్గొంటున్న గద్దర్‌తో వాదించిన, ఆంధ్రజ్యోతిలో నా గమనం లో వ్యాసం రాసినవ్యక్తిని నేను. బిజెపి ఆరెస్సెస్ మిత్రులు నేను లేవనెత్తిన విమర్శలను వదలిపెట్టి కమ్యూనిస్టు ముద్రతో దాడి చేస్తుంటారు.ఇలాటి వాటిని పట్టించుకోవలసిన అవసరం వుండదు.
నాపై ఆరోపణల మాట పక్కనపెట్టి ఎన్నికల పరిశీలనకు వద్దాం. మరో ఎనిమిదేళ్ల కాలం హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా వుండే అవకాశం ఇక్కడ జనాభా మిశ్రమంగా వుండటం ఈ ఎన్నికలపై ఆసక్తికి ప్రధాన కారణం. 2009లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో పాల్గొనకుండా వుండిపోయింది. అప్పుడు టిడిపి ప్రథమ శక్తిగా వచ్చినా కాంగ్రెస్ మజ్లిస్ కలసి కార్పొరేషన్‌ను పాలించాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ(చట్టం) తర్వాత కూడా ఇక్కడ తెలుగుదేశం ప్రథమ స్థానంలోనూ బిజెపి రెండవ స్థానంలోనూ వచ్చాయి. నగరంలోని 24 శాసనసభ స్థానాల్లోనూ టిడిపి9, బిజెపి5,మజ్లిస్ 7 తెచ్చుకుంటే టిఆర్‌ఎస్ కేవలం రెండింటితో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఓట్లకు వచ్చేసరికి 22 శాతం తెచ్చుకుంది. తెలంగాణేతరులు తెలుగేతరులు కూడా గణనీయంగా వుండటం ఇందుకు కారణంగా విశ్లేషణలు జరిగాయి. కె.చంద్రశేఖరరావు తెలంగాణ సారథ్యం చేపట్టిన తర్వాత కూడా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పదేళ్లు ఇక్కడే వుంటానని ప్రకటించి హడావుడిగా టిటిడిపి సమావేశాలు జరిపేవారు.
అయితే తర్వాతి కాలంలో ఇదంతా మారింది. చంద్రబాబు సన్నిహితులుగా పేరు పొందిన చాలా మంది పార్టీ మార్చి టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. హైదరాబాదులో మాగంటి గోపీనాథ్, వివేకానంద గౌడ్, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ మాత్రమే తెలుగుదేశంతో వున్నారు. అందులోనూ గాంధీపై చాలా కథనాలు వుండగా వివేకానంద కొంతకాలం మెతగ్గా వుండి ఇప్పుడు మళ్లీ గట్టిగానే పార్టీని భుజాన వేసుకుంటున్నారు. ఆర్.కృష్ణయ్య కూడా వున్నా ఆయన ప్రధానంగా బిసి నేత.వీటితో పాటు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు కూడా టిడిపిని కుదిపేసింది. ఆ సందర్భంగా తమపై నిఘా వేశారంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించడమే గాక విజయవాడకు త్వరితంగా తరలిపోయారు. అదే సమయంలో కార్పొరేషన్ ఎన్నికలలో బిజెపితో రాజకీయ సంఘటనను మాత్రం ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సంభాషణలు కలయికలు పెరిగినా రాజకీయంగా టిడిపి టిఆర్‌ఎస్ వైరం తగ్గలేదు. చంద్రబాబు కెసిఆర్ ప్రభుత్వంపై ప్రత్యక్ష విమర్శలు తగ్గించడంతో బిజెపి కూడా ఇరుకున పడిపోయింది. అంతకు ముందే ఆ పార్టీ అద్యక్షుడు కిషన్‌రెడ్డి మెతక వైఖరి అనుసరిస్తున్నారనే అంతర్గత విమర్శలువుండగా తెలుగుదేశం కూడా నీరసపడిపోవడంతో ఇరు పార్టీల కూటమి వూపుతగ్గింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపట్ల కూడా టిఆర్‌ఎస్ ద్వంద్వ వైఖరి అనుసరించడం మరింత ఇరకాటమైంది. కెసిఆర్ మరికొందరు సీనియర్లు కాస్త ప్రశంసలు కురిపిస్తుంటే కెటిఆర్ తీవ్ర విమర్శలు చేసే పని పెట్టుకున్నారు. రాజాసింగ్ అనే బిజెపి ఎంఎల్‌ఎను ఎగదోసి ఆయన ద్వారా శివసేనను ఏర్పాటు చేయించారని చూస్తున్నారనే కథనాలున్నాయి. అసలు కెసిఆర్ చేసిన చండీయాగంతో బిజెపిని మించిన హిందూత్వ వాది అయ్యారనేది టిఆర్‌ఎస్ అంచనా వేస్తున్నది. మజ్లిస్‌తో నేస్తం వుంది గనక అవసరమైతే వారితో జట్టుకట్టయినా జిహెచ్‌ఎంసి కైవశం చేసుకోగలమనే ధీమా వారిది!
నిజానికి టిఆర్‌ఎస్ మొదటి ఏడాది కాలంలోనూ హైదరాబాదు సమస్యలపై పెద్దగా కేంద్రీకరించలేదు. కార్పొరేషన్ ఎన్నికలను త్వరితంగా పూర్తి చేయడంపైనా శ్రద్ద చూపలేదు. తన బలం పెరిగిందని నమ్మకం కుదిరాకే కసరత్తు ప్రారంభించింది. కెసిఆర్ అనుకూలుడుగా ముద్ర వేయించుకున్న సోమేష్ కుమార్‌ను బదిలీ చేయడంతో ఈ కసరత్తు మొదలైంది. బహుశా గోదావరి జలాల తరలింపులో చివరి దశను పూర్తిచేసి నీరందించడంతో వూపందుకుంది. ఈ పథకం గత ప్రభుత్వ హయాంలో నుంచి జరుగుతున్నదే అయినా ఆఖరి ఘట్టంలో అధికారంలో వుండటం వారికి కలసి వచ్చింది. ఇక కెటిఆర్ మొత్తం మకాం వేసి ఇక్కడ విజయమే ఏకైక లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు. మంత్రులందరికీ డివిజన్ల వారీ బాధ్యతలు కేటాయించడమే గాక ఎంఎల్‌ఎలు ఎంఎల్‌సిలకూ నిర్దిష్టబాధ్యతలు అప్పగించారు. ఈ వ్యయప్రయాసలు మోయలేని స్థాయిలో వున్నాయని కెసిఆర్‌కు దగ్గరగా మసలే ఒక నాయకుడే అన్నారు. ఏది ఏమైనా హైదరాబాదు గెలవకపోతే తెలంగాణలో అధికారానికి అర్థం వుండదనీ నైతిక బలం పోతుందని కెసిఆర్ భావిస్తున్నారన్నది స్పష్టం. అందుకు సామదాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించడానికి ఆయన సకల సన్నాహాలు చేసుకున్నాకే సమరశంఖం మోగించారు. మజ్లిస్‌కు పాతబస్తీ వరకూ పరోక్షంగా సహకరించడం కూడా ఈ వ్యూహంలో ఒక భాగం. ప్రజా ప్రతినిధులకు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో ఓటు హక్కు నివ్వడం ఆఖరి అస్త్రం.
కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఇచ్చింది తామేనని ఎంత చెప్పుకున్నా అది హైదరాబాదులో పెద్దగా పనిచేయదు.మొన్నటి శాసనసభ ఎన్నికల్లో వారికి ఒక్కటంటే ఒక్కస్థానం రాకపోవడమే అందుకు నిదుర్శనం. గతంలో దానం నాగేందర్ ఇక్కడ మేయర్ స్థానానికి పోటీ పడినా ఫలితం లేకపోయింది.ఈసారి ఆయన అదే స్తానం కోసం టిఆర్‌ఎస్‌తో బేరం పెట్టి చివరివరకూ కుదరకపోవడంతో కాంగ్రెస్‌లోనే వుండిపోయారు. అయితే ఆయన వ్యతిరేకలు దాడి చేసి గాయపర్చడంతో వివాదానికి దారితీసింది. ఈ సమయంలో కాంగ్రెస్ నాయకులు తమకు చాలా అవకాశాలు వున్నాయని చెప్పుకుంటున్నా ఐక్యతా లోపంవెంటాడుతున్నది. దానికి తోడు దేశమంతటా బలహీనపడుతున్న ప్రభావం కూడా వుంది. ఎన్నికల నిర్ణయంపై కోర్టులో పోరాడి టిఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టడంలో మాత్రం కాంగ్రెస్ కృతకృత్యమైందిగాని ఎన్నికల రంగంలో అంతటి ఆశలేదు.
ఉభయ కమ్యూనిస్టుపార్టీలు లోక్‌సత్తా కలసి వన్ హైదరాబాదు పేరుతో పోటీ చేస్తున్నాయి. అయితే ఆ ప్రభావం కొన్ని స్థానాలలో వుంటుంది.ఈ పెద్దపార్టీల వాదోపవాదాలతో నిమిత్తం లేకుండా ప్రజా సమస్యలు ఉద్యోగ కార్మిక భద్రత వంటి అంశాలపై ఈ కూటమి దృష్టిపెడుతున్నది.హైదరాబాదులో బలపడితేనే తెలంగాణలో ప్రభావం పెరుగుతుందని సిపిఎం భావిస్తున్నది.
ఈ ఎన్నికల పర్వంలో మీడియాను ప్రజలను కూడా ఆకర్షిస్తున్నది కెటిఆర్ ప్రచార నినాదం. సీమాంధ్ర ప్రజలను ఆకట్టుకోవడం కోసమే ఆయనను ప్రయోగించారని అందరూ భావిస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన మరీ ముందుకువెళ్లి తమ పార్టీ పేరుతెలుగు రాష్ట్రసమితి అని మార్చుకోవడానికి సిద్ధమన్నారు. భీమవరం నుంచి పోటీ చేస్తానని కూడా సరదాగా ప్రకటించారు. రేవంత్ రెడ్డి సవాలుకు సమాధానంగా ఆ ప్రకటన చేసినా అందులో టిఆర్‌ఎస్ ప్రయోజనాలు కూడా వున్నాయి. ఒకసారి అధికారంలోకి వచ్చాక అన్ని తరగతులనూ ఆకర్షిస్తేనే మనుగడ అన్నది వారి ఆలోచనగా వుంది. అంతేగాని వ్యతిరేకులు ఆరోపిస్తున్నట్టు ఎన్నికల తర్వాత మళ్లీ పాత పంథాకు తిరిగిపోవడం కాకపోవచ్చు. సీమాంధ్ర వ్యాపారవేత్తలతో టిఆర్‌ఎస్ నేతలకు సత్సంబంధాలే వున్నాయి. సినిమావారికి చాలా ప్రాధాన్యతనిస్తుంటారు కూడా. రాష్ట్ర విభజన తర్వాత ఆ తరహా మాటలకు అర్థం వుండదని కూడా అందరికీ తెలుసు. నిజంగా టిఆర్‌ఎస్ మారకపోతే దానికి మూల్యం చెల్లిస్తుంది. అంతేగాని ముందునుంచి సీమాంధ్ర ఓటర్ల చుట్టూ చర్చ తిప్పి వారిలో ఆందోళన కలిగిస్తే ఆ భయంతో వారికే ఓటు వేసే అవకాశముంటుందని కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. అయితే మరో నినాదం లేని స్థితిలో కమ్యూనిస్టేతర ప్రతిపక్షాలన్నీ దీని చుట్టూనే తిరుగుతున్నాయి. దీనివల్ల వారికి నిజంగా లాభం జరుగుతుందని చెప్పడం కష్టం. మజ్లిస్ బిజెపిల రాజకీయాలు కూడా ఎలాటి పరిస్థితికి దారి తీస్తాయో చూడాలి. జిహెచ్‌ఎంసి ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలలో మరింత స్తిరత్వం రావచ్చు.
