కాలాంతక కాల్‌మనీ: ప్రభుత్వ పొరబాట్లు సర్దుబాట్ల ఫీట్లు
కాలాంతక కాల్‌మనీ: ప్రభుత్వ పొరబాట్లు సర్దుబాట్ల ఫీట్లు
విజయవాడలో బహిర్గతమైన కాల్‌మనీ వికృత క్రీడ ఆంధ్ర ప్రదేశ్‌ను కుదిపేయడంలో ఆశ్చర్యం లేదు. పేద మధ్య తరగతి ప్రజల ఆర్థిక దుస్థితిని ఆసరా చేసుకుని అప్పుల పేరిట అమానుష లైంగిక ఆర్థిక దోపిడీకి బలిచేసిన అరాచకాన్ని ఎంత ఖండించినా తక్కువే. ఈ విషయంలో పాలక తెలుగుదేశం ప్రజాప్రతినిధుల పేర్లు నిందితులతో పాటు వినిపించడం ఇంకా దారుణం. రాజధాని ప్రాంతంగా చెబుతున్న విజయవాడకు కళంకం. వైసీపీ కాంగ్రెస్ మరే ఇతర పార్టీలకు చెందిన వారున్నా తప్పక శిక్షార్హులు కావలసిందే. కొంతమంది పోలీసు అధికారుల పాత్ర కూడా కనిపిస్తున్నది. పాలకపక్ష ప్రముఖులు పోలీసులు కూడా ప్రమేయం వున్నందునే దీనిపై చర్య ఇంత కాలం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఈ వారంలోనైనా వచ్చిందంటే అందుకు రెండు మూడు కారణాలు. పోలీసు శాఖకు సంబంధించినవారికే సెగ తగలడం. స్థానిక ఎంపి కేశినేని నాని ఈ విషయంలో పోలీసులపై వత్తిడి పెంచడం.మూడు విజయవాడ పోలీసు కమీషనర్ గౌతమ్ సవాంగ్ ఆలస్యంగానైనా గట్టిగా స్పందించడం. ఈ కేసులో నిందితుణ్ని వెంటపెట్టుకుని సింగపూర్ వెళ్లిన తెలుగుదేశం ఎంఎల్ఎ బోడె ప్రసాద్‌తో నేను చర్చలో పాల్గొన్నాను. అలాటి వ్యక్తిని తెలిసి తీసుకెళ్తే ఒక తప్పు తెలియక తీసుకుళ్లే మరో విధమైన పొరబాటు అన్నాను. తనను తీసుకువచ్చి అప్పగించే బదులు అక్కడి నుంచి మరో దేశానికి పంపి తిరిగిరావడం శాసనసభ్యుడికి తగునా అని అడిగాను. ఎంఎల్‌సి బుడ్డా వెంకన్న కూడా తన సోదరుడికి ఈ వ్యాపారంతో సంబంధం వుందని పరోక్షంగా అంగీకరిస్తూనే తామిద్దరికి పెద్ద సంబంధాలు లేవన్నారు. ఇలాటి ఉదాహరణలు ఇంకెన్నో.
మహిళల ధనమాన ప్రాణాలను దోచుకునే ఈ తరహా వ్యాపారం ఇంత కాలం సాగుతున్నా నిఘా వైఫల్యం వల్ల పసిగట్టలేకపోయామని ముఖ్యమంత్రి చెప్పే మాట నిలిచేది కాదు. తెలిసి ఉపేక్షించడం రకరకాల మాఫియాలపై రాజకీయంగా ఆధారపడటం ఈ ఘోరానికి దారితీసింది. ఎంతటివారైనా వదిలేదిలేదన్న మరురోజునే దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారిని సెలవుపై పంపడం అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శకు దారి తీసింది. ఈ ఉదయం తెలుగుదేశం ముఖ్య ప్రతినిధులను దీనిపై ప్రశ్నిస్తే సరైన సమాధానం లేకపోయింది.. దానికన్నా ఆలస్యంగానైనా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తేనే ప్రభుత్వం మర్యాద దక్కుతుంది. ఆ విషయం అర్థమైనందునే కావచ్చు- తెల్లవారే సరికి గౌతం సెలవు రద్దు చేసుకోవడం మళ్లీ చేరతానని చెప్పడం చూస్తున్నాం. తప్పు దిద్దుకోవడం మంచిదే గాని ఇలాటి చర్యలు తెలుగు దేశంలో రాజకీయంగానూ కనిపించాలి. నిందితులను ఏదో విధంగా దూరం పెట్టే ప్రక్రియ జరగాలి. మాఫియాల పునాదులపై నిర్మించే మహాసౌధాలు నిలబడతాయనుకోవడం పొరబాటు. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి పోలీసులను ఖచ్చితంగా పనిచేసే అధికారులను పోలీసులను నిరుత్సాహ పర్చి నిందితులైన పార్టీ వారిని కాపాడుతున్నారనే విమర్శలకు ఇదో పెద్ద ఉదాహరణ అయింది. ఈ విషయంలో తప్పు దిద్దుకుని వుండొచ్చు గాని కాల్ మనీ కేసును పటిష్టంగా నడిపి దోషులందరినీ శిక్షించకపోతే ప్రజలు శాంతించరు.
మూలాల్లోకి వెళితే – విద్య వైద్యం కోసమే ఈ అప్పుల్లో అత్యధిక భాగం తీసుకున్నారు. ప్రభుత్వాలు వాటిని ప్రైవేటీకరించి ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం వల్ల ఏర్పడిన పరిస్థితి ఇది. పల్లెల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలు ఇంకా అనేక విధాల అవస్థల పాలవుతున్నారు. కొద్ది కాలం కిందట మైక్రో ఫైనాన్స్ సమస్య వచ్చినప్పుడు కూడా చాలా వాస్తవాలు వెలుగు చూశాయి. మహారాష్ట్ర కర్ణాటక కేరళ, పంజాబ్, తెలంగాణ తదితర చోట్ల కూడా ఈ రుణాల సమస్య పోలీసులు వడ్డీ వ్యాపారుల పీడన ఘటనలు వచ్చాయి. మహారాష్ట్రలో అమలవుతున్న 2014 రుణ దాతల చట్టం వున్నంతలో ఆధునికమైంది. అది కూడా చాలా ఆలస్యంగా ఆమోదం పొందింది. దాంతో సహా రకరకాల చట్టాలను అధ్యయనం చేసి భవిష్యత్తులోనైనా బాధితులకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. అందుకు అసెంబ్లీ సమావేశాలే వేదిక కావాలి.