అయోధ్య పర్వం- ఆగని హిందూత్వ వ్యూహం

అయోధ్య పర్వం- ఆగని హిందూత్వ వ్యూహం

డిసెంబర్‌ 6. స్వతంత్ర భారత చరిత్రలో ఒక చీకటి ఘట్టాన్ని చూసిన రోజు. లౌకిక తత్వ ప్రజాస్వామ్య భావనపై ప్రత్యక్ష దాడి జరిగిన రోజు. ఆరెస్సెస్‌ బిజెపి సంఘ పరివార్‌ నేతలు దగ్గరుండి బాబరీ మసీదును కూలగొట్టిన రోజు. 1992 లో ఈ ఘోరకలి జరిగిన నాటినుంచి ప్రతిఏటా లౌకిక వాదులూ శాంతి కాముకులూ డిసెంబరు 6ను మతతత్వ రాజకీయాల ప్రమాదం తెలియజేసే ఒక హెచ్చరిక దినంగా పాటిస్తున్నారు. దేశమంతటా సభలూ సమావేశాలు కార్యక్రమాలూ జరిపి మత సామరస్యం లౌకిక తత్వం ఆవసరాన్ని నొక్కి చెబుతున్నారు. మొన్న నిన్న బిజెపి ఆరెస్సెస్‌ కీలక నేతల నుంచే వెలువడిన రెండు ప్రకటనలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మొదటి ప్రకటన స్వయానా ఆరెస్సెస్‌ అత్యున్నత నేత మోహన్‌ భగవత్‌ చేసింది- అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తన జీవిత కాలంలోనే అక్కడ ఆలయ నిర్మాణం జరగాలన్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా 2001లో అమెరికాలో డబ్ల్యుటిసిపై దాడినీ, ఎప్పుడో వందల ఏళ్ల కిందట అయోధ్యలో వివాదాస్పద స్థలం వున్నచోట కట్టడంపై జరిగిన దాడినీ పోల్చి మాట్లాడారు. డబ్ల్యుటిసి అమెరికా ఆర్థిక శక్తికి కేంద్రమైనట్టే అయోధ్య కట్టడం కూడా భారతీయ సంసృతికి కేంద్రబిందువని అర్థ రహితమైన ఆచారిత్రిక పోలిక తీసుకొచ్చారు. ే ఈ మాటలను బట్టి చూస్తే సంఘ యుపిలోనూ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పరివార్‌ మరోసారి అయోధ్య పర్వానికి తెరలేపడం తథ్యంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే ప్రధాని మోడీ కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వుండడం వల్ల లాభాలను గురించి మాట్లాడారు. దేశానికి బలమైన ప్రభుత్వం వుండాలన్నారు.
దేశంలో చాలా మతకలహాలు, దాడులు జరిగినప్పటికీ అయోధ్య విధ్వంసం వాటన్నిటికన్నా భిన్నమైంది. ఉత్తర ప్రదేశ్‌లో తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అయోధ్యలో విధ్వంసానికి పాల్పడింది బిజెపి కూటమి. అందుకు అవకాశం కల్పించింది అప్పుడు కేంద్రంలో వున్న పివి నరసింహారావు ప్రభుత్వం. ఆ తర్వాత జరిగిన మత ఘర్షణలలో దాదాపు 2000 మంది మరణించారు. అంతర్జాతీయంగా మన దేశ లౌకిక ప్రతిష్టకు కళంకం ఏర్పడింది. దేశంలో అభద్రతా వాతావరణం పెరిగింది. అయితే బిజెపి ఆరెస్సెస్‌ల కోణంలో ఈ ఘటన వారి అవకాశాలను పెంచింది. దేశ చరిత్రలో తొలిసారి 1996లో వాజ్‌పేయి నాయకత్వంలో బిజెపి-ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడి 13 రోజులలో పడిపోయింది. అయితే రెండేళ్ల తర్వాత 1998లో మరోసారి అధికారం చేపట్టి 13 మాసాలు కొనసాగింది. ఈ సమయానికల్లా తెలుగుదేశంతో సహా చాలా లౌకిక ప్రాంతీయ పార్టీలు బిజెపితో చేతులు కలిపాయి. ఇక 1999లో మూడవసారి అధికారం చేపట్టిన వాజ్‌పేయి నాలుగేళ్ల పాటు పాలన సాగించారు. ఇంచుమించు ఏడేళ్లపాటు తాము కేంద్రంలో చక్రం తిప్పడానికి అయోధ్య వ్యూహం ముఖ్య కారణమని బిజెపి ఆరెస్సెస్‌లు భావించాయి. కనుకనే మరో పదేళ్ల తర్వాత 2002లో గుజరాత్‌లో మరో మారణ వ్యూహం నడిపించాయి. ఇక్కడ కూడా ప్రస్తుత ప్రధాని నాయకత్వంలో ఆ పార్టీ ప్రభుత్వమే వుండగా కేంద్రంలోనూ వాజ్‌పేయి పాలన నడుస్తున్న దశ. అయోధ్య నుంచి గుజరాత్‌కు వచ్చే సరికి దేశంలో మతతత్వ రాజకీయాల ప్రాబల్యం పెరిగింది. మధ్య తరగతి వర్గంలోనూ యువతలోనూ ఆమోదయోగ్యత సంతరించుకోవడంలో వారు చాలా వరకు కృతకృత్యమైనారు. పైగా అయోధ్య ఘటనలో అద్వానీ వంటివారు కేసులుఎదుర్కోవలసి వచ్చింది గాని గుజరాత్‌ హత్యాకాండకు మోడీపై ఎలాటి అభియోగం అధికారికంగా నమోదుకాని స్థితి వచ్చింది. పైగా ఆయనను సమర్థుడైన ముఖ్యమంత్రిగా ఆకాశానికెత్తి ఉత్తరోత్తరా ప్రధాని అభ్యర్థిని చేశారు. ” వాజ్‌పేయి అద్వానీలతో కూడిన ప్రస్తుత తరం ముగిశాక మోడీ ప్రధాని పదవికి అభ్యర్థిగా వచ్చినా రావచ్చు” అని 2002లోనే ప్రముఖ చరిత్ర కారుడు ఐజాజ్‌ అహ్మద్‌ వ్యాఖ్యానించడం ఆసక్తికరమైన అంశం. అద్వానీ సణుగుడును బేఖాతరు చేసి మోడీని పైకి తేవడం ఆయన ప్రధాని కావడం మరో పదేళ్ల తర్వాతి పరిణామం. అయోధ్య తర్వాత పదేళ్లకు గుజరాత్‌ , ఆ తర్వాత పదేళ్లకు మోడీత్వం దేశీయంగా విజయం సాధించడం హిందూత్వ రాజకీయాల్లో ఒక కొనసాగింపు. లౌకిక తత్వానికి ఒక ముప్పు.
దీని పర్యవసానాలు కనిపిస్తూనే వున్నాయి. యుపిలో అధికారం వున్నప్పుడు బాబరీ విధ్వంసం, గుజరాత్‌లో అధికారంతో జాతి హత్యాకాండ సాగించిన హిందూత్వ వాజ్‌పేయి ప్రధానిగా వుండగా రాజ్యాంగ సమీక్ష ప్రహసనం నడపింది. ఇప్పుడు ఏకంగా తనకే మెజార్టి వుంది గనక నేరుగానే రాజ్యాంగ విలువలపై నిర్వచనాలపై దాడికి దిగింది. దేశమంతటా అసహన రాజకీయాలను అనుచిత ద్వేషపూరిత వాతావరణాన్ని పెంచుతున్నది. రాజ్యాంగ దినోత్సవాన్నే అపహసించేలా జనవరి 26ను నవంబరు 28కి మార్చి వేసింది!ఆ సమయంలో ఆధునిక ప్రజాస్వామ్య లౌకిక తత్వాన్ని గాక సనాతన ధర్మాన్ని హొంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రవచించడం యాదృచ్చికం కాదు. నిరసనలూ విమర్శల తర్వాత ప్రధాని నామకార్థంగా మాకు రాజ్యాంగమే పవిత్ర గ్రంథమని ప్రకటించినప్పటికీ ఆ వెంటనే మోహన్‌ భగవత్‌ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పిలుపునివ్వడం ద్వంద్వనీతికి దర్పణం. మోడీ కూడా తనను తాను ఆరెస్సెస్‌ పూర్వ ప్రచారక్‌గా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. గర్వపడతారు. పైగా మొత్తం మంత్రివర్గంతో ఆరెస్సెస్‌ పెద్దల ముందు హాజరై సమీక్షలు చేయించుకుని ఆదేశాలు పుచ్చుకుని వస్తారు. గనక ప్రస్తుత నిర్వాకాలన్నీ డిసెంబరు6 కొనసాగింపులే. మొదటి దశలో గత చరిత్రకు సంబంధించిన ఒక మతోద్రిక్త అంశాన్ని తీసుకుంటే ఇప్పుడు పట్టుప్రచారం పెరిగాయి గనక నేరుగా వర్తమాన విషయాల్లోనే వివాదాలు పెంచుతూ విషపుదాడులకు దిగుతున్నారు.

వాస్తవానికి అయోధ్య వివాదమే క్రృత్రిమమైంది. ే.
అయిదు వందల ఏళ్ల నాడు రామాలయాన్ని బాబర్‌ కూలదోశాడనే వాదన ఎంతగా చేసినా అయోధ్య నిజానికి 19 వ శతాబ్ది సమస్య మాత్రమే. 15 వ శతాబ్దంలోనే తులసీ దాస్‌ రామచరిత మానస్‌ ప్రసిద్ధికెక్కినా రామునికి సంబంధించిన స్థలంగా అది పేరొందలేదు.17 వ శతాబ్దంలోనే అది వైష్ణవులకు ఒక తీర్థయాత్రా స్థలమైంది. కాశీ, హరిద్వార్‌లతో పాటు వైష్ణవులు దాన్ని కూడా పేర్కొనసాగారు.కాని అప్పుడు కూడా మిగిలిన రెండూ ఇంతకంటే ఎక్కువ పేరులో వుండేవి. పైగా అయోధ్య గురించి శైవులకు వైష్ణవులకు ఘర్షణలు కూడా జరిగాయి. ఇందులో ఎప్పుడూ బాబర్‌ సమస్య రానేలేదు.
అప్పట్లో అయోద్య అవధ్‌ రాజ్యంలో భాగంగా వుండేది.1819లో దాన్ని పాలనా వ్యవహారాల నిమిత్తం బ్రిటిష్‌ వారికి బదలాయించారు. బాబరీ మసీదును జామీ మసీదు అని, సీతారాసోరు మసీదు అని పిలిచేవారు. చాలా కాలం వరకూ అలాటి అభిప్రాయమే వుండేది కాదు. బ్రిటిష్‌ పాలకులు హిందూ ముస్లిముల మధ్య ఘర్షణలు పెట్టేందుకై అలాటి కథలు వదిలారు. విక్రమాదిత్యుడు కట్టించిన రామమందిరాన్ని బాబర్‌ సేనాని మీర్‌బక్సీ కూలగొట్టాడనే కథలు మొదలైనాయి. మొదటిసారిగా 1811లో ఒక బ్రిటిష్‌ రిపోర్టర్‌ దీనిపై వివాదం వుందని రాశారు. అయితే ఆ వాదనలు నిరాధారమని కూడా ఆయనే రాశారు.
1853-55లో మొదటి సారిగా అయోధ్యలో వివాద స్థలంపై హిందూ ముస్లిం ఘర్షణ జరిగింది. అక్కడ కొంత స్థలాన్ని ఆక్రమించుకున్న మహంతులు ఒక చబూత్రా నిర్మించారు.అవి కొనసాగుతూ వచ్చాయి.1949 డిసెంబరులో కొంతమంది రహస్యంగా చొరబడి రామలక్ష్మణుల విగ్రహాలు వుంచారు. నాటి ప్రధాని నెహ్రూ, హోం మంత్రి సర్దార్‌ పటేల్‌ వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు కాని అమలు కాలేదు. తర్వాత తాళాలు వేశారు.
1986లో రాజీవ్‌గాంధీ అవకాశవాదంతో వాటిని తెరిపించడమే దేశ రాజకీయాలలో ప్రమాదకరమైన మార్పులకు దారితీసింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో ఫైజాబాద్‌ జిల్లా సెషన్స్‌ జడ్డి కె.ఎం.పాండే ఇందుకు కారకుడైనాడు. ఇప్పటికే అక్కడ హిందువులు ఎంత పరిమితంగానైనా సరే పూజలు అంటూ చేసుకుంటూ వుంటే ఇంక దాన్ని తాళాలు తీసినంత మాత్రాన కొంపమునిగేదేముంటుంది అని ఆయన ప్రశ్నిస్తూ అందుకు ఉత్తర్వులిచ్చారు. ఈఉత్తర్వుపై యుపిలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కాని, కేంద్ర ప్రభుత్వం గాని ఎలాటి చర్యలు తీసుకోకపోగా వెంటనే అమలు జరిపించేశారు! ఇక అక్కడ నుంచి కథ మొదలైంది. తాళాలు తీయడంతో సంతృప్తి చెందని విహెచ్‌పి 1986లో సాధుసమ్మేళన్‌ జరిపి, రామజన్మభూమి ముక్తియజ్ఞ సమితి అంటూ స్థాపించింది. తర్వాత కాలంలో అద్వానీ నాయకత్వంలో బిజెపి దశలవారీగా దాన్ని రావణకాష్టంగా మార్చి చివరకు దుర్మార్గంగా కూలదోసింది.
దీనిపై దశాబ్దాల తరబడి సాగిన న్యాయ వివాదంలో ఎట్టకేలకు 2010లో లక్నో హైకోర్టు సెప్టెంబరు 30వ తేదీన ఇచ్చిన తీర్పు మతతత్వ ప్రధానమైన విశ్వాసాన్ని ధృవీకరించడం న్యాయ స్థానాలపై విశ్వాసాన్ని దెబ్బ తీసింది.. చరిత్రతో లౌకిక తత్వంతో ముడిపడిన సమస్యను హిందూ ముస్లిం సమస్యగా చేసి అందులోనూ హిందూత్వ శక్తుల కుటిల వాదనలవైపు మొగ్గు చూపడం ఇక్కడ స్పషyంగా కనిపించింది. వివాదాస్పద స్థలాన్ని మూడు ముక్కలు చేసినటుy కనిపిస్తున్నా రెండు ముక్కలు హిందూ సంస్థలకు ఒక ముక్క అంతకు ముందు స్వంతదారైన సున్నీ వక్ఫ్‌ బోర్డుకు కేటాయిస్తూ తీర్పు వెలువడింది. ఈ విభ’జన కూడా అసంపూర్ణంగా మార్పులు చేర్పులకు వీలుండేటుy ఉత్తర్వు చెబుతున్నది.60 ఏళ్ల వివాదంపై ఈ విధమైన తీర్పు వెలువడుతుందని వూహించిన న్యాయ నిపుణులు నివ్వెరపోయారు.ఇది పంచాయితీ చెప్పినట్లుందని విమర్శలు నిశితంగా వెలువడ్డాయి. ఈ కేసు విచారించిన ముగ్గురు న్యాయమూర్తులు- ఎస్‌.యు.ఖాన్‌,ఎస్‌.అగర్వాల్‌,డి.వి.శర్మ మూడు వేర్వేరు తీర్పులు ఇచ్చారు. సహజంగానే తర్వాత ఆ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. ఇందుకు సంబంధించిన పత్రాలన్నీ పరిశీలించాలంటే కనీసం పదేళ్లు పడుతుందని 2015 ఆగష్టులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈలోగా అక్కడ పూర్తిగా యథాతథ స్థితి పాటించాలనీ, భక్తులకు సదుపాయాలు మాత్రం కల్పించవచ్చునని చెప్పింది. అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం అలావుంటే ఆరెస్సెస్‌ అధినేతలూ సంఘ పరివార్‌ వీర శైవులూ వెనువెంటనే మందిరం కట్టేస్తామని చిందులు తొక్కడం మరోసారి న్యాయవ్యవస్థను ధిక్కరించడమే అవుతుంది. మత రాజకీయాల వల్ల గతంలో తమకు లాభం జరిగింది గనక మరోసారి ఆ పాచికనే ప్రయోగించాలనేది సంఘ పరివార్‌ ఏకైక వ్యూహం. అయితే అవార్డు వాపసీ గానీ, బీహార్‌ ఢిల్లీ గురజాత్‌ స్థానిక ఎన్నికల ఫలితాలు గాని అసహనంపై పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలు చూస్తే హిందూత్వ పాచిక పారడం అంత సులభం కాదని నమ్మకం కలుగుతుంది. అయితే చాపకింద నీరులా ప్రజల్లోనూ విద్యాధిక యువతలో వారు పెంచుతున్న మతతత్వ విషప్రచారాన్ని కుటిల రాజకీయ వ్యూహాలను సకాలంలో సమర్థంగా ఎదుర్కోవడం ప్రతి ప్రజాతంత్రవాదిపైన వున్న కర్తవ్యం. అప్పుడే లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకూ వ్యక్తిగత స్వేచ్చకు కూడా భద్రత వుంటుంది. లేకపోతే ప్రతి రంగంలోకి మతతత్వం చొరబడి పోతుంది. మైనార్టీ మతచాందసాన్ని లేదా కొందరి ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని కూడా ఖండించాలి. వ్యతిరేకించాలి. అయితే దాన్ని సాకుగా చూపి ఈ దేశం ఒకే మతానికి సంబంధించిందన్నట్టు ఆ మతం తమ పరివార్‌ ప్రబోధాలే ఆ మతమన్నట్టు చేసే ప్రచారాన్ని తోసిపుచ్చాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *