సంచలన సంపాదకుడు వినోద్
వినోద్ మెహతా మృతితో దేశం ఒక విభిన్న సంపాదకుణ్ని కోల్పోయింది. వాణిజ్య నమూనాను వదలకుండానే నూతనత్వాన్ని ప్రవేశపెట్టడానికి నాణ్యతను ప్రదర్శించడానికి ఆయన చాలా కృషి చేశారు. ఆయన రూపొందించిన కొన్ని పత్రికల పట్ల- ముఖ్యంగా డిబోనిర్ వంటి వాటి గురించి ఎవరికి ఎలాటి అభిప్రాయాలైనా వుండొచ్చు. కాని ఇండిపెండెంట్ అంతకు మించి ఔట్ లుక్ మ్యాగజైన్ జర్నలిజానికి కొత్త వరవడి పెట్టింది. నేటి కాలానికి తగినట్టు సుదీర్ఘం కాకుండా ముఖ్యాంశాలు పోకుండా తాజాగా అందించడంలో జయప్రదమైంది. మొత్తంపైన లౌకిక వాదానికి బాగా ఉపయోగపడింది. అంతకంటే కూడా నీరా రాడియా టేపులను వెల్లడించడంలో వినోద్ మెహతా గొప్ప సాహసం ప్రదర్శించారు. అనేక వత్తిళ్లు ఎదుర్కొన్నారు. తన స్నేహితులైన సంపాదకులు పాత్రికేయులు అడ్వర్టయిజర్టు కూడా దూరమైనారు. ఆ పత్రిక సంపాదక పదవి కూడా పోయింది. అయినా తల వంచలేదు. ఈ టేపులకు సంబంధించిన వాదోపవాదాలు సమర్థనలు పరిణామాలు గమనిస్తే మీడియా స్వేచ్చ అన్నది కార్పొరేట్లు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు అర్థమవుతుంది. బర్ఖాదత్ కొంతైనా సమర్థించుకునే ప్రయత్నం చేశారు గాని ప్రముఖ సంపాదకుడైన వీర్ సంఘ్వీ మాత్రం అది కూడా చేయలేక సాంకేతికంగా అవన్నీ నకిలీ టేపులనే వాదనకే పరిమితమైనారు.టాటాల నుంచి అంబానీల వరకూ అందరినీ కుదిపేసిన నీరా రాడియా ఉదంతం నిస్సందేహంగా క్రోనీ క్యాపిటలిజంలో మీడియా పాత్రకు సరైన ఉదాహరణగా నిలిచిపోయింది.. ఆయన తన కుక్క పిల్లకు ఎడిటర్ అని పేరు పెట్టుకున్నాడు. సంపాదకుడు వాచ్ డాగ్‌లా పని చేయాలని చెప్పే సంకేతం అందులో వుంది.ఇతర లోపాలు ఏమున్నా ఈ కారణంగా వినోద్ మెహతాను తప్పక గుర్తుంచుకోవాలి. వ్యక్తిగానూ ఆయన రచనా శైలి, అధ్యయనం, పాత్రికేయ ప్రమాణాలు చెప్పుకోదగినవిగా కనిపిస్తాయి