సంచలన చిత్ర వజ్రోత్సవం రోజులు మారాయి
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నో ఈ పాట వినని తెలుగు వారెవరు? వుండరు. అచ్చమైన గ్రామీణ జీవితానికి అద్దం పట్టే ఆ పాట జానపద నృత్యం అరవయ్యేళ్ల కిందట అటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇటు హైదరాబాదునూ కూడా ఉర్రూతలూపాయి. తెలుగు జాతికీ సినిమాకు రోజులు మారాయి అని చాటి చెప్పాయి. అరవయ్యేళ్లకిందటి ఆ అపురూప చిత్రం పేరూ అదే. నిజానికి అది కేవలం సినిమా పేరు కాదు. ఆనాటి అభ్యుదయ ఉద్యమాల జోరు, ప్రజా కళల హుషారు. 1955లో విడుదలై విజయ దుందుభి మోగించిన రోజులు మారాయి చిత్రం వజ్రోత్సవ సందర్భమిది.
ప్రజా నాట్యమండలి నుంచి ప్రభవించి ప్రజా ఉద్యమాలతో పెనవేసుకుపోయిన కళాకారులు ఔత్సాహికులు అభిరుచి గల నిర్మాణ సారథులతో కలసి రూపొందించిన ఆల్ టైమ్ హిట్ రోజులు మారాయి. సామాజిక చైతన్యం చాటే చిత్రాలకు విజయం వుండదన్నట్టు విపరీత వాదనలు చేసే వారికి నాటికి నేటికీ తిరుగులేని సమాధానం చెప్పిన సినిమా. పల్లె కథలకూ కళలకూ వెండితెర యోగం పట్టించిన సినిమా.
నేపథ్యం…
రోజులు మారాయి లోకి వెళ్లేముందు ఒకింత ఫ్లాష్ బాక్.. లేదా బాక్ ఫ్లాష్.. ఏమంటే అదీ అత్యంత రసవంతమే. మహా దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం నలభైలలోనే మాలపిల్ల, రైతుబిడ్డ, ఇల్లాలు,గృహలక్ష్మి వంటి చిత్రాలు తీసి ప్రజల మహిళల సమస్యలను తెర కెక్కిం చిన ఘనుడు. ఇక యువ మిత్ర ద్వయం సి.వి.ఆర్.కె.ప్రసాద్, ఎస్.వి.నర్సయ్యలు. కమ్యూనిస్టు ఉద్యమంతో చిరకాల సంబంధం గల యువ సాంకేతిక నిపుణులు. వీరికి దన్నుగా నిలిచిన వ్యక్తి చల్లపల్లి రాజా సోదరుడైన యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్. మాలపిల్ల,రైతు బిడ్డల వెనకవున్నది కూడా ఈయనే. కొంతకాలం ఈయన కమ్యూనిస్టు నేతలకు దగ్గరగా వుండేవారు.(తర్వాత కాంగ్రెస్ మంత్రిగా చనిపోయారు) సారథీ పిక్చర్స్ (ప్రై) లిమిటెడ్ స్థాపించి తొలి ప్రయత్నంగా తాపీ ధర్మారావు కుమారుడైన తాపీ చాణక్య దర్శకత్వంలో ‘అంతా మనవాళ్లే’ చిత్రం తీశారు. ఈ చిత్రంలో నాగభూషణం, వల్లం నరసింహరావు, కృష్ణకుమారి తదితరులు నటించారు. మాష్టర్ వేణు సంగీతం సమకూర్చారు. అభ్యుదయ భావాలతో తీసి అభినందనలు పొందినా ఆర్థికంగా పెద్ద విజయం సాధించలేకపోయింది. అయితే ఆ చిత్రం తీసిన ప్రజా కళాకారులు అనేక పాఠాలు నేర్చుకోగలిగారు. లోపాలన్ని సరిచేసుకుని సంధించిన పాశుపతాస్త్రం ‘రోజులు మారాయి’ సంచలనం కలిగించింది. అక్కినేని నాగేశ్వరరావు 43వ చిత్రం కాగా షాహుకారు తర్వాత విజయాలు లేని జానకికి మళ్లీ పేరు తెచ్చింది. పెరుమాళ్లు, రేలంగి, సిఎస్‌ఆర్, రమాణారెడ్డి.హేమలత వంటి పలువురు ఉత్తమ నటులకు మంచి ప్రసిద్ధి కల్పించింది. కేవలం ఏరువాకా సాగారో అనే ఒకే ఒక్క పాటకు చేసిన నృత్యంతో వ హీదా రెహమాన్ అఖిల భారత తారాపథంలోకి దూసుకుపోగలిగింది.
పల్లెల్లో యువజనసంఘాలు, పెత్తందార్లపై పోరాటాలు, బాల్య వివాహాలు మూఢనమ్మకాల నిరసన రైతు ఉద్యమాలు వంటివాటిని ఈ చిత్రం అత్యంత సజీవంగా చూపించింది. భూస్వామి సాగరయ్య(సిఎస్‌ఆర్) అధిక ఉత్పత్తి చేస్తానని ప్రభుత్వం దగ్గర 200 ఎకరాలు తీసుకుని అక్రమంగా కౌలుకు ఇస్తాడు. మధ్యతరగతి రైతు(పెరుమాళ్లు)ను మోసం చేసి అతని పంటలో సగం కబళిస్తాడు. కరణం సాంబయ్య(రమణారెడ్డి) గూండా పోలారు (రేలంగి) సహాయంతో ఇంకా ఎన్నో అక్రమాలు చేస్తుంటే యువజన నాయకుడు వేణు(అక్కినేని) ప్రతిఘటిస్తాడు. చెల్లెలు(అమ్మాజీ-జయచిత్ర తల్లి)ను వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే అడ్డుకుని గోపాలం(వల్లం)తో వివాహం జరిపిస్తాడు. తను స్వయంగా వూరు వెలివేసిన అమ్మాయిని(జానకి) చేసుకుని ఆదర్శంగా నిలుస్తాడు. రైతు మనస్తత్వం జీర్ణించుకుపోయిన తండ్రి వీటన్నిటినీ విమర్శిస్తున్నా చైతన్యవంతురాలైన తల్లి(హేమలత) పరోక్షంగా ప్రోత్సాహమిస్తుంటుంది. యువజనుల చైతన్యాన్ని తట్టుకోలేని సాగరయ్య కుట్రలను చివరకు అరికట్టడం , బంజర్లు ఆక్రమించడం కథాంశం.
తర్వాత చిత్రాలకు ఇది ఒక వరవడిగా రచన చేసిన వ్యక్తి కొండేపూడి లక్ష్మీనారాయణ. ప్రతి సన్నివేశంలోనూ సంభాషణలోనూ గ్రామీణ వాతావరణం తొణకిసలాడుతుంది. మాటంటే మాటే షూటంటే షూటే వంటి మేనరిజాలను కూడా ఆ రోజుల్లో బాగా పాపులర్ చేశాడు. స్వతహాగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అక్కినేని నటన పల్లెజనాలను బాగా ఆకట్టుకుంది. రోజులు మారాయి తర్వాతి దశలో అక్కినేని ప్రధానంగా కుటుంబ కథా చిత్రాలు ప్రేమకథల్లో నటించారు. పౌరాణికాల్లో వలెనే ప్రజా నాయకుడుగా ఎన్టీఆర్‌కు ఎక్కువ రాణింపు వుంటుందనే భావన అందుకు ఒక కారణమైంది.( తర్వాత కాలంలో కృష్ణ శోభన్ బాబు వంటివారి మధ్యన కూడా ఈ తేడా చూస్తాం.) అయితే దసరా బుల్లోడు దత్త పుత్రుడు వంటి చిత్రాలకు పునాది ఇదే.
అయితే ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఈ చిత్రంలో టాప్ స్కోర్ వహీదాదే. వహీదాను ఈ పాటకోసమే ఏరికోరి నుంచి వెతికి తెచ్చారు. ఎవరో ఇచ్చిన సమాచారంతో అప్పటి రాజమండ్రి కమిషనర్ కుమార్తెలు వహీదా షహాదాలను పరీక్షించి ఈమెను ఎంపిక చేశారు. ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నో అనే డప్పుల పాట, దానికి ఆమె హుషారైన నాట్యం ఎవర్ గ్రీన్‌గా నిల్చిపోయాయి. ఈ పాట కాగానే రెండోసారి మూడోసారి వచ్చిన జనాలు(రిపీట్ ఆడియన్స్) హాల్లోంచి లేచిపోయే వారట. మాష్టర్ వేణు ఈ రెండో చిత్రంతో అగ్రశ్రేణి సంగీత దర్శకుడైపోయాడు. రోజులు మారాయి తమిళంలో ‘కాలం పోరాచ్చి’ పేర అనువాదం చేసినప్పుడు కూడా ఈ పాట ఇంతే హిట్ అయింది. పైగా అయిదు సినిమాల్లోఅలాటి పాటలే పెట్టుకున్నారు. బాలివుడ్ సంగీతబ్రహ్మ ఎస్‌డిబర్మన్ ‘బొంబాయి కా బాబు’ చిత్రంలో ‘దేఖ్‌సేజీ బోలోరో చిన్నన్నో’అంటూ పూర్తిగా ఆ బాణీని దింపేశాడు. చిన్నన్నకు తెలుగు పదం దొరకలేదట!
1955 ఏప్రిల్ 14న విడుదలైన రోజులు మారాయి 17 కేంద్రాలలో శతదినోత్సవాలు అనేక చోట్ల రజతోత్సవాలు చూసింది. హైదరాబాదులో రజతోత్సవం జరుపుకొన్న మొదటి తెలుగు సినిమాగా తర్వాత పరిశ్రమ తరలి రావడానికి కారణమైంది. ఆ సభలో తెలంగాణ నేత కె.వి.రంగారెడ్డి తెలుగు సినిమా నిర్మాణం ప్రారంభించాలని కోరడంతో యార్లగడ్డ ప్రసాద్ 1957లో సారథి స్టుడియో నిర్మించారు. ఈచిత్రంతో ముడిపడిన వారంతా తర్వాత మహామహులుగా ఎదిగారు. అప్పటి ఎడిటర్ తిలక్ దర్శక నిర్మాతగా మారారు. నిర్మాణ వ్యవహారాలు చూసిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. స్టిల్స్ తీసిన గంగాధర్ నవశక్తి ఫిలింస్ స్థాపించి మా ఇంటి మహాలక్ష్మితో మొదలు పెట్టి చాలా చిత్రాలు తీశారు. రిట్జ్ హౌటల్‌లో చిత్ర విజయోత్సవాలలో వహీదాను చూసిన గురుదత్ ముగ్ధుడై పోయి తన ప్యాసా తదితర చిత్రాలలో ఎన్నొ గొప్ప పాత్రలనిచ్చారు. సారథి స్టుడియో తొలి మేనేజర్ ఇప్పుడు ప్రగతి ప్రింటర్స్ పరుచూరి హనుమంతరావు.1947లో పుచ్చలపల్లి సుందరయ్య ప్రోత్సాహంతో నవయుగ ఫిలింస్ స్థాపించి పంపిణీ వ్యాపారం చేస్తున్న కాట్రగడ్డ శ్రీనివాసరావు రోజులు మారాయి నుంచి సారథి సంస్థలో ప్రవేశించి 1969 నాటికి దాని అధినేత అయ్యారు. సికిందరాబాదులో పంపిణీ సంస్థలు వెలశాయి. ఈ విధంగా చిత్ర విజయం నిజంగానే రోజులు మారడానికి కారణమైంది.
రాజకీయ ప్రభావం
ఇక్కడ ఒకసారి రాజకీయ రంగంలోకి వెళితే.. ఈ చిత్రం విడుదలకు ముందే 1955 ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అఖండ విజయం సాధిస్తుందనుకున్న కమ్యూనిస్టుపార్టీ 15 స్థానాలకు పరిమితం కాగా కాంగ్రెస్ కూటమి 146 స్థానాలతో అధికారం కైవశం చేసుకుంది.అయితే ఓడిపోయినా కమ్యూనిస్టులకు 35 శాతంపైగా ఓట్టు వచ్చాయి. ఆ సందర్బంలో కమ్యూనిస్టు భావాలు గల వారు తీసిన చిత్రం ఇంత గొప్ప విజయం సాధించడం అభ్యుదయ వాదులకు నూతనోత్సాహమిచ్చింది. ప్రజల్లో వారు పెనవేసుకున్న తీరును చెప్పింది. ఈ చిత్రంతో సంబంధం వున్నవారిలో అత్యధికులు చివరి వరకూ కమ్యూనిస్టు అభిమానులుగానే వున్నారు. కథ కథనాలతో ఇప్పుడు చూసినా కట్టిపడేసే చిత్రం రోజులు మారాయి.