పరివార్ ద్వంద్వ నీతి
ఉత్తర ప్రదేశ్‌లోని దాద్రిలో గొడ్డుమాంసం సాకుగా చూపి ముస్లింకుటుంబంపై దాడి చేసి దారుణంగా చంపిన ఘటనను ఖండించకుండా ప్రధాని మౌ నరేంద్ర మోడీ పేరు సార్థకం చేసుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తావించిన తర్వాత దాన్ని పునరుద్ఘాటించడం ఉభయ మతాల వారికి సూక్తులు చెప్పడం తప్ప జరిగింది సూటిగా ఖండించ లేకపోయారు. ఇక ఇప్పుడు దీనిపై నానా రభస చేసిన బిజెపి ఎంఎల్‌ఎ సంగీత సోమ్ స్వయంగా గొడ్డు మాంసం ఎగుమతి సంస్థ నడిపిస్తున్నారని తేలింది. అందులో ముస్లింలు కూడా భాగస్వాములుగా వున్నారు. సంఘ పరివార్ చాటున చేరిన వారి ద్వంద్వ నీతి ఏమిటో దీంతోనే తేలిపోతున్నది. అయినా బిజెపి ఆయనపై చర్య తీసుకోకుండా వివరణ ఇచ్చుకునే బాధ్యత ఆయనకే వదలివేస్తున్నామని తప్పుకోవడం హాస్యాస్పదం.
గొడ్డు మాంసం విషయానికి వస్తే భారతంలో రంతి దేవుడు రోజుకు రెండు వేల పశువులను వధించినట్టు వుంది. యాజ్ఞవల్క్యుడనే రుషికి మెత్తటి గోమాంసం ఇష్టమని పురాణగాధ. ఇంద్రుడికి ఎద్దుమాంసం ఇష్టమనీ, అగ్ని దేవుడికి గుర్రాలు ఆవులు ఎద్దులు కూడా ఇష్టమని వేదాలు చెబుతున్నాయి. తైత్తరీయ బ్రాహ్మణకం కూడా ఆవు మాంసం అన్నమనే అంటున్నది. మనువు కూడా ఒంటెను చంపకూడదని రాశాడు గాని ఆవు సంగతి చెప్పలేదు. 18వ శతాబ్దంలో తంజావూరును పాలించిన ఘనశ్యాముడు కూడా ఆవు మాంసం తినడం గురించే రాశాడు. 19వ శతాబ్డంలో స్వామి దయానంద సరస్వతి వచ్చే వరకూ గోవధ నిషేదం అన్నది ప్రధాన చర్చగా లేదు. ఎవరు ఏం తింటారనేది వారి ఇష్టం తప్ప బయిటవారి శాసించడం ప్రజాస్వామ్యం కాదు, రాజ్యాంగ బద్దమూ కాదు. రాజ్యాంగం కరువుల సమయంలో పాడి పశువులను వధించరాదని చెబుతున్నదే గాని హిందూత్వ శక్తులు హడావుడి చేస్తున్నట్టు గోపూజ కోణంలో కాదు. ఏమైనా గోవధ తప్పన్నప్పుడు మానవ మేధం మరింత ఘోరం కదా! అయినా మన ప్రధాని ఖండించరు. తమ వాళ్లను దండించరు.