నేతాజీ ఫైళ్లుా నిరాధార కథనాల హడావుడి
నేతాజీ సుభాస్ చంద్రబోస్ ప్రమాద మరణంపై విభిన్న కథనాలకు సంబంధించిన 64 రహస్య ఫైళ్లను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విడుదల చేశారు. రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో తనకు ఉపయోగపడుతుందనే అంచనాతోనే ఆమె ఈ చర్య తీసుకున్నట్టు మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా అదే విమర్శ చేశాయి. బెంగాలీలు నేతాజీని ఎంతగానో ప్రేమిస్తారు గనక వారి మనోభావాలు చూరగొనేందుకు దీదీ వేసిన తెలివైన ఎత్తుగడగామ పత్రికలు అభివర్ణించాయి. అయితే ఆ ఫైళ్లలో కొత్తగా బయిటపడిన విషయాలు ఏమీ లేవని కూడా దాదాపు అందరూ అభిప్రాయం వెలిబుచ్చారు. నేతాజీ బతికే వున్నాడన్న సందేహాన్ని వ్యక్తం చేసే బంధువుల లేఖలు , అమెరికా బ్రిటన్ గూఢచారి సంస్థలు అనుమానాలు మాత్రమే ఈ ఫైళ్లలో వున్నాయి. అయితే ఇక స్వతంత్ర భారత దేశపు తొలిప్రభుత్వమైన నెహ్రూ సర్కారు నేతాజీ కుటుంబంపై నిఘా తీవ్రస్థాయిలోనే సాగించినట్టు నిరూపించే ఆధారాలను ఈ ఫైళ్లు బయిటపెట్టాయి. అందువల్ల ఈ ఫైళ్ల విడుదల హడావుడితోపోలిస్తే ఫలితాలు పెద్దగా కనిపించవు. ఈ పైళ్లను చూసిన తర్వాత కూడా నేతాజీ ప్రమాదంలో మరణించలేదని చెప్పడానికి ఎలాటి ఆధారాలు దొరకలేదని తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపి అయిన నేతాజీ మేనకోడలు కృష్ణబోస్ వ్యాఖ్యానించారు. ప్రమాద వార్తల తర్వాత కూడా ఆయన బతికి వున్నాడని చెప్పే ఆధారాలు ఏవైనా చూపిస్తే అప్పుడు నమ్ముతానని ఆమె అన్నారు. వాస్తవానికి బతికి వున్నాడని అనుకున్నవారి లేఖలు కథనాలు మాత్రమే ఇందులో వున్నాయి తప్ప అందుకు ఆధారాలు లేనేలేవు. బ్యాంకాక్‌నుంచి ఒక ప్రసార వ్యవస్థలో మాట్లాడాడని కొందరు రాస్తే – పెకింగ్ రేడియో నుంచి రోజూ నేతాజీ మాట్లాడతాడని సాయింత్రం ఒక వాక్యం వినిపించేదని ఆయన బంధువు శిశిర్ బోస్ అప్పట్లో చెప్పారు.1949లో బ్లిట్జ్ పత్రిక ఆయన బతికేవున్నట్టు అనుమానం వెలిబుచ్చుతూ ప్రచురించిన కథనం మరొకటి. నిజానికి బ్లిట్స్ ఆ నాటికి చాలా నిరాధార సంచలనాలకు పెట్టింది పేరు. తనకు నిర్దిష్టమైన ఆధారాలేమీ దొరకలేదని కూడా బ్లిట్జ్ నివేదికలోవుంది. కనుక మొత్తంపైన ఇవన్నీ కథనాలు వూహాగానాలే. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇదమిద్దంగా ఫలానా వారు ఆయనను చూసినట్టు లేదా ఫలానా చోట వున్నట్టు చెప్పేవి కావు. కనుకనే 12 వేల పేజీలకు పైగా వున్న 64 ఫైళ్లను విడుదల చేసిన తర్వాత కూడా నూతన సమాచారం పెద్దగా బయిటకు రాలేదన్నది పరిశీలకుల అభిప్రాయం. నెహ్రూ ప్రభుత్వం గూఢచర్యం చేయడం తప్పనిసరిగా అభ్యంతరకరం గనక దాన్ని గురించి మరింత విచారణ జరపవచ్చు. ఒకవేళ నేతాజీ గురించిన సమాచారం కోసమే నిఘా వేయాలని ఆ ప్రభుత్వం భావించిందని అనుకున్నా వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.