చరిత్రగా మారిన చిత్రకారుడు

 

ప్లాబో పికాసో ఈ పేరు తల్చుకోగానే ఆధునిక చిత్రకళ కళ్లముందు నిలిచినట్టవుతుంది. సామాన్యుడికి స్పష్టాస్పష్టమైన రంగు రంగుల చిత్రాలు అలా అలా తిరిగిపోతుంటాయి. వందల కోట్ల విలువైన బొమ్మల అమ్మకాల వార్తలు గుర్తుకు వస్తాయి. ఆధునిక జీవనరీతికి ప్రతీకగా మిగిలిన ఒక అంతర్జాతీయ కళాకారుడు సాక్షాత్కరిస్తాడు. ఎందుకంటే చిత్రకళా చరిత్రలో పికాసో ఒక అధ్యాయం అంటే చాలదు- ఆయనే ఒక చరిత్ర. కొత్త చరిత్రకు నాంది.

నేను సైనికుడినైతే సైన్యాధిపతినవుతాననీ, మతాధికారినైతే పోప్‌గా ఎదుగుతానని మా అమ్మ అంటుండేది. అయితే నేను బొమ్మలు గీయడం మొదలు పెట్టి పికాసోగా మిగిలాను అంటుండేవాడాయన.ఆయన పేరు చాంతాడంత పొడవుంటుంది. తండ్రి బ్యాస్‌ రిజు బ్యాగో కూడా చిత్రకారుడు, చిత్రకళా ఉపాధ్యాయుడు. పికాసో పుట్టినప్పుడు మామూలుగా ఏడవకుండా పిజ్‌ పిజ్‌ అన్నాడంటారు. స్పానిష్‌ భాషలో పెన్సిల్‌ను లాపిజ్‌ అంటారు. ఇది కథే కావచ్చు గాని పికాసో స్వభావాన్ని చెబుతుంది. అతనిలోని తపనను గమనించిన తండ్రి కూడా బాల్యంలోనే శిక్షణ ఇచ్చాడు. 13వ ఏడు వచ్చే సరికి అతను నాన్నను మించిపోయాడు. సరిగ్గా చదువుకోలేదు గాని అన్నిటినీ లోతుగా పరిశీలిస్తూ గీస్తూ వుండేవాడు. బాగా చదవడం లేదని ఆనాటిపద్ధతుల ప్రకారం ఒక ఒంటరి గదిలో పెడితే అక్కడ వున్న తెల్లటి గోడలను కాన్వాసుగా చేసుకున్నాడు. తర్వాత చిత్రకళాశాలలోనే చేరాడు గాని ఆ నియమ నిబంధనలు వగైరాల మధ్య అతనికి వూపిరాడలేదు. 1899లో ప్రతిష్టాత్మకమైన రాయల్‌ ఎకాడమీలో చేరాడు. కళతో పాటు అభ్యుదయ భావాలూ వంటపట్టించుకున్నాడు. అరాచకవాదుల ప్రభావం కూడా కొంత పడింది. ఇన్నిటి మధ్యనా అతని చిత్రకళ కొత్తపుంతలు తొక్కుతూనే వుంది. స్పెయిన్‌ నుంచి ఆయన పారిస్‌ వెళ్లాడు.
పికాసో చిత్రాలను రెండు దశలుగా విభజించారు. ఒకటి 1901-04 మద్య కాలపు నీలి దశ(బ్లూ పీరియడ్‌) ఈ దశలో గీసిన చిత్రాలు జీవితంలో దైన్యాన్ని విషాదాన్ని చిత్రిస్తాయి. నిరాశనూ వైముఖ్యాన్ని కనపర్చేలా వుంటాయి. నీలిరంగును అందుకు ప్రతీకగా తీసుకుని అన్ని చిత్రాల్లోనూ దాన్నే అధికంగా వాడాడు.1904-1906 మధ్య కాలం ‘గులాబిదశ’.
1907లో వేసిన ఫైవ్‌ న్యూడ్స్‌ చిత్రం ఒక సంచలనమైంది. దానిపేరు లే డెమిసిల్లిస్‌ డి ఆవగాన్‌. అయిదుగురు వేశ్యలను తనదైన శైలిలో చిత్రించి వారి మొహాలకు బదులు ఆయన మాస్కులు పెట్టాడు. వారి శరీరాలను కూడా ప్రత్యేక తరహాలో చూపించాడు. నిజానికి పికాసో మొదటి దశలో బ్లూన్యూడ్‌, తర్వాత టూ న్యూడ్స్‌ అనే పేరిట నగ శరీరాలను చిత్రిస్తూ వచ్చాడు. ఫైవ్‌న్యూడ్స్‌ చిత్రం పేరు లెస్‌ డెమోసెల్స్‌… అంటూ సాగుతుంది.
1918-27 మధ్య కాలాన్ని ప్రామాణిక దశ అని పిలుస్తుంటారు. పికాసో తన చిత్రకళలో క్యూబిజం అనే నూతన పద్ధతిని తీసుకుని వచ్చి సంప్రదాయ పద్ధతులను అధిగమించాడు. మొత్తం చిత్రం ఏకఖండంగా గాక అనేక ఘనాలుగా ఖండాలుగా వేయడం, రంగులను అనేక విధాల ఉపయోగించడం ఇందులో ప్రత్యేకత. దీనివల్ల బొమ్మ కళ్లకు కట్టడమే గాక దానితో ముడిపడిన ఘర్షణ, చూసే వారి భావ కంపనం కూడా చిత్రించినట్టవుతుంది. కొద్ది కాలంలోనే క్యూబిజం ఒక నూతన వరవడిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కాలంలో ఆయన సింథటిక్‌ క్యూబిజం అని దాన్ని మరి కొంత మెరుగుపర్చారు.

వాస్తవానికి ప్రపంచం పికాసోను అధికంగా గుర్తు పెట్టుకోవడానికి కారణమైన దశ ఆ తర్వాత ప్రారంభమైంది. ఫాసిజానికి స్పెయిన్‌లో అంతర్యుద్ధానికి వ్యతిరేకంగా పికాసో అగ్రభాగాన నిలిచాడు. కమ్యూనిస్టులతో శాంతి కాముకలతో కలసి నడిచాడు. స్పెయిన్‌ నియంత ఫ్రాంకో కుమ్మక్కుతో హిట్లర్‌ సైన్యాలు గుయెర్నికా అన్న పట్టణంపై బాంబులతో దాడి చేసి 1800 మందికి పైగా మరణించడానికి అనేక అఘాయిత్యాలకు కారకులయ్యారు. దాన్నే అతి పెద్ద కాన్వాసు మీద పికాసో గుయోర్నికా చిత్రంగా గీశాడు. ఇప్పటికి అదే ఫాసిస్టు వ్యతిరేకతను ప్రతీకగా మిగిలిపోయింది. ఈ చిత్రంలో పికాసో ఫాసిస్టులను ఎద్దులుగానూ వారిపై పోరాడే ప్రజలను గుర్రాలుగానూ చిత్రించారు. ఆ అమానుషానికి, మహిళలపై జరిగిన అనేక అత్యాచారాలకు సూచనగా తెగిపడిన అవయవాలు, ఖండిత శిరస్సులు చూపించాడు అలాగే ప్రపంచ శాంతికి చిహ్నంగా పావురం గుర్తును ప్రవేశపెట్టింది కూడా పికాసోనే.1944లో ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీలో చేరిన పికాసో చివరి వరకూ చాలా శ్రద్దగా సభ్యత్వాన్ని పునరుద్ధరించుకునేవాడు. దాహార్తి నీటి చెలిమ దగ్గరకు వెళ్లినట్టు నేను పార్టీ సభ్యత్వం కోసం వెళతాను అనేవాడు.
పికాసో జీవితంలో చాలా మంది మహిళల పేర్లు వినిపిస్తాయి గాని వారిలో మొదట డోరా మొరాతో ఆయన దీర్గకాలం వున్నారు. రెండవ ప్రపంచ యుద్ద కాలంలో తన 61వ ఏట 21 ఏళ్ల ఫ్రాన్సిస్‌ బిలోతతో కలసి జీవించారు. తన 93 వ ఏట ఆమె లైఫ్‌ విత్‌ పికాసో అనే పుస్తకం రాశారు.
పికాసో 1973 ఏప్రిల్‌ 8న కన్నుమూశారు. కాని ఆయన చిత్రాలు ఇప్పటికి వేల కోట్ల ఖరీదుకు అమ్ముడవుతుంటాయి. పారిస్‌లో ఆయన గీసిన 500 చిత్రాలతోనే ప్రత్యేకంగా ఒక మ్యూజియం వుంది. చిత్రకళాభిమానులు దాన్ని ఎంతో ఆరాధనగా సందర్శిస్తుంటారు. ప్రతిభ ఎంత వున్నా ప్రయోగాలు ఎన్ని చేసినా ప్రజా ఉద్యమాలతో చివరి వరకూ మమేకం కావడం పికాసో గొప్పతనం. అందుకు ఆయన చిరస్మరణీయుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *