సిబిఐ రచ్చలో టిడిపికి శృంగభంగం


ఏదో ఒక కృత్రిమ వివాదం లేదా ఆర్బాటం సృష్టించి రాష్ట్ర ప్రజల దృష్టినీ రాజకీయ చర్చలనూ దారి మళ్లించడం ఇటీవలి కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.ప్రజాగ్రహ ఫలితంగా ఆఖరి నిముషంలో ఎన్‌డిఎ నుంచి నిష్క్రమించిన తెలుగుదేశం నాయకత్వం ఇలా రోజుకో తతంగం నడుపుతూ మోడీని మోసిన గతాన్ని మరపించేందుకు తంటాలు పడుతున్నది. తాము కేంద్రంపై వీరోచిత పోరాటం చేయడమే గాక దేశమంతటా కూడా అలాటి వే దిక రూపొందిస్తున్నట్టు హడావుడి చేస్తున్నది. మోడీని ఢకొీనే సత్తా వున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడేనన్న కక్షతోనే తమపై కేంద్రం దాడులు చేస్తున్నదని టిడిపి వాదన. ఇటీవల ఆ పార్టీకి చెందిన వారు, మరికొందరు ఇతరులపై కూడా ఐటి , ఇడి దాడులు చేయడం కక్ష సాధింపేనని ఆరోపిస్తున్నది. ఆ సమయంలో ఇష్టాగోష్టిగా మాట్లాడుతే ఐటి అధికారులకు పోలీసు భద్రత ఇవ్వకుండా చేద్దామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు నిజంగానే సిబిఐ విషయంలో ఆ తరహా చర్యనే తీసుకున్నారు.అవినీతి అక్రమాల పై దర్యాప్తు చేసేందుకు వీలుగా సిబిఐ అధికారులు రాష్ట్రంలో ఎప్పుడైనా ప్రవేశించే విధంగా జారీ అనుమతి ఉపసంహరించుకున్నారు.
ఉపసంహరణలో ఉద్దేశం?
సిబిఐ ఏదైనా రాష్ట్రంలో దర్యాప్తు చేయాలంటే కేసు స్వభావాని బట్టి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరుతుంటుంది. ఇలా ఎప్పటికప్పుడు అనుమతించే అవసరం లేకుండా సార్వత్రిక అనుమతినిచ్చే పద్ధతినే ఎపితో సహా అత్యధిక రాష్ట్రాలు పాటిస్తున్నాయి. ఈ అనుమతిని ఏటేటా పునరుద్ధరించడం రివాజు. ఈ మేరకు 2018 ఆగష్టు3న ఎపి హోం శాఖ జీవో 109 ద్వాకా ఆ అనుమతిని పునరుద్ధరించింది కూడా. కాని రాష్ట్ర హొం శాఖ కార్యదర్శి ఎ.ఆర్‌.అనురాధ నవంబరు8న ఆ అనుమతిని రద్దు చేస్తూ జీవో176 విడుదల చేశారు. ఈ సమాచారం వారం ఆలస్యంగా 16వ తేదీన మీడియాలో విడుదలై విస్త్రత చర్చకు దారితీసింది. సిబిఐకి నో ఎంట్రీ, సిబిఐకి ఎర్రజండా అనీ పత్రికలు శీర్షికలిస్తే ఛానళ్లు కూడా ఆ ప్రకారమే చర్చలు నడిపాయి. కేంద్రంపైన చంద్రబాబు చేస్తున్న పోరాటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనుకూల వర్గాలు కీర్తించాయి. అధికార పార్టీ ప్రతినిధులు చర్చలలో చెలరేగిపోయారు. కాంగ్రెసేతర ప్రతిపక్షాలేమో తీవ్రంగా ఖండించాయి. ఇటీవల తనపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని సిబిఐ లేదా మరేదైనా మధ్యస్థసంస్థతో(థర్డ్‌పార్టీ) దర్యాప్తు చేయించాలంటూ ప్రతిపక్ష నేత జగన్‌ హైకోర్టులో కేసు వేశారు గనకే ప్రభుత్వం ఆందోళనతో ఈ ఉత్తర్వు నిచ్చిందని వైసీపీ విమర్శించింది. రాజకీయ వైరం కారణంగా కేంద్రం చంద్రబాబుతో సహ ప్రభుత్వ పెద్దలపై ఏవైనా తీవ్ర చర్యలు గాలింపులు చేపట్టవచ్చుననే ఆందోళన ఇందుకు దారితీసిందని ఇంకొందరు భావించారు. దేశంలో రాజ్యాంగ బద్దంగా పనిచేస్తున్న సంస్థల రాకను అడ్డుకోవడం సరికాదని వామపక్ష నేతలు చెప్పారు. సిబిఐ మాజీ జెడి వివి.లక్ష్మీనారాయణతో సహా చాలా మంది నిపుణులు, విశ్లేషకులు కూడా ఇది సరికాదని ప్రకటించారు. ఇది నిజానిక కొన్ని సందర్భాల్లో ి సిబిఐని ఏ రాష్ట్రం అడ్డుకోజాలదని కూడా మాలాటి వాళ్లం స్ప్షష్టంగా చెప్పాం. అయినా ఏదో సిబిఐని అడ్డుకుని ఘనకార్యం చేసినట్టు మీడియామోతమోగించింది. చివరకు వెనక్కు తగ్గిన ప్రభుత్వ ప్రతినిధి తాము సార్వత్రిక అనుమతిని రద్దు చేశామేగాని మొత్తంగా ప్రవేశాన్ని అడ్డుకోలేదని వివరణ ఇచ్చి బయిటపడ్డారు, అసాధ్యమైంది చేసినట్టు అవాస్తవ ప్రచారం చేసుకుని ఆలస్యంగా వివరణ ఇవ్వడం హాస్యాస్పదం. అది మందే తెలిసినా ఎందుకు సిబిఐని అడ్డుకున్నట్టు బిల్డప్‌ ఇచ్చారు? ీ ఒకటే సమాధానం – కపట రాజకీయం! సిబిఐని మొత్తంగా నిషేదించలేమనీ, నిషేదించలేదని తెలిసి కూడా ఏదో ఘనకార్యం చేసినట్టు ఒక రోజు మొత్తం తినేశారన్నమాట. ఈ లోగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమత్రి మమతా బెనర్జీ కూడా అభినందించినట్టు పంజాబ్‌, ఢిల్లీ కూడా ఈ విధంగానే ఆలోచిస్తున్నట్టు కథణాలు వచ్చాయి. కేంద్రం పెత్తనంపైన పోరాడటమంటే జాతీయ సంస్థల విధినిర్వహణకు అడ్డు పడటం కాదు, దేశమంతా కొన్ని సంస్థలు పనిచేయవలసిన అవసరాన్ని చూడకపోవడమూ కాదు. గతంలో రాష్ట్రాల కోసం పోరాడిన జ్యోతిబాసు, ఎన్టీఆర్‌, రామకృష్ణహెగ్డే, కరుణానిధి వంటివారెవరూ ఈ పనిచేసింది లేదు.
అవతరణ, అపశ్రుతులూ!
ఇంతకూ సిబిఐ విషయంలో ప్రభుత్వ నిర్ణయం పూర్పావరాలేమిటి? యుద్ధకాలంలో అవినితి లంచగొండితనం వంటి కేసులు విచారించేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం 1946లో ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థ చట్టం దానికి వర్తింపచేశారు. ఆ సంస్థ ఢిల్లీ పోలీసు ప్రత్యేక చట్టం సెక్షన్‌6 కింద ే ఏర్పడింది. స్వాతంత్రనంతరం కూడా కొనసాగింది.ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంగా వున్న్పప్పుడు తర్వాత కూడా పోలీసు శాఖ కేంద్రం చేతుల్లో వుంది. ఆ విధంగా కేంద్ర ఢిల్లీ పోలీసు చట్టాన్ని ఉపయోగించి ఒక ఉత్తర్వు మేరకు నెలకొల్పిన ఈ సంస్థకు హోంశాఖ 1963లో సెంట్రల్‌ బ్యూరో ఆప్‌ ఇన్వెస్టిగేషన్‌( సిబిఐ)గా పేరు మార్చింది. దేశంలో ప్రధాన దర్యాప్తు సంస్థగా వర్ణిస్తుంటారు. 2010లో బెంగాల్‌కు సంబందించిన ఒక కేసులో సుప్రీం కోర్టు ఏఏ తరహా అంశాల్లో సిబిఐ జోక్యం చేసుకోవచ్చో పేర్కొంది. ే గౌహతి హైకోర్టు సిబిఐకి ఢిల్లీ బయిట అధికారంవుండదనే విధంగా దాని అస్తిత్వాన్నే తోసిపుచ్చుతూ 2013లో ఒక తీర్పు నిచ్చింది. ఒక తీర్పు నివ్వగా సుప్రీం కోర్టు ఇచ్చిన స్టే ఇప్పటికీ కొనసాగుతున్నది. సిబిఐ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినా గత 55 ఏళ్లలోనూ కేంద్రంలో వున్న వారి చేతి పనిముట్టుగా మారిందని ఆరోపణలు వస్తూనే వున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో దానికి స్వతంత్రం ఇవ్వాలని కోరిన బిజెపి తను వచ్చినప్పుడు కూడా ఆ దోరణిని మరింత తీవ్రంగా కొనసాగించింది. సిబిఐ పంజరంలో చిలక అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన సందర్భముంది. (జగన్‌పై అక్రమాస్తుల కేసు ఎపి రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేసినప్పుడు వారు కూడా దానిపై ధ్వజమెత్తేవారు. టిడిపి నేతలు జెడి లక్ష్మీనారాయణ కటౌట్టు పెట్టేవారు!) మరీ ముఖ్యంగా యుపిఎ 2 హయాంలోనూ, మోడీ ప్రభుత్వం వచ్చాక సిబిఐపై వివాదాలు బాగా పెరిగాయి. సంస్థలో అత్యున్నత అధికారులు అంటే డైరెక్టర్లు ఎపిసింగ్‌, రంజిత్‌ సిన్హా, అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. (సిబిఐపై వ్యాసం ప్రజాశక్తి అక్టోబరు 25 ) ఇదే సమయంలోబీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్‌, హిమచల్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ వంటివారి విషయంలో సిబిఐ అత్యుత్సాహం రాజకీయ కక్షపూరితమన్న విమర్శలు తీవ్రంగా వచ్చాయి. కర్ణాటకలోనైతే ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్యపైనా, కాంగ్రెస్‌ నేతలపైనా రకరకాల దాడులు జరిగాయి. తమిళనాడులో అన్నా డిఎంకెను లొంగదీయడానికీ అదే సాధనమైంది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపైనే గాక ముఖ్యమంత్రి కార్యాలయంపైనా దాడి జరిగింది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ఫై లోగడ అక్రమంగా బనాయించిన సిబిఐ కేసును ఉన్నత న్యాయస్థానాలు ఎన్నిసార్లు కొట్టేసినా మళ్లీ దాఖలు చేయడం చూస్తాం.రఫేల్‌ యుద్ధ విమానాలపై దేశం అట్టుడికిపోతుంటే పట్టించుకోని సిబిఐ ఎప్పుడో ముగిసిన బోఫోర్స్‌ను తిరగదోడాలంటూ కోర్టును ఆశ్రయించడం ఇందులో భాగమే. గుజరాత్‌ మారణహోమానికి సంబంధించి గాని ఇతర ఆరోపణలపై గాని సిబిఐ నోరు మెదపదు.మోడీ హయాంలో ఇలాటి పాక్షిక దాడులతో పరువు ప్రతిష్ట కోల్పోయిన సిబిఐ ప్రస్తుతం ప్రతిష్టంభనలో పడిపోయింది.సుప్రీం కోర్టు విచారిస్తున్నది. ఈ పరిస్థితికి అందరూ ఆందోళన చెందుతుండగా ఎపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సిబిఐపై ఎన్నో విమర్శలున్నా ఈ చర్యను ఎవరూ బలపర్చలేదంటే అందుకు స్పష్టమైన కారణాలున్నాయి.
సిబిఐ పరిధి- రాష్ట్రాల పరిమితి
సిబిఐ మూడు పద్ధతుల్లో కేసుల దర్యాప్తు చేస్తుంటుంది. 1స్వయంగా, 2రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన ప్రకారం 3.కేంద్రం, పై కోర్టుల ఆదేశాల ప్రకారం. పౌరులు కూడా ఫిర్యాదులు చేయొచ్చు ఉదాహరణకు జగన్‌ కేసు గాని 2జి కేసు వంటివి గాని పౌరుల ఫిర్యాదులపై కోర్టుల ఆదేశాలపైనే దర్యాప్తు జరిగాయి. ఇందులో ఫిర్యాదు స్వభావాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరమా కాదా ఆధారపడి వుంటుంది. 2017లో అప్పటి హిమచల్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ పై సిబిఐ దాడి చేసినప్పుడు దాని పరిధి గురించి ఆయన న్యాయవాది కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశంతో దర్యాపు చేశారు. అయితే పరిధి విషయంలో మాత్రం పూర్తి స్పష్టత ఇవ్వాల్సిందిగా 2018 జనవరి 4 న సిబిఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అది ఇంకా తేలవలసి వుంది. ఇవన్నీ ఎలా వున్నా సిబిఐపై ఎన్ని ఫిర్యాదులున్నా 29 రాష్ట్రాలు గల ఈ విశాల దేశంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఒకటి పనిచేయడం తప్పనిసరి అని అందరికీ తెలుసు. ఏ ఒక్క రాష్ట్రం దాని ప్రవేశాన్ని ఆపజాలదు కూడా. ఫిర్యాదు గనక ఆ రాష్ట్రంలో నమోదై వుంటే అక్కడ అనుమతి తీసుకోవాలని, లేకుంటే అవసరం లేదని కూడా తీర్పులు వున్నాయి.ఇప్పుడు ఎపి ప్రభుత్వం కూడా ఆయా కేసులను బట్టి అనుమతి విషయం పరిశీలిస్తామని చెప్పగలదే గాని నో ఎంట్రీ ప్రకటించడం సాధ్యమే కాదు. అయినా ఆ తరహా ప్రచారం చేసుకోవడం రాజకీయ ప్రయోజనాలకు తప్ప రాజ్యాంగం ముందు నిలవదు. ఇక పోతే ఆగష్టులో ఇచ్చిన ఉత్తర్వును మూడు మాసాలలో వెనక్కు తీసుకోవడం ఎందుకనేది ఖచ్చితంగా అనుమానాస్పదమే. వైసీపీ నేతలు జగన్‌ కేసులో కేంద్ర సంస్థను తీసుకువస్తారనే ఆందోళనా లేక తమ పార్టీ వారిపై జరుగుతున్న దాడులను ఆపాలన్న తాపత్రయమా? అదీ ఇదీ కాకుంటే ఎపి తెలంగాణ ముఖ్యమంత్రులపైనే సిబిఐ తుపాకి గురి పెట్టేవుందన్న వార్తల పర్యవసానమా అంటే ఏదైనా కావచ్చు. ఇది వీరోచిత కార్యంలా మొదలైన ఈ ప్రచారం వినోదప్రాయంగా మారిందంటే అందుకు టిడిపి ప్రభుత్వ అనాలోచిత అనామోదిత పోకడలే కారణం.సిబిఐ బాధ్యతలన్నీ ఎపి ఎసిబి నిర్వహిస్తుందని హోం శాఖ తాజా జీవోలో పేర్కొన్నది ఎంతవరకూ నిలుస్తుందో చూడాలి. , ఐిపిసి, సిఆర్‌పిసి కింద ఉద్యోగులు అధికారులపై దర్యాప్తులు, 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17కింద కేంద్ర ఉద్యోగులపై ఆరోపణలు కూడా రాష్ట్రమే విచారించవచ్చు. ఈ విషయమై అన్నీ తామే విచారిస్తామని గతంలోనే కర్నాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం ఉత్తర్వులిచ్చి వుంది. ఎపి విషయంలో ఇంతవరకూ ఎలాటి సమాచారం అందలేదంటున్న సిబిఐ దీనిపై తర్వాతనే స్పందించవచ్చు. వచ్చిన రాజకీయ స్పందన మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వున్న మాట నిజం. ఈ వివాదంలో ఐటి దాడుల గురించి టిడిపి ఆందోళన పడుతున్న నేపథ్యంలో కొసమెరుపు ఏమంటే 2014 నుంచి 2018 మధ్య అవినీతి కేసుల్లో సిబిఐ దర్యాప్తు చేసిన 3260 మంది హాయిగా విడుదలైనారు. కేవలం 3 శాతం మందికే శిక్షలు పడ్డాయని కేంద్ర మంత్రి పార్లమెంటులో ఇచ్చిన సమాచారం. అనవసరంగా కంగారు పడిన టిడిపి అతితెలివి వ్యూహాలతో అభాసుపాలైంది.(ప్రజాశక్తి, నవంబరు18,2018. శీర్షిక మారింది)

తోక: సిబిఐ విషయంలో తాము కూడా ఎపి లాగే చేయాలనుకుంటున్నట్టు సిపిఎం కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పినట్టు సూచించే ఒక వార్త వచ్చింది. వాస్తవంలో ఆయన అలా అన్నది లేదు. మామూలు కేసుల విషయంలో ఎలాగైనా రాష్ట్రాన్ని సంప్రదించాల్సిందేనని, సాధారణ అనుమతి ఉపసంహరించినా కోర్టు ఉత్తర్వులతో వస్తే రాష్ట్రాలు అనుమతించక తప్పదని ఆయన స్పష్టంగా చెప్పారు. తాము ఈ వాదనలో అటూ ఇటూ అని గాక న్యాయాన్నే బలపరుస్తామని, రాజ్యాంగ బద్దమైన పరిష్కారాలు చూడాలని తెలిపారు. బెంగాల్‌లో మమతా బెనర్జీపై వచ్చిన ఆరోపణలను సిబిఐ దర్యాప్తుచేయాలని తాము కోరిన సంగతి అదే మీడియా గోష్టిలో పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ గుర్తు చేశారు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *