అబద్దాల అఫిడవిట్‌తో ఆఖరి పోటు

ఆంధ్ర ప్రదేశ్‌కు విభజన చట్టం ప్రకారం చేయవలసినవన్నీ చేశామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ చూస్తే తడిగుడ్డతో గొంతుకోయడం, నమ్మించి నట్టేట ముంచడం, ఏరుదాటి తెప్పతగలేయడం వంటి విశ్వాసఘాతుక సామెతలన్నీ గుర్తొస్తున్నాయి. ఎన్నికల తరుణంలో ఓట్ల కోసం వచ్చిన మోడీ ఫ్రధానిగా ప్రత్యేక హౌదా, ఇతర హామీలపై నోరు విప్పింది లేకపోగా అత్యున్నత న్యాయస్థానంలో బాహాటంగా రాజ్యాంగ వంచనకు పాల్పడటం అలక్ష్యానికి అహంభావానికి పరాకాష్ట. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రయోజనాలకు ఆఖరిపోటు.ఇందుకు వ్యతిరేకంగా వామపక్షాలు జనసేన రాష్ట్ర వ్యాపితంగా నిరసనలు చేపట్టాయి ఈ విషయంలో న్యాయ పోరాటం సాగించాలని రాష్ట్ర కేబినెట్‌ తీర్మానించింది. .దీంతో బాబు నాటకం బట్టబయలైందని(కేంద్రం ప్రసక్తి లేకుండా) సాక్షి పెద్ద శీర్షిక నిచ్చింది.
కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌ సూటిగా ప్రత్యేక హౌదా ప్రసక్తి లేదని తేల్చిచెప్పేసింది. అయితే ఇందుకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అడ్డంకిగా వున్నాయనే పాత అసత్యాన్ని మళ్లీ వల్లె వేసింది. ఆ సంఘం నియామకం విభజన కన్నా ముందే జరిగింది. దాని విచారణాంశాల్లో ప్రత్యేక హౌదా ప్రస్తావనే లేదు. తాము హౌదా ఇవ్వొద్దని ఎక్కడా సిఫార్సు చేయలేదని ఆర్తిక సంఘం చైర్మన్‌గా పనిచేసిన వైవీరెడ్డి స్వయంగా ప్రకటించారు. తము చేసిన కేటాయింపులకు ప్రత్యేక సూత్రం వర్తింపచేయలేదని మాత్రమే ఆయన చెప్పారు. అదే సమయంలో గతంలో హౌదా పొందుతున్న 11 రాష్ట్రాలకు ఈ సంఘం సిఫార్సులతో నిమిత్తం లేకుండాజిఎస్‌టి చెల్లింపులలో మోడీ ప్రభుత్వం అదనపు కేటాయింపులు చేసింది. ఒక నీటి ఆయోగ్‌ కూడా తమకు దీంతో సంబంధం లేదని మొదటే చెప్పింది. అందువల్ల ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేకహౌదా ఇస్తామని ప్రసంగాలలో చెప్పిన మోడీ, ప్రణాళికలో చెప్పిన బిజెపి విశ్వాసఘాతుకత్వం నిస్సందేహం. ఈ విషయమే అంత నిర్లజ్జగా సుప్రీం కోర్టులో చెప్పడమంటే ఇటు పార్లమెంటునూ అటు దాన్ని కూడా పక్కదోవ పట్టించడమే. హౌదా గురించి తన ప్రసంగంలో చెప్పింది తానే అమలు చేయకపోగా దానికి ఏవో సాకులు చెప్పి తప్పించుకోవడం మోడీ వ్యక్తిగత విశ్వసనీయతకు కూడా నిదర్శనం. అక్కడే ఆయన ఢిల్లీని మించిన రాజధానిని కట్టుకోవడానికి ఎపికి సహకరిస్తామన్నారు. వారు చెప్పే ప్రకారం 1500 కోట్ల పై చిలుకు ఇచ్చారు. అప్పటి మంత్రి వెంకయ్య నాయుడు హయాంలో డ్రైనేజీ పేరిట రెండు జిల్లాలకు కలిపి విడుదలైన 1000 కోట్టు కూడా ఈ ఖాతాలో కలుపడం హాస్యాస్పదం.ఈ డబ్బుతోఢిల్లీని మించిన రాజధాని కోసం చేయవలసినంతా చేసినట్టు కేంద్రం చెప్పడం సిగ్గుచేటు. అప్పట్లో దానికి తలవూపి ఆయనకు సత్కారాలు చేసిన టిడిపి అధినేత ఇప్పుడు ఎంత మొత్తుకుంటే ఏం ఫలం?
ఈ అఫిడవిట్‌లో కేంద్రం చెప్పింది ఎంతటి అసత్యమో అర్థం కావడానికి బిజెపి జాతీయ ప్రతినిధి ఎంపి జివిఎల్‌ నరసింహరావు మాటలే ఒక ఉదాహరణ. దీన్ని దాఖలు చేయడానికి రెండు రోజుల ముందు ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా విదేశీ సాయం పొందే ప్రాజెక్టులు(ఎక్సటర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్స్‌ ఇఎపి) కింద రావలసిన 12వేల కోట్ల పైచిలుకు కోసం ఎపి ప్రభుత్వం లేఖలు రాసిందని ఆయన వెల్లడించారు. ఒక వైపున ప్యాకేజీ వద్దు హౌదాయే కావాలంటూ మరో వైపు ఆ ఖాతాలో రావలసిన మొత్తం కోసం ఇలాచేయడమేమిటని విరుచుకుపడ్డారు. అంటే ఆ తతంగం పూర్తి కాలేదని ఆయనే ఒప్పుకున్నారన్నమాట.
హౌదాను మించిన ఆదా అని అప్పుడు వెంకయ్య నాయుడు ప్రాసలో పొగిడితే ఎక్కువ వస్తే అభ్యంతరమా అని ప్యాకేజీ భజనలో చంద్రబాబు ప్రతిపక్షాలను ఎద్దేవా చేసిన మాట నిజమే. నిజానికి ప్యాకేజీ అన్న పదం ఎప్పుడూ వాడకపోయినా ప్రత్యేక ఆర్థిక సహాయం అన్న మాట కేంద్రం వాడిందే.కేంద్ర క్యాబినెట్‌ 2017 మార్చి 23న చేసిన తీర్మానంలో ఈ విషయం పేర్కొన్నారు..” 2015-16 మధ్య కాలంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు(సెంట్రల్లీ స్పాన్సర్డ్‌ స్కీమ్స్‌)ల వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు90:10 నిష్పత్తిలో పంచుకుంటే ఎపికి ఎంత ఇవ్వాల్సివచ్చేదో ఆ అదనపు మొత్తాన్ని కేంద్రం ప్రత్యేక సహాయంతో భర్తీ చేస్తుంది.2015-16 నుంచి 2019-20మధ్య కాలంలో సంతకాలు జరిగి ఖర్చు చేసిన విదేశీ సహాయిత ప్రాజెక్టులు(ఇఎపి)వడ్డీ అసలు వాయిదాల చెల్లింపు రూపంలో ఈ ప్రత్యేక సహాయం అందుతుంది.” 90:10నిష్పత్తిలో నిధుల కేటాయింపు ప్రత్యేకహౌదాలో ఒక ముఖ్యమైన సూత్రం. దాన్ని ఇతర పద్దతుల్లో అమలు చేస్తానని చెప్పిన కేంద్రం ఆ వాగ్దానం నిలబెట్టుకోలేదని జివిఎల్‌ మాటలే స్పష్టం చేస్తున్నాయి. పైగా అందుకోసం లేఖ రాయడాన్ని ఆయన తప్పు పడుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 100 శాతం భరాయించడం జరుగుతుందని చెప్పిన కేంద్రం ఇప్పటికీ పూర్తిగా ఇచ్చింది లేదు.నిర్మాణవ్యయం సహాయ పునరావాసాలతో మాకు సంబంధం లేదని మెలిక పెట్టి తప్పుకుంటున్నది. ముందు పునరావాస కల్పన తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలని ఇదే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు వున్నాయి. ఆ భాగం పట్టించుకోకుండానే మోడీ ప్రభుత్వం వాగ్దానాలన్నీనెరవేర్చానని కొండంత అబద్దం అవలీలగా చెప్పేసింది. పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగిందని పునరావాస నిధులు కాజేయడానికి టిడిపి నేతలు కొందరు తప్పుడు రికార్డులు పుట్టించారని వస్తున్న కథనాలపై దర్యాప్తు అవసరమే. అయితే ఆ పేరుతో తన బాధ్యతకు ఎసరు పెట్టడం ఎలా కుదురుతుంది? పైగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తరపున మాత్రమే ప్రాజెక్టు నిర్మిస్తున్నది. పగ్గాలు వారి చేతుల్లోనే వున్నాయి.
రాయలసీమ ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టం కింద 350 కోట్టు ఇచ్చినట్టు ఆ నోట్‌లో కేంద్రం చెప్పింది. తర్వాత మరో 700 కోట్లు వచ్చాయి. అంటే నాలుగవ ఏడాదికి ఇంకా బకాయి వుంది. ఈ యాభై కోట్లు ఏ మూలకు సరిపోవనే వాస్తవం వుండనే వుంది. అంతకంటే కీలకమైంది ఆనాడు వాగ్దానం చేసిన బుందేల్‌ఖండ్‌ ప్యాకేజికి పూర్తిగా మంగళం పాడేయడం. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన 1050 కోట్లు మామూలుగా దేశమంతటా ఇచ్చేవే గాని ఎపికి ప్రత్యేకంగా ఇస్తున్నవి కావు. కెబికె ప్యాకేజీ అన్నది కేంద్ర వాగ్దానం. ప్రత్యేక హౌదా విషయంలో ఏవో అర్థం లేని అభ్యంతరాలు చెబుతున్నారు గాని కెబికె ప్యాకేజికి అలాటివికూడా లేవే? ఎందుకివ్వలేదు? కెబికె ప్యాకేజీ కింద వెనకబడిన జిల్లాలకు కనీసం రు.24,350 కోట్టు రావాలని నిపుణులు లెక్కవేశారు. దాన్ని కూడా ఇవ్వకుండానే అన్నీ చేశాశమని చెప్పేస్తే కుదురుతుందా?
11 జాతీయ సంస్థలకు వాస్తవిక వ్యయం అంచనాలు రు.11,672 కోట్టు అని జెఎప్‌సి లెక్క కట్టింది.ఇప్పటికి కేటాయించింది రు.576 కోట్లు. అదే గొప్ప విషయమైనట్టు టముకు వేసుకుంటున్నది.2014-15 కు మాత్రమే రెవెన్యూలోటు 14,333కోట్లు వుంటుందని అప్పటి కాగ్‌ లెక్క కడితే 4 వేల కోట్ల పై చిలుకు మాత్రమే విడుదల చేశారు. 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ లెక్కల ప్రకారం కూడా 2014-2020 మధ్య కాలమంతా రెవెన్యూ లోటు కొనసాగే రాష్ట్రం ఎపి ఒక్కటే. 22,113 కోట్టు ఇందుకోసం నిధులు అదనంగా కేటాయించాల్సి వుంది. కాని 2018 మార్చి 14న మంత్రి హంసరాజ్‌ రాజ్యసభలో ఇచ్చిన సమాచారం ప్రకారమే ఎపికి ఇప్పటి వరకూ వచ్చింది రాజధాని నిధులతో సహా రు.12,476 కోట్లు మాత్రమే! . 9,10,12 షెడ్యూళ్ల కింద అమలు కావలసిన హామీలు పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా అలాగే వున్నాయని ఆయనే సెలవిచ్చారు. ఇది వాస్తవమైనప్పుడు హౌదా మొత్తంగా ఎత్తివేసి, ఇస్తామన్న ప్యాకేజికి మంగళం పాడేసి, ఇవ్వాల్సిన నిధులు కూడా బిగపడుతూ అన్నీ చేసేశామని చెప్పడంరాష్ట్రాన్ని వెన్నుపోటు పొడవడమే గాక రాజ్యాంగాన్ని పార్లమెంటునూ కూడా అవమానించడమే. ఇప్పటివరకూ తామేదో వొరగబెట్టినట్టు చెప్పుకుంటూ ఎదురుదాడి చేస్తున్న బిజెపి నేతలు ఇక నోటికి తాళాలు వేసుకోవడం శ్రేయస్కరం. కేంద్రానికి లేఖలు రాస్తే ఆ ప్రతులు పట్టుకుని అమరావతిలో దిగిపోయి అదరగణ్ణం చేసే జీవీఎల్‌ వంటివారి అప్రస్తుత ప్రసంగాలు ఆపితే మంచిది.

రాజధాని నిధుల విషయంలో గాని పోలవరంలో గాని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వున్నమాట నిజం. కాని వాటిని సాకుగా చూపి రావలసినవి నిరాకరించేందుకు కేంద్రానికి హక్కులేదు. విభజన వాగ్దాన భంగాలనూ తెలుగుదేశం ప్రభుత్వ తప్పిదాలను కలగాపులగం చేయడం సరికాదు కూడా. పైగా నిన్నమొన్నటి వరకూ బిజెపి వారూ రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగానే వున్నారు. కేంద్రం నిరాకరణలో టిడిపి భాగం గురించి చెప్పినట్టే రాష్ట్రంపై ఆరోపణల్లో బిజెపి పాత్రను కూడా చెప్పవలసిందే.. అయితే ఇది కేవలం ఆ రెండు పార్టీల వ్యవహారం కాదు. ఆ మాటకొస్తే ఎపికి మాత్రమే పరిమితం కాదు.తెలంగాణకు సంబంధించినవీ వున్నాయి. ా రాష్ట్రాలను బేఖాతరు చేసే ఈ దురహకారం వైఖరి సమాఖ్య సూత్రాలకే సవాలు. అన్ని పార్టీలూ సంఘాలూ కూడా దీన్ని నిష్కర్షగా నిరసించడం సాధించుకునేదాకా ఉద్యమించడం అవసరం. వైసీపీ జనసేనలను బిజెపి తో కలిపి మాట్లాడేౖ టిడిపి, రాష్ట్ర ప్రభుత్వంపై తప్ప కేంద్రంపై పోరాడటానికి సిద్ధపడని వైసీపీ పరోక్షంగా బిజెపికే మేలు చేస్తున్నట్టు చెప్పాలి. వామపక్షాలు జనసేన ప్రత్యేకహౌదా సాధన సమితి తరహాలోనే కేంద్రం వైఖరిపై రాష్ట్రంలో తప్పిదాలపై పోరాడ్డం ఇప్పుడు ప్రధానమని అబద్దాల అఫిడవిట్‌ మనను హెచ్చరిస్తున్నది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *