అవాస్తవాల సుడిగుండంలో ఆంధ్ర ప్రదేశ్‌!

ఆర్థిక సామాజిక సమస్యలకు తోడు ఆంధ్ర ప్రదేశ్‌ ఇప్పుడు మరో విచిత్రమైన సమస్య ఎదుర్కొంటున్నది. అతిశయోక్తులు అవాస్తవాలు అసందర్భ ప్రచార హౌరులో నిజానిజాలు నిర్ధారణ గాక సామాన్య ప్రజానీకం సతమతమవుతున్నది. గత పరిణామాలు చూసిన పెద్దలకన్నా యువతను ఈ సంధిగ్ధత ఎక్కువగా వేధిస్తున్నది. ఒకవైపున పాలకవర్గాలు మరో వైపున వారి వారి మీడియా హౌరెత్తిస్తున్న ప్రచారంలో సత్యం సమాధి అవడమే ఇక్కడ సమస్య. విభజిత రాష్ట్ర వికాసం గురించి విభిన్న కథనాలు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రభుత్వ ధనంతో పాలక పక్ష ప్రచారంగా సాగిన నవనిర్మాణ దీక్ష ముగిసినవెంటనే మహాసంకల్పం అంటూ మరో ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈ గజిబిజి ఇంకా పెరుగుతున్నది. బహుశా దేశంలో ఎప్పుడూ ఏ రాష్ట్రానికి ఇలాటి పరిస్థితి ఎదురై వుండదు. వేర్వేరు పార్టీలు ఆయా దశల్లో పరస్పర భిన్నమైన వాదనలు చేయడం ప్రభుత్వంలో వున్న వారు అనుకూలంగానూ ప్రతిపక్షంలో వున్నవారు విమర్శనాత్మకంగానూ మాట్లాడ్డం ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ వుండేదే. కాని ఎపిలో ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య అది కాదు.అవే పార్టీలు అదే విషయమై అదే ప్రజల ముందు అనేక రకాలుగా మాట్లాడ్డం!
వాస్తవానికి ఈ గజిబిజి ఒకటిన్నర దశాబ్దంగా సీమాంధ్ర ప్రాంతాన్ని పీడిస్తున్నది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత ప్రాంతీయ అసమానతల గురించి అనేక వాదోపవాదాలు కొన్ని సార్లు అవాస్తవ ఆరోపణలు కూడా నడిచాయి. ఈ సమస్యపై సిపిఎం మినహా మిగిలిన పార్టీలన్నీ విభజనకు అనుకూలమైన వైఖరి తీసుకుని కూడా రెండు చోట్ల రెండు రకాలుగా మాట్లాడాయి. ఆయా పార్టీలలోనే అంతర్గత ఘర్షణలు కూడా నడిచాయి. పాలకుల తప్పు విధానాల వలన్లూ, పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావం కారణంగానూ పెరిగిన అసమానతలను ప్రజల మధ్య ప్రాంతాల మధ్య అంతరాలుగా చిత్రించే తతంగం పెద్ద ఎత్తునే నడిచింది. 2009 డిసెంబర్‌ 9 ప్రకటన తర్వాత ఈ క్రమం ఇంకా తీవ్రతరమైంది. పాలక వర్గ నేతల కపట నాటకాలకు అంతు లేకుండా పోయింది. శ్రీకృష్ణ కమిటీ ముందు కూడా ఈ పార్టీలు రెండు రకాలైన వాదనలు వినిపించాయి. ఇవన్నీ సీమాంధ్ర ప్రజలను ఒక విధంగా నిస్ప్రహలో ముంచాయి. విడిపోతే ఏం కావాలో ముందే కోరుకొమ్మని కొందరు ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. అలా కోరకపోవడం పెద్ద లోపమూ పాపమూ అని ఇప్పటికీ మాట్లాడుతుంటారు. విడిపోవద్దని కోరేవారిని విడిపోతే ఏం కావాలో ఎలా చెప్పడం? అదైనా ఎవరు చెప్పడం? అటో మాట ఇటోమాట మాట్లాడే వారు ఎలా చెప్పగలరు? ఈ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించడంలో తప్పు లేదు గాని మరో రెండు పాలక పార్టీలైన బిజెపి తెలుగుదేశం పాత్ర కూడా తక్కువ కాదు.విభజనకు అనుకూలంగా ఒకటికి రెండు సార్లు లేఖలు ఇచ్చిన తెలుగుదేశం అధినేత అన్యాయంగా విభజించారని ఇప్పుడు ఆరోపిస్తుంటారు.అప్పుడు వైసీపీ నేత జగన్‌ కూడా దీక్షలు చేశారు! అప్పటికే అంతా నిర్ణయమై పోయిందని అందరికీ తెలుసు.
విభజన ముగిసి 2014 ఎన్నికలలోనూ ఇదే తంతు. విభజన ప్రక్రియలో సమాన భాగస్వామిగా వున్న బిజెపితో టిడిపి జతకట్టింది. ఉభయులూ పవన్‌ కళ్యాణ్‌ తో కలిసి ప్రచారం చేశారు. కేంద్ర రాష్ట్రాలలో కలిసే అధికారం చేపట్టారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేసేవారు. అయితే 17 ఏళ్లు పాలించిన పార్టీ, తొమ్మిదేళ్లు పాలించిన ముఖ్యమంత్రిగా ఆయన గతాన్ని మొత్తంగా తీసుకోకుండా తనకు ముందు పదేళ్ల కాంగ్రెస్‌ పాలనకే పరిమితమైపోయేవారు. అలా శ్వేతపత్రాలు చెప్పింది తక్కువ దాచింది ఎక్కువ. వైెసీపీ ఓట్లపరంగా దగ్గరగా రావడంతో ఈ రెండు పార్టీల కుమ్ములాటలో మౌలిక సమస్యలు విభజన అంశాలపై కేంద్రీకరణ లేకుండా పోయింది.వీటిని కలసి కట్టుగాచర్చించేందుకు అఖిలపక్షం వేయడం కూడా ప్రభుత్వానికి ఇష్టం లేకపోయింది. రాజధాని వంటి కీలకాంశంపైన కూడా సభలోప్రకటన ద్వారానే తెలుసుకోవలసి వచ్చింది.ఆ విధంగా అన్ని ప్రధాన నిర్ణయాలకు నిగూఢత దాపురించింది.ఇదంతా స్వప్రయోజనాల కోసం సాగే స్వార్థక్రీడ అని విమర్శలు వస్తున్నా ప్రభుత్వం బేఖాతరు చేసింది.వాగ్దానం చేసిన రుణమాఫీని అమలు చేయడానికి కూడా వంద కసరత్తులు చేసి వడపోత పోసింది. అక్కడే పారదర్శకత కొరవడటంతో పాటు పాక్షికత వచ్చేసింది.
ే రాజధాని లేకపోవడం, నిధుల కొరత వెంటాడుతున్నా మిగిలిన వనరులు ప్రకృతి ప్రజాశక్తి అన్నీ ఏపికి వున్నాయి. కాని నూతనరాష్ట్రం రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబు దాడికి గురైన జపాన్‌లా వుందని ముఖ్యమంత్రి అన్నారు! తమ కారణంగానే ఎపి ఉద్ధరించబడిందనే ప్రచారం కోసం వాస్తవ పరిస్థితిని దీనాతి దీనంగా చిత్రిస్తూ వచ్చారు.ల(దీన్ని టిఆర్‌ఎస్‌ ఎద్దేవా చేసేందుకు ఉపయోగించుకుంది) పదేళ్లు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా హక్కు కలిగివున్నా ఓటుకు నోటు కేసు తర్వాత ఫోన్‌ టాపింగ్‌ జరిగిందంటూ ఆఘమేఘాల మీద వచ్చేశారు. ఆ కేసులోనూ నిజానిజాలు ఎపి ప్రజలకు తెలియలేదు.టిడిపి రాజకీయ ప్రయోజనాలకోసం జరిగిన ఆ ప్రహసనం కూడా విభజన సమస్యల్లో కలిపేశారు!విభజన సమస్యలపై చాలా కాలం పాటు టాస్క్‌ఫోర్స్‌ గాని నిర్దిష్టమైన కాల వ్యవధితో కూడిన కసరత్తు గాని లేకుండా పోయింది. వెనువెంటనే మంజూరు చేయవలసివని ప్రత్యేక హౌదా రాయితీలు రాకపోయినా వెంటపడే బదులు చాలా వచ్చినట్టు హంగామా జరిగింది. వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు పరస్పర ప్రశంసల్లో నిజానిజాలు మరింత మరుగునపడ్డాయి. అమరావతికి కేంద్రం నేరుగా ఇవ్వకపోయినా పట్టణాభివృద్ధిశాఖ తరపున వెంకయ్య కేటాయించిన వెయ్యికోట్లు ఆ ఖాతాలో చూపేవారు! కాదంటే ఒప్పుకునేవారు కాదు. అప్పుడు మాలాటి వాళ్లం చెబితేకాదన్న టిడిపి ఇప్పుడు తనే ఆ మాట అంటుంది! కేంద్రాన్ని నమ్మి మోసపోయాం అంటున్నవారు ఎందుకు నమ్మారో చెప్పరు. తమకు సంబంధించిన ఇతర అంశాలు నెరవేరుతున్నాయి గనకనే వూరుకున్నారు. కొన్నిసార్లు చంద్రబాబు మరికొన్నిసార్లు సుజనాచౌదరి ఇంకా కొన్ని సార్లు వెంకయ్య ఇలా తమ తమకు అవసరమైన సందర్బాలలో సర్దుకుంటూ సత్యాన్ని దాచిపెట్టారు. భర్తీ చేయాల్సిన రెవెన్యూలోటు భర్తీ కావదం అటుంచి ఎంతవుంటుందో లెక్క కూడా తేలకపోయినా 2016 వరకూ మౌనం పాటించారు. కేంద్రం కూడా తను అడుగుతున్న ప్రశ్నలు తనకు రాని సమాధానాలు ప్రజలతో పంచుకోకుండా దాగుడుమూతలాడింది.టిడిపి బిజెపి రాజకీయ మైత్రి, ఆర్థిక ప్రయోజనాల కలబోత కారణంగానే ఉభయులూ కలసి నిజాలు మరుగుపర్చారన్నమాట. ప్రత్యేక హౌదా కోసం అప్పుడప్పుడూ మాట్లాడుతున్నా వైసీపీ కూడా వీటిని నిగ్గు తేల్చడంపై దృష్టిపెట్టలేదు. ప్రతిపక్షహౌదాలో అన్ని విషయాలు అధికారికంగా రాబట్టగల అవకాశం వున్నాకేంద్రంతో ఘర్షణ మొదటి నుంచి వారికీ ఇష్టం లేదు. టిడిపి తమ ప్రత్యర్థి గనక దానితో రాజకీయ వైరానికి మాత్రమే పరిమితమైనారు. టిడిపి వైసీపీ నేతలు మొదటి నుంచి అటూ ఇటు మారుతన్న వారే గనక పూర్తి వివరాల్లోకి పోవడం ఎవరికీ ఇష్టం లేకపోయింది. 2016లో లోక్‌సభకు రాజీనామాలు చేస్తామని ప్రకటించిన వైసీపీ చివరి సమావేశాల వరకూ నిరీక్షించింది.! 2016 వరకూ ప్రత్యేక హౌదా లేదా నిధులపై పట్టుపట్లని టిడిపి ఆ ఏడాది సెప్టెంబరు తర్వాత కొంత హడావుడి చేసి ప్యాకేజీ తెచ్చానంటూ ప్రచారం చేసుకుంది. ప్యాకేజీ లేదనీ అమలు కావడం లేదనీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా ఒప్పుకోకుండా ప్రశంసలతో తీర్మానాలు చేసింది. ఈ కాలమంతా టిడిపిని ఆశ్రయించుకున్న వ్యాపార వర్గాలు ఆశ్రిత శక్తులు తమ తమ ప్రయోజనాలు మాత్రం బాగా నెరవేర్చుకున్నాయని గుర్తించడం అవసరం. ఆఖరు వరకూ నెట్టుకొచ్చి చివరలో తెంచుకుంటే సరిపోతుందని వారనుకున్నారు. టిడిపి చివరలో విడిపోతుందని తమకు తెలుసని బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధరరావు చెప్పడం గమనించదగ్గది. కాని ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి కారణంగానే ఏడాది ముందుగానే ఆ పని చేయక తప్పలేదు!
అనివార్యంగా విడిపోయిన చంద్రబాబు నాయుడు అఖిలపక్షం పేరిట తన నాయకత్వంలో మరోసారి 2014 ఎన్నికల నాటి పోరాట ప్రహసనం పునరావృతం చేయొచ్చని భావించారు. మొదటి సమావేశంలోనే సిపిఎం కార్యదర్శి మధు, సిపిఐ నేత రామకృష్ణలు అప్పటివరకూ జరిగిన దాన్ని ప్రశ్నించడంతో ఇరకాటంలో పడ్డారు. జనసేన కూడా రాలేదు. వైసీపీ ఎలాగూ రాదు. దాంతో చంద్రబాబు విడిగా ప్రభుత్వ ముద్రతో తమ పార్టీ వాదన ప్రచారం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. దానివల్ల అన్ని నిజాలు వెల్లడించవలసిన అవసరం వుండదు.ఇదే సమయంలో దేశంలోనూ బిజెపి వ్యతిరేకత పెరగడం తనకు లాభదాయకమని భావిస్తున్నారు.వీరోచితంగా విమర్శిస్తున్నారు. మీడియాలో కథనాలు రాయిస్తున్నారు. విచిత్రంగా ఇప్పుడు వైసీపీ అద్యక్షుడు బిజెపి పట్ట బాహాటంగానే మెతక వైఖరి తీసుకున్నారు. దాంతో ఆయన కేంద్రం పాత్రను బయిటపెట్టడం లేదు. చంద్రబాబు రాష్ట్రం పాత్రను చెప్పడం లేదు. ఈ విధంగా బండి మళ్లీ మొదటికే వచ్చింది.నాలుగేళ్లు కలసి పాలన వెలగబెట్టి అనేక నిర్వాకాలలో పాలుపంచుకున్న టిడిపి బిజెపిలు వాగాడంబరంతప్ప ఒకరి గుట్టు ఒకరు బయిటపెట్టుకునే పరిస్థితి లేదు. ఆంధ్ర ప్రదేశ్‌ వాస్తవ స్థితిగతులు అవసరాలు అవకాశాలు చెప్పడం అంతకన్నా లేదు. రాజధానిపై రభస చేయడం తప్ప వాస్తవాల శ్వేతపత్రం ఒక్కరూ ప్రకటించరు.2019 ఎన్నికల ప్రచార పర్వంలో ప్రవేశించిన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు పూర్తి సత్యాలు ఆశించడం వ్యర్థమే కావచ్చు.అయితే నిజాలు శాశ్వతంగా దాచిపెట్టడం ఎవరి వల్లా కాదు. (ప్రజాశక్తి,13,6,18)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *