సీనియర్ల తర్వాత.. మెగాకు ముందు. .ఆశయమే ఆవేశమైన అరుణతార

మాదాల రంగారావు జీవితమూ సినిమాలూ కూడా నిబద్దతకు నిదర్శనంగా వుంటాయి. ఒక వ్యాపార వాతావరణం దట్టంగా అలుముకున్నప్పుడు ఏ రంగంలోనైనా సరే ప్రత్యామ్నాయం కోరే శక్తులు ఎంతగా పెనుగులాడవలసి వుంటుందో అర్థం కావడానికి ఆయన జీవితమే ఒక సందేశం. ఆశయాలను అలంకారాలుగా ధరించే వారికీ ఆవేశంగా మలుచుకునే వారికి మధ్యన వ్యత్యాసం కూడా మాదాలలో మనం చూడొచ్చు. అక్కినేని ఎన్టీఆర్‌ల శకం ఆఖరి దశలో- తదుపరి హీరోల మలిదశలో- మెగా యుగ ప్రారంభానికి ముందు- మూలమలుపు తిరుగుతున్న తెలుగు సినిమా రంగంలో ప్రత్యామ్నాయం కోసం జరిగిన ఒక పెద్ద ప్రయత్నానికి ప్రతిరూపం మాదాల రంగారావు. స్పష్టమైన ఉద్యమ నేపథ్యంతో భావజాలంతో పకడ్బందీగా జరిగిన ఫలవంతమైన ప్రయత్నం ఆయనది. గడచిన నలభై ఏళ్లను వెనక్కు తిరిగి చూసుకుంటే మాదాల మహా ప్రస్థానం విలువేమిటో తెలుస్తంది. ఆ పేరుతోనూ ఆయనచిత్రం తీశారు. మహాకవి శ్రీశ్రీని అందులో నటింపచేశారు కూడా.
1974లో చైర్మన్‌ చలమయ్య చిత్రం ద్వారా పరిచయమైన మాదాల రంగారావు ప్రకాశం జిల్లాలో సిపిఐ నాయకత్వంలోని కమ్యూనిస్టు ఉద్యమం నుంచి ప్రజానాట్యమండలి నుంచి వచ్చిన వారు. నాటకాలు వేసిన వారు. నిజానికి 1950లలోనే తెలుగు సినిమాను ప్రజాకళాకారులు గొప్పగా ప్రభావం చూపించారు. పల్లెటూరు రోజులు మారాయి వంటి చిత్రాలతో వుర్రూతలూపారు. ఎందరో గొప్ప దర్శకులనూ సంగీత దర్శకులనూ ప్రముఖ నటీనటులను ప్రజానాట్యమండలి చిత్రసీమకుఅందించింది.అయితే 60 దశకంలో ఆ తరహాకు చెందిన వారు కుటుంబ చిత్రాలకు ,ప్రేమ కథలకు పరిమితమై పోయారు. పాటల్లోనే అభ్యుదయం వినిపించేది. ఇక 70 వదశకం క్రైం చిత్రాలు క్లబ్‌ డాన్స్‌లు, పగసాధింపులు రాజ్యమేలుతున్న దశ. 78,79లలో కొన్ని భిన్నమైన చిత్రాలు వస్తున్నాయి. ఈ సమయంలో 1980లో నవతరం పిక్చర్స్‌ పేరుతో మాదాల బృందం ‘యువతరం కదిలింది’ తీసినప్పుడు నిజంగానే పరిశ్రమ సమాజమూ కూడా కదిలినట్టయింది. కథ పాత్రలు పాటలూ మాటలూ అన్నిటా ఒక ప్రగతిశీల భావనతో యువత ముందకు రావడం ఎంతో ఉత్సాహం కలిగించింది. ఆ చిత్రం వాణిజ్యపరంగానూ విజయం సాధించడం సంచలనమైంది. విజయవాడ నటరాజ్‌ హౌటల్‌లో చిత్రం సక్సెస్‌ మీట్‌ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు మాదాల ఒక పెద్ద ఆకర్షణగా మారారు. అయితే ఎక్కడ మాట్లాడినా ఎర్రజండా పోరాటాలే చెప్పేవారు తప్ప నటన వసూళ్లు గ్లామర్‌ కోసం పాకులాడే వారు కాదు.ప్రతి చిత్ర వేడుకలోనూ ్ల మాదాల కమ్యూనిస్టు నేతలకు విరాళం అందించేవారు.
నూతన తారలను ప్రవేశపెట్టడమనే పేరుతో అప్పటికే వున్న ప్రతిభావంతులను నిర్లక్ష్యం చేసే పద్దతిని కూడా మాదాల మార్చేశారు. తన చిత్రాల్లో ఆయన కొత్త వారినీ ప్రజా కళాకారులను తీసుకురావడమే గాక అప్పటికే అవకాశాలు లేని సీనియర్లను తీసుకునే వారు. ఆ విధంగానే యువతరం కదిలిందిలో రామకృష్ణ తదితరులు చాలా కాలం తర్వాత హీరోగా కనిపించారు. ప్రజానాట్యమండలి నాయకుడైన నల్లూరి వెంకటేశ్వర్లొ(అన్న) వీరందరినీ నడిపించారు. యువతరం కదిలింది ఒక సంచలనమైతే ఎర్రమల్లెలు ప్రభంజనమే అయింది. నేడే మేడే అనే ఆ చిత్రంలో పాట ఇప్పటికీ మార్మోగుతుంటుంది. మురళీమోహన్‌ స్థాయి పెరగడానికి ఇందులో నాయక పాత్ర తోడ్పడింది. భావి దర్శకుడు టి.కృష్ణ,పోపూరి బాబూరావు సోదరులు, నర్రా వెంకటేశ్వరరావు, వందేమాతరం శ్రీనివాస్‌, వంటి ప్రతిభావంతులెందరో ఈ బాటలో పరిచయమై బాగా రాణించారు.నాంపల్లి టేసనుకాడ, నేను రాను బిడ్డో, లగిబిబి లగిబిగి లంబాడాలం తదితర అనేక ప్రజా గీతాలను ప్రసిద్ధికి తేవడమే గాక అప్పటి వరకూ వాడని శ్రీశ్రీ పాటలను కూడా ఆ చిత్రాలు ప్రాచుర్యంలోకి తెచ్చాయి. ఆ కవులు తర్వాత బాగా పేరు తెచ్చుకున్నారు.
మాదాల తన చిత్రాల్లో వ్యక్తిగత సాహసాలు చూపడం గాక సామూహిక పోరాటాలే సమాజ మార్పునకు సాధనమని స్పష్టంగా చెప్పడం కూడా గుర్తుంచుకోవాలి. విప్లవం వీరత్వం పేరిట ఆయన వాగాడంబారాలకు లేదంటే నేలవిడిచి సాము చేయడానికి పట్టం కట్టలేదు. ఎర్రమల్లెలు లో ఉగ్రవాదం సరికాదని చెప్పడానికి ఒక సన్నివేశమే సృష్టించారు. ఈ విషయంలో ఆయనకూ ఆర్‌నారాయణమూర్తి చిత్రాలకు తేడా వుంటుంది.అలాగే పాటలతోనే విజయం సాధించాలనే ఫార్ములా వుండేది కాదు. కథను బట్టి పాటలను తీసుకునేవారు.
ఈ చిత్రాలు వస్తున్న రోజులలోనే కాస్త అటూ ఇటుగా ఊరుమ్మడి బతుకులు, మాభూమి,్‌ నిజం ,కుక్క, నగసత్యం, తరం మారింది,చలిచీమలు, శంకరాభరణం, వంశవృక్షం, అనుగ్రహం, మావూరికథ వంటివి వచ్చాయి. ఒక నూతన వాతావరణం ఛాయలు గోచరించాయి. తర్వాత కాలంలో మాదాల బృందం విడిపోయింది. విప్లవశంఖం, ప్రజాశక్తి, ఎర్రపావురాలు, మహాప్రస్థానం,నవోదయం,జనం మనం వంటి చిత్రాలు ఆయన స్వయంగానే తీశారు. పోపూరి సోదరులు కృష్ణ విడిగా మరికొన్ని మంచి చిత్రాలు అందించారు. ఇదే గాకుండా తమ్మారెడ్డి లెనిన్‌బాబు భరద్వాజ మరో కురుక్షేత్రం ఆయన,భాను చందర్‌ హీరోలుగానే తీశారు. మాదాల రంగారావు హీరాయిజం లేని కొత్త తరహా చిత్రాలు తీయడం అప్పటి పరిశ్రమ ప్రధాన తారలకు మింగుడు పడలేదు.పాలకవర్గాలకూ రుచించలేదు. వారు అడుగడుగునా అడ్డుపడటం ప్రారంభించారు. పోరాటాలను గురించి చెప్పే ఆ చిత్రాల విడుదలకే పెద్ద పోరాటం అవసరమైంది. ఇది మాదాలకే స్వంతమైన చరిత్ర. . నటీనటులు రాజకీయాలకు దూరంగా వుండాలని కొందరు భావిస్తుంటే మాదాల కమ్యూనిస్టు సభలకు హాజరై నాయకులకన్నా ఆవేశంగా మాట్లాడి చప్పట్టు కొట్టించేవారు. ఎక్కడకు వెళ్లినా ఆయనను పేద ప్రజలు తమ వాడుగా భావించేవారు. మరీ ముఖ్యంగా ఖమ్మం నల్గొండ వంటి ఉద్యమ కేంద్రాలలో ఆయనో ఎర్ర ఆకర్షణ. ఆ రోజుల్లో ఆయన చిత్రాల షూటింగులూ విజయోత్సవాలూ ప్రెస్‌మీట్లు వంటివి చూసిన జ్ఞాపకాలు చాలా వున్నాయి. పటాటోపం అస్సలు లేని స్నేహపూర్వక వాతావరణంలో అరమరికలు ఆర్బాటాలు లేకుండా నడిచిపోతుండేది.1982లో ఆయన చిత్రం ఒక దానికి ప్రభుత్వం అవార్డు నిచ్చింది. అప్పుడు విజయవాడలో సిపిఎం అఖిలభారత మహాసభలూ, ఖమ్మంలో సిపిఐ రాష్ట్ర మహాసభలూ జరుగుతున్నాయి. మాదాల మనోరమ హౌటల్‌లో జరిగిన మహాప్రస్థానం వేడుకలో మాదాల సిపిఎం తరపున ఐతారాములు గారికీ సిపిఐ తరపున టివి చౌదరి గారికి ఆ మొత్తం సమానంగా చేసి విరాళంగా ఇచ్చారు!
ప్రజానటుడుగా అభిమానం చూరగొన్న మాదాలతో చిత్రాలు తీయాలని పాత్రలు వేయించాలని అనుకున్నవారు చాలా మంది వున్నారు. ఆయన 70చిత్రాల్లో నటించారు కూడా. అయితే అర్థమనస్కంగానే.చైర్మన్‌ చలమయ్య తర్వాత ఎన్టీఆర్‌ దానవీర శూర కర్ణలో షూటింగులో పాల్గొని కూడా వద్దని వచ్చేశారు. యువతరం కదిలింది కంటే ముందు విడుదలైన కలియుగ మహాభారతంలో ఆయన భీముడిగా నటించారు. రెడ్‌స్టార్‌ అయ్యాక తను హీరోగా నిర్మాత జయకృష్ణ వీరభద్రుడు తీశారు. మాదాల భిన్నంగా కనిపించారు.నాకు నచ్చింది. ఆ మాటే తనతో అంటే స్నేేహం కోసం నటించానే గాని అలాటి పాత్రలు తనకు ఇష్టముండదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు!
80 వ దశకం నాటికి చిత్రసీమ మరీ దిగజారలేదు. సత్యజిత్‌ రే, శ్యాం బెణగల్‌ మృణాల్‌సేన్‌ వంటి వారు చిత్రాలు తీస్దుండేవారు. అవి పూర్తిగా అర్థంకావనే వ్యాఖ్యలుండేవి.మరోవైపున మాదాల మలిదశలో తీసిన చిత్రాలు మరీ సందేశం కోసమే తీసినట్టు వుంటాయనే విమర్శ వస్తుండేది. ఆయన వాటిని ఖాతరు చేసేవారు కాదు. ప్రజలకు అర్థంకాకుంటే కష్టపడి తీయడమెందుకుని వాదించేవారు. తన చిత్రాలను ఇన్ని రకాలుగా అడ్డుకుంటున్న ప్రభుత్వం ఆ చిత్రాలను అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడానికి అదే కారణమని ఆరోపించేవారు. సంగీతం ప్రజల కోసమేనని చెప్పే జనం మనం విడుదల కూడా గగనమైంది. అనేక పోరాటాల తర్వాత గాని బయిటకు రాలేదు. తర్వాత కాలంలో అలాటి ఇతివృత్తంతోనే దర్శకుడు బాలచందర్‌ చిరంజీవి జెమినీగణేషన్‌ శోభన తదితరులతో తీసిన రుద్రవీణకు కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. దీనిపై బాధపడిన మాదాల కొన్ని విమర్శలు చేస్తే బాలచందర్‌ అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారు. దానికి దీటుగా సమాధానమిచ్చారే గాని సంకోచించలేదు. పైగా చిరంజీవి గురించి ఎంతో ప్రేమగా ప్రస్తావించారు. అన్నా ఈ చిత్రం దానిలాగే వుందంటున్నారు క్యాసెట్‌ ఇస్తే చూస్తానని అడిగి తీసుకెళ్లినట్టు చెప్పారు. చిరంజీవి తనతో అన్నా అంటూ ఎంతో మంచిగా వుంటారని సంతోషంగా చెప్పారు. మాదాలకు నివాళిఅర్పిస్తూ ఆయన కూడా ఇలాగే చెప్పడం వారి అనుబంధాన్ని వెల్లడిస్తుంది. మాదాల ప్రయోగం తర్వాత చిరంజీవి యుగం మొదలైంది. తెలుగు సినిమా వాణిజ్య పరంగా కొత్త పోకడలు పోయింది. వాటిని జీర్ణించుకోలేని ఆయన నిశ్శబ్దంగా ప్రగతిశీల ఉద్యమాలను ప్రోత్సహిస్తూ వుండిపోయారు. ఆయన కుమారుడు రవి, కుటుంబ సభ్యులు కూడా అదే బాటను అనుసరించారు.
సుదీర్ఘ కళా జీవితంలో మాదాల రంగారావు మచ్చలేని జీవితం గడిపారు.ఆశయాల విషయంలో రాజీపడలేదు. కమ్యూనిస్టు ఉద్యమం ఒడుదుడుకులకు గురైనా ఆయన నిశ్చలంగానే బలపరుస్తూ వచ్చారు. ప్రజా ఉద్యమాలు బలపడాలని అందుకు ప్రజా కళలు వికసించాలని తాపత్రయ పడ్డారు. యువతరం కదిలింది వచ్చినప్పుడే శంకరాభరణం కూడా వచ్చింది. ఇప్పుడు వసూళ్లలో సాటిలేని బాహుబలి కథకుడు విజయేంద్ర వర్మ ఆరెస్సెస్‌ వ్యవస్థాపకుడి జీవితం చిత్రంగారాస్తున్నారంటే పరిస్థితులు ఎంతగా మారుతున్నదీ తెలుస్తుంది. వాణిజ్య పరమైన వెర్రితలలూ అశ్లీల పోకడలూ అనారోగ్యకరమైన పోటీలు సరేసరి. ఇప్పుడు మారిన సాంకేతిక పరిజ్ఞానం షార్ట్‌ఫిలింస్‌ గాని సోషల్‌ మీడియా గాని కొత్త ప్రత్యామ్నాయాలను అందిస్తున్నది. ప్రత్యామ్నాయ ప్రయత్నాలకు సహకరించే ఔత్సాహికులూ వున్నారు. సంఘాలు సంస్థలూ కృషి చేస్తున్నాయి. మాదాల రంగారావు జీవితం అలాటి వారందరికీ ప్రేరణ కావాలి. ఆయనలాగే ఫలితాలు సాధించి సార్థకం కావాలి. ఆయనకిదే విప్లవ కళాంజలి.అరుణాంజలి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *